వడివడిగా బడిబాట

Sat,June 15, 2019 02:31 AM

-పల్లెల్లో ప్రత్యేక కార్యక్రమాలు
-బటి బయట పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించడమే లక్ష్యం
-ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలపై విస్తృత ప్రచారం
-జనగామలో బడిబాటను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
జనగామ, నమస్తే తెలంగాణ, జూన్‌ 14: బడీడు పిల్లలు, బడి బయట ఉన్న వారిని సర్కారు పాఠశాలల్లో చేర్పించడమే లక్ష్యంగా చేపట్టిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమం శుక్రవారం జిల్లాలో ఉత్సాహంగా ప్రారంభమైంది. సర్కారు బడుల బలోపేతంపై దృష్టి సారించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. ఐదు రోజుల స్పెషల్‌ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టింది. ప్రజాప్రతినిధులు, అధికారులను భాగస్వామ్యం చేస్తూ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, సదుపాయాలు, విద్యార్థులకు అందిస్తున్న మెరుగైన, నాణ్యమైన విద్యా విధానంపై గ్రామాల్లో విస్తృత ప్రచారం చేపట్టారు.

ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, ఎస్‌ఎంసీ కమిటీ సభ్యులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించి బడి బయట విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించడం ద్వారా విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు విద్యా శాఖ కార్యాచరణ రూపొందించింది. ప్రైవేట్‌ పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులను సర్కారు చదువు వైపు ఆకర్షించేలా కార్యక్రమాలు రూపొందించారు. మొదటిరోజు అన్ని పాఠశాలల్లో ‘మన ఊరిబడి’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో బ్యానర్లతో ర్యాలీలు, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలపై వివరించడంతోపాటు నాణ్యమైన విద్యను పెంపొందించేందుకు తీర్మానం చేశారు. శనివారం బాలికలకు మార్షల్‌ ఆర్ట్స్‌, జీవన నైపుణ్యాల వంటి శిక్షణ ఇచ్చి బాలికా విద్యపై మహిళా అధికారులతో ఉపన్యాసాలు, 17న సామూహిక అక్షరాభ్యాసాలు, 18న స్వచ్ఛ పాఠశాల/హరితహారం, 19న బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించడం, పనికోసం వలస వచ్చిన వారి పిల్లలను గుర్తించి సమీపంలోని పాఠశాలల్లో చేరేలా అవగాహన, మండల టాస్క్‌ఫోర్స్‌ కమిటీతో కలిసి బాలకార్మికులకు విముక్తి కల్పించి వారిని పాఠశాలల్లో చేర్పించడం వంటి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది.

సర్కార్‌ బడిలో చేర్పించండి : ముత్తిరెడ్డి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డాయని, కార్పొరేట్‌ చదువులకు దీటైన బోధన కోసం విద్యా రంగానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్‌లోనూ అధిక నిధులను సీఎం కేసీఆర్‌ కేటాయిస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. జనగామలోని ప్రభుత్వ జిల్లా పరిషత్‌ బాలికల హైస్కూల్‌లో శుక్రవారం ఆయన బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం నల్ల విష్ణువర్ధన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో సన్న బియ్యంతో భోజనం, ఏటా రెండు జతల స్కూల్‌ యూనిఫాంలు, ఉచిత పాఠ్యపుస్తకాలు అందిస్తూ గొప్ప మార్పునకు టీఆర్‌ఎస్‌ సర్కార్‌ శ్రీకారం చుట్టిందన్నారు.

అంతేకాకుండా పాఠశాలల్లో ప్రత్యేక వంట గదుల నిర్మాణం, విద్యార్థులకు సరిపడా ఫర్నిచర్‌, మరుగుదొడ్లు, ప్రహరీ నిర్మాణం వంటి సౌకర్యాలు ఉన్నాయన్నారు. జనగామ జెడ్పీ బాలికల హైస్కూల్‌లో దాత సురేశ్‌రెడ్డి సహకారంతో బాలికలకు బూస్ట్‌తో కూడిన పాలను ప్రతీరోజు అందిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా మరో దాత సుకన్య, లీల విద్యార్థులకు ఉచితంగా నోట్‌బుక్స్‌ అందిస్తుండడం అభినందనీయమన్నారు. పాఠశాలకు నూతన భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో జనగామ జెడ్పీటీసీ సభ్యులు బాల్దె విజయ సిద్ధిలింగం, ఎంపీపీ బైరగోని యాదగిరిగౌడ్‌, ఎంఈవో బద్రోద్దీన్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు బండ యాదగిరిరెడ్డి, ఉపాధ్యాయులు అమ్తుల్‌ ఆలియా, మాధవి, సర్వర్‌ మొయియొద్దీన్‌, ఏ శ్రీనివాస్‌, అన్నపూర్ణ, సుచిత, ఖద్సియా, నిక్కత్‌, లీల, సుమన్‌, షకీల్‌బాబు, గులాం సంధాని పాల్గొన్నారు.జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్‌ యూపీపీఎస్‌ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు శివాలయం, పాతబీట్‌ బజార్‌లో ర్యాలీ నిర్వహించగా, హెడ్మాస్టర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏబీవీ ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాలలో కార్యదర్శి హరిశ్చంద్రగుప్త ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, టై, బెల్ట్‌, బ్యాడ్జీలు, హెల్త్‌కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి హెచ్‌ఎం శోభాకిరణ్‌, ఉపాధ్యాయులు శశికళ, విజయ్‌కుమార్‌, రాజ్యలక్ష్మి, నాగరాజు, రమాదేవి, రాజసంపత్‌గౌడ్‌, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles