గొర్రెలకాపరులు ఆర్థికంగా ఎదిగేలా చూడాలి

Wed,June 19, 2019 01:27 AM

జనగామ, నమస్తే తెలంగాణ: గొర్రెలు, మేకల పెంపకందారుల జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ జీవాల ఆసరాతో గొర్రెలు, మేకల పెంపకందారులు ఆర్థికంగా ఎదిగేలా మండలాల పశువైద్యాధికారులు చర్యలు చేపట్టాలని పశువైద్య, పశుసంవర్ధక శాఖ రాష్ట్ర అదనపు సంచాలకుడు డాక్టర్‌ రాంచందర్‌ ఆదేశించారు. జిల్లా పశువైద్యాధికారి కార్యాలయంలో మంగళవారం గొర్రెలు, మేకల్లో నట్టల నివారణ, సబ్సిడీ గొర్రెల పంపిణీపై మండల పశువైద్యాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 12 మండలాల్లో ఈ నెల 25వ తేదీ వరకు 9,94,050 గొర్రెలు, 98,657 మేకలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని ఆదేశించారు.

నట్టల నివారణ కోసం ప్రభుత్వం ఒక్కో గొర్రె, మేకకు 2.10 రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. గొర్రెలకాపరులు తమ మందలో పుట్టిన మగ పిల్లలను 3 నెలలలోపు అమ్ముకోకుండా కనీసం 9 నెలల వయస్సు వచ్చే వరకు పెంచుకుంటే అధిక ధర వచ్చి ఆర్థికంగా నిలదొక్కుకుంటారని సూచించారు. కాపరులను పశువైద్యాధికారులు చైతన్యం చేయాలన్నారు. జీవాలకు నట్టల నివారణ మం దు తాగించడం వల్ల వాటిలో రోగనిరోధకశక్తి పెరిగి త్వరగా అధిక బరువు తూగుతాయని వివరించారు. పునరుత్పత్తి పెరిగి మరణాల సంఖ్య కూడా తగ్గుతుందన్నారు. ప్రభుత్వం అవకాశాన్ని జిల్లాలోని అన్ని గ్రామాల గొర్రెల, మేకల పెంపకందారులు, సహకార సంఘం సభ్యులు వినియోగించుకోవాలని కోరారు. సమీక్షలో జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్‌ మాచర్ల భిక్షపతి, జిల్లా పర్యవేక్షణాధికారి డాక్టర్‌ కృష్ణ, వరంగల్‌ రూరల్‌ జిల్లా సహాయ సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాస్‌, పశువైద్యాధికారులు రవిప్రకాశ్‌, రమేశ్‌, అశోక్‌రెడ్డి, సతీశ్‌, సృజన, అనిత, మౌనిక, సింధుప్రియ, భగవాన్‌రెడ్డి పాల్గొన్నారు.

57
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles