రెవెన్యూ శాఖను సంస్కరిస్తున్న సీఎం

Sun,June 16, 2019 01:59 AM

లింగాలఘనపురం/రఘునాథపల్లి, జూన్‌ 15: ‘ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం రెవెన్యూ శాఖ జోలికి వెళ్లలేదు. ఏళ్ల తరబడి ఎన్నో సమస్యలతో రైతులు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో అర్హులైన రైతులకు ప్రభుత్వ ఫలాలు అందించేందుకు సీఎం కేసీఆర్‌ సాహసోపేతమైన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు’ అని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య అన్నారు. శనివారం ఆయన లింగాలఘనపురం, రఘునాథపల్లిలో ఏర్పాటు చేసిన వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొని రైతులకు పట్టా సర్టిఫికెట్లు, పాసుపుస్తకాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. లింగాలఘనపురం మండలంలో 278.05 ఎకరాల అసైన్డ్‌ భూమికి చెందిన లబ్ధిదారులకు పట్టా సర్టిఫికెట్లు, 218 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఆర్డీవో మధుమోహన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రెవెన్యూ శాఖ తేనెతెట్టె లాంటిదని, ఆ శాఖ జోలికి గత ప్రభుత్వాలు వెళ్లలేదన్నారు. నిజాం సర్కారు హయాంలో 1934లో తెలంగాణలో భూ సర్వేలు జరిగాయన్నారు. మళ్లీ టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో 85 ఏళ్ల తర్వాత భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టి వంద రోజుల్లోనే రెవెన్యూ అధికారులు కార్యాలయ పనులన్నీ పక్కనపెట్టి గ్రామాల్లోకి వెళ్లి విజయవంతంగా సర్వే నిర్వహించారని వివరించారు.

రిజర్వాయర్ల ద్వారా సాగునీరు
రైతులకు పక్కాగా భూములను నిర్దేశిస్తూ.. ఎక్కడా లేనివిధంగా అన్నదాతలకు రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. లింగాలఘనపురం మండలానికి మూడు రిజర్వాయర్ల ద్వారా సాగునీరు అందనుందన్నారు. ఆరునూరైనా అతిత్వరలో మండలంలోని చెరువులన్నింటినీ గోదావరి జలాలతో నింపి 40 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు.
85 శాతం పరిష్కారం
జనగామ డివిజన్‌ పరిధిలో చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన సర్వేలో 85 శాతం సమస్యలు పరిష్కరించామని ఆర్డీవో మధుమోహన్‌ అన్నారు. రెవెన్యూ శాఖపై ఉన్న కొన్ని ఆరోపణలను తొలగించుకున్నట్లు చెప్పారు. జేష్ఠపాలు, వివాహమై వెళ్లిన కూతురు విషయంలో, కొన్ని సాంకేతికపరమైన సమస్యలతో 185 కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని వివరించారు. వాటిని కూడా అతిత్వరలో పరిష్కరిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన మరుసటి రోజు నుంచే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో కొమురవెల్లి దేవస్థాన చైర్మన్‌ సేవెల్లి సంపత్‌, జెడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి, ఎంపీపీ బోయిని శిరీష, ఎంపీపీ చిట్ల జయశ్రీ, తహసీల్దార్‌ రంగ, ఎంపీడీవో సురేందర్‌, జనగామ వ్యవసాయ మార్కెట్‌ మాజీ డైరెక్టర్లు మర్రి భాస్కర్‌రెడ్డి, ఉడుగుల భాగ్యలక్ష్మి, సర్పంచ్‌లు సాదం విజయ మనోహర్‌, కత్తుల శ్రీపాల్‌రెడ్డి, ఎంపీటీసీ ఉప్పల మధు తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు లేని గ్రామాలే లక్ష్యం
భూ సమస్యలు లేని గ్రామాలే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. రఘునాథపల్లిలో తహసీల్దార్‌ తిరుమలాచారి అధ్యక్షతన ప్రభుత్వ భూమి పట్టాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతులమీదుగా అందించారు. మండలంలో ఇప్పటికే అర్హులైన ప్రతీ రైతుకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. పెండింగ్‌లో 859 ఉండగా, శనివారం 330 మందికి పట్టాదారు పాసుపుస్తకాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ 3,332 ఎకరాల అసైన్డ్‌ భూముల్లో 4,318 మందిని అర్హులుగా గుర్తించి పట్టాలు ఇచ్చామన్నారు. ఏ రాష్ట్రంలో చేపట్టిని అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణలో సీఎం కేసీఆర్‌ అమలు చేస్తూ దేశంలోనే నంబర్‌వన్‌ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. రైతును రాజు చేసేందుకు ప్రభుత్వం లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తోందన్నారు. నేడు పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌ చేపడుతున్న పథకాలను కాపీ కొడుతున్నారన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రతీ రైతుకు పాసుపుస్తకం అందించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుమోహన్‌, ఎంపీపీ దాసరి అనిత, నూతన ఎంపీపీ మేకల వరలక్ష్మి, జెడ్పీటీసీ బొల్లం అజయ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు పోకల శివకుమార్‌, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు మడ్లపల్లి సునీత, జనగామ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ నామాల బుచ్చయ్య, రైతుల సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్‌ గొరిగె రవి, గ్రామ కో ఆర్డినేటర్‌ రేసు కుమార్‌, ఎంపీటీసీలు గవ్వాని నాగేశ్వర్‌రావు, దొనికెల రమాదేవి, సర్పంచ్‌లు గుడి రాంరెడ్డి, నాయకులు ఉమ్మగోని ఉప్పలయ్య, మడ్లపల్లి రాజు, టీఆర్‌ఎస్‌ నాయకులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

68
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles