గురుకుల విద్యకు పెద్దపీట

Tue,June 18, 2019 03:07 AM

జనగామ, నమస్తే తెలంగాణ, జూన్‌ 17: బడుగు, బలహీన వర్గాల పేద పిల్లలకు కార్పొరేట్‌ తరహా నాణ్యమైన, గుణాత్మక విద్యనందించేందుకు మహాత్మా జ్యోతిబా ఫూలే పేరిట తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు కొత్తగా 119 గురుకుల పాఠశాలలను ప్రారంభించిందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని వికాస్‌ ఫార్మసీ కళాశాల ఆవరణలో సోమవారం ఎమ్మెల్యే బీసీ బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన గురుకులాలు మంచి ఫలితాలు సాధించడంతో వాటి స్ఫూర్తితో సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌కు మూడు గురుకులాలు మంజూరైనట్లు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి కొత్తగా ఒక బీసీ గురుకులాన్ని మంజూరు చేసి, ఒకేరోజు సామూహికంగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయన్నారు.

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా..
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా, దేశాల్లో ప్రధానులు, రాష్ర్టాల్లో ముఖ్యమంత్రులు ఇవ్వని ప్రాధాన్యాన్ని కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం బీసీ సామాజిక వర్గం పిల్లల ప్రాథమిక విద్యకు పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అన్నారు. ఇంటర్నేషనల్‌, ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల మాదిరిగా తెలంగాణ బీసీ గురుకులాల్లో విద్యార్థులకు ప్రతీరోజు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. క్రీడలు, యోగా, సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు పిల్లలకు కార్పొరేట్‌ స్థాయిలో నాణ్యమైన విద్య అందుతోందన్నారు. ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో కంటే ఉన్నత విద్యార్హత కలిగిన ఉపాధ్యాయులతో బోధన, అనుభవజ్ఞుల పర్యవేక్షణ ఉందన్నారు. ఒక్కో గురుకులంలో 5, 6, 7 తరగతులను ఆంగ్ల మాధ్యమంలో ప్రారంభించి, తరగతికి 80 మంది చొప్పున ఒక నియోజకవర్గానికి మొత్తం 240 మందికి అవకాశం లభించనుందన్నారు. ఏటా తరగతి అప్‌గ్రేడ్‌ అవుతుందన్నారు. గత ఏప్రిల్‌లో ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులకే రిజర్వేషన్ల ప్రాతిపదికన ఈ పాఠశాలలో ప్రవేశం కల్పిస్తారని స్పష్టం చేశారు.

ఇప్పటికే జనగామకు 200 మంది విద్యార్థులను కేటాయించారని ఎమ్మెల్యే వివరించారు. గురుకులాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. అంబేద్కర్‌ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలో 500పైగా ఎస్సీ గురుకులాలను ప్రారంభించుకున్నామని, కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణలో అన్నికులాలు, వర్గాలకు సమన్యాయం చేయాలనే పట్టుదలతో పని చేస్తున్న రాష్ట్రంగా గ్లోబ్‌లో తెలంగాణ నిలుస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల బతుకులు బాగుపడాలంటే ముందు వారి పిల్లలను ఉన్నతంగా చదివించాలని, అప్పుడే మేధస్సు పెరిగి, పేదరికానికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని అంబేద్కర్‌, జ్యోతిరావుఫూలే బాటలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నడుస్తున్నారని కొనియాడారు. అన్నిరంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచిగా మార్చేందుకు విప్లవాత్మక మార్పులు, పటిష్టమైన ఆలోచన విధానాలతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు కేసీఆర్‌ రూపకల్పన చేస్తున్నారు.

గురుకులాల మార్పుపై అసంతృప్తి
జనగామ నియోజకవర్గానికి మంజూరైన బీసీ బాలుర రెసిడెన్షియల్‌ స్కూల్‌ను స్టేషన్‌ఘన్‌పూర్‌కు అక్కడ మంజూరైన బాలికల పాఠశాలను జనగామలో ఏర్పాటు చేయడంపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యుడైన జ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాల రీజినల్‌ కో ఆర్డినేటర్‌(ఆర్‌సీవో) లక్ష్మీనారాయణపై సోమవారం కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గత ఏడాది కూడా ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గానికి ఒక బీసీ గురుకులాన్ని మంజూరు చేయగా, జనగామకు బాలికల పాఠశాల మంజూరైంది. బచ్చన్నపేటకు మంజూరైన బాలికల గురుకులాన్ని సాంకేతిక కారణాలతో జనగామ మండలం పెంబర్తి వీబీఐటీలో నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా నియోజకవర్గానికి బాలుర గురుకులం మంజూరు కాగా, సంబంధిత అధికారులు జనగామలో బాలుర పాఠశాలకు యజమానులు భవనం అద్దెకు ఇవ్వడం లేదనే సాకుతో ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన బాలుర పాఠశాలను స్టేషన్‌ఘన్‌పూర్‌కు తరలించి, స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఏర్పాటు చేయాల్సిన బాలికల పాఠశాలను జనగామలో ప్రారంభించారు. ఒకే నియోజకవర్గానికి రెండు బాలికల గురుకులాల వల్ల బీసీ బాలుర ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కలెక్టర్‌కు రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ శ్రీనివాసరావు, పెంబర్తి బాలికల ప్రిన్సిపాల్‌ చంద్రారెడ్డి, జనగామ జెడ్పీటీసీ సభ్యురాలు బాల్దె విజయ, ఎంపీపీ బైరగోని యాదగిరిగౌడ్‌, నూతన ఎంపీపీ మేకల కళింగరాజు, టీఆర్‌ఎస్‌ నాయకులు నిమ్మతి మహేందర్‌రెడ్డి, ఉల్లెంగుల నర్సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

65
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles