జిల్లాకు మరో మూడు గురుకులాలు


Mon,June 17, 2019 02:06 AM

జనగామ, నమస్తే తెలంగాణ : జిల్లాకు కొత్తగా మరో మూడు బీసీ గురుకులాలు మంజూరయ్యాయి. ప్రతీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్రప్రభుత్వం మంజూరు చేసిన ఈ పాఠశాలను సోమవారం ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాకు కొత్తగా మంజూరైన మహాత్మా జ్యోతిరావు ఫూలే పేరిట నెలకొల్పిన బీసీ గురుకులాలను పాలకుర్తి నియోజకవర్గంలోని గిర్నితండా(మొండ్రాయి), జనగామ నియోజకవర్గ కేంద్రంలోని వికాస్ ఫార్మసీ కళాశాలలో, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలోని మోడల్ కాలనీ సమీపంలో ఏర్పాటుచేశారు. మొండ్రాయి, జనగామకు బాలికల, స్టేషన్‌ఘన్‌పూర్‌కు బాలుర గురుకులాలు మంజూరు కాగా, ఒక్కో గురుకులంలో 5, 6, 7 తరగతులను ఆంగ్లమాధ్యమంలో ప్రారంభించి తరగతికి 80 మంది చొప్పున ఒక నియోజకవర్గానికి మొత్తం 240 మందికి అవకాశం లభించనుంది. జిల్లాలోని మొత్తం మూడు గురుకులాల్లో 720 మంది విద్యార్థులకు ఈ ఏడాది నుంచి ప్రవేశాలు లభించనున్నాయి. ఇందు కోసం గత ఏప్రిల్‌లో ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్ధులకే రిజర్వేషన్ల ప్రాతిపదికన ఈ పాఠశాలలో ప్రవేశం కల్పించనున్నారు. గురుకులాలపై రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బడుగు, బలహీనవర్గాల పిల్లలకు గుణాత్మక విద్యను అందించడానికి మహాత్మా జ్యోతిరావు ఫూలే పేరిట నెలకొల్పిన బీసీ గురుకులాలు సత్ఫలితాలు ఇస్తుండటంతో వాటి స్ఫూర్తితో గురుకులాల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జిల్లాలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ మూడు గురుకుల పాఠశాలలు మంజూరయ్యాయి. జిల్లాలో ఇప్పటికే రెండు గురుకులాల్లో పేద విద్యార్ధులు కార్పొరేట్ తరహా విద్యను అభ్యసిస్తుండగా, కొత్తగా మరో మూడు మంజూరు కావడంతో జనగామ జిల్లాలో బీసీ గురుకులాల సంఖ్య పాత వాటితో కలిపి ఐదుకు చేరింది.


నేడు మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా ప్రారంభం..
సోమవారం ఉదయం 10 గంటలకు గిర్నితండా(మొండ్రాయి)లో బీసీ బాలికల గురుకుల పాఠశాలను రాష్ట్రపంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్ రాజయ్య చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన గురుకుల పాఠశాలల్లో పేద విద్యార్ధులకు పౌష్టికాహారం, క్రీడలు, యోగా, సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్య అందుతోంది. ఫలితంగా జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలల్లో తమ పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు ఆకస్తి చూపుతున్నారు.

ఏటా పెరుగుతున్న పోటీ..
గురుకులాల్లో ఏటా నిర్వహించే ప్రవేశ పరీక్ష కోసం భారీ సంఖ్యలో విద్యార్ధులు హాజరవుతున్నారు. ఈఏడాది సైతం ఒక్కో సీటుకు నలుగురు చొప్పున విద్యార్థులు పోటీ పడినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, తమ పిల్లల చదువుల కోసం ప్రభుత్వం కొత్త గురుకులాలు ఏర్పాటు చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బీసీ గురుకులాల్లో చదువుకునే ప్రతీ విద్యార్థికి బెడ్డింగ్ మెటీరియల్, పుస్తకాలు, నోట్‌పుస్తకాలు, మూడు జతల స్కూల్ యూనిఫారం దుస్తులు, ట్రాక్‌సూట్ అందజేస్తారు. మెనూతో కూడిన పౌష్టికాహారం, మగ పిల్లలకు కాస్మోటిక్ చార్జీలు, ఆడపిల్లలకు కాస్మోటిక్ కిట్లు అందజేస్తారు. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన, కంప్యూటర్ విద్య, ప్రయోగాలు, విద్యర్థులకు చదువుతోపాటు ఆటపాటలు, అనుబంధ కార్యక్రమాల్లో ఉచిత శిక్షణ ఇస్తారు.

జిల్లాలో 720 మందికి ప్రయోజనం..
జిల్లాకు నూతనంగా మంజూరైన బీసీ గురుకులాల్లో మొదటి సంవత్సరం 5, 6, 7 తరగతులను ఆంగ్ల మాధ్యమంలో ప్రారంభించనున్నారు. తరగతికి 80 మంది చొప్పున ఒక్కో పాఠశాలలో 240 మందికి మొత్తం జిల్లాలో 720 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరనుంది. ఈ విద్యాలయాల్లో ప్రవేశానికి విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే గత ఏప్రిల్‌లో టీజీసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. అందులో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రిజర్వేషన్ల ప్రాతిపదికన ప్రవేశాలు కల్పించనున్నారు. ఒక వేల సీట్లు మిగిలితే రెండో విడత కౌన్సెలింగ్ చేపట్టి భర్తీ చేస్తారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన బీసీ గురుకుల పాఠశాలల్లో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. విద్యార్ధులకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ద్వారా 5, 6, 7 తరగతుల్లో అడ్మిషన్లు ఇవ్వనున్నారు. పాత బీసీ గురుకులాల్లో పనిచేస్తున్న ప్రిన్సిపాల్ వార్డెన్‌లను కొత్త పాఠశాలలకు డిప్యూటేషన్‌పై పంపించారు. వీరి స్థానంలో కొత్త వారిని కాంట్రాక్టు విధానంలో నియమించుకున్నారు. క్యాటరింగ్ కోసం టెండర్ ప్రక్రియను అనుసరిస్తుండగా, సెక్యూరిటీ, స్వీపింగ్, శానిటేషన్, ఇతర సిబ్బందిని ఔట్‌సోర్సింగ్‌పై నియమించనున్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్; నమస్తే తెలంగాణ : నిరుపేద విద్యార్థులకు గురుకుల పాఠశాలలు విద్యాకుసుమాలుగా మారాయి. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 119 బీసీ గురుకుల పాఠశాలలను సోమవారం ప్రారంభించేందుకు అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక మోడల్ కాలనీ ఆవరణలో ఏర్పాటుచేసిన నూతన గురుకులం పాఠశాలను అధికారులు నేడు ప్రారంభానికి అన్ని ఏర్పాట్లుచేశారు. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభించనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాజయ్య హాజరుకానున్నారని అధికారులు తెలిపారు. ఇదే క్రమంలో అవసరాలను ప్రత్యేకంగా పరిశీలించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా అనుకూలమైన భవనాన్ని అద్దెకు తీసుకుని అధికారులు చర్యలు చేపట్టారు.

ఒక్కో తరగతికి 80 సీట్లు..
నూతనంగా ప్రారంభకానున్న బీసీ గురుకులం పాఠశాలలో 5, 6, 7 తరగతులు ప్రారంభం కానున్నాయి. ఒక్క తరగతిలో 80 సీట్లు ఉంటాయి. గురుకుల పాఠశాలలో 240 మంది విద్యార్థులు గురుకులాల్లో విద్యాభ్యాసం చేయనున్నారు. ఈక్రమంలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులకు సౌకర్యవంతమైన సదుపాయాలు, అన్ని వసతులను అధికారులు ఇప్పటికే ఏర్పాటుచేశారు.

విద్యార్థులకు సకల సౌకర్యాలు
నూతనంగా ఏర్పాటుచేసిన మహాత్మ జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాల సోమవారం ఉదయం 8 గంటలకు ఎమ్మెల్యే రాజయ్య చేతుల మీదుగా ప్రారంభించనున్నాం. ఎక్కడా ఎలాంటి సమస్యలు లేకుండా విద్యార్థులకు పూర్తిస్థాయిలో సౌకర్యవంతంగా ఉండేవిధంగా భవనం అద్దెకు తీసుకున్నాం. విద్యార్ధులకు అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటుచేశాం.
- ప్రిన్సిపాల్ మల్లయ్య,స్టేషన్ ఘన్‌పూర్

101

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles