అర్హులందరికీ పట్టాదారు పాసుపుస్తకాలు

Thu,June 13, 2019 01:18 AM

జనగామ, నమస్తే తెలంగాణ, జూన్ 12 : కేసీఆర్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకమైన రైతు బంధు కింద కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ వందశాతం పూర్తిచేసి రెవెన్యూ చిక్కులు లేని జిల్లాగా రాష్ట్రంలోనే జనగామను నంబర్‌వన్ స్థానంలో నిలపాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. జనగామ మండల రెవెన్యూ కార్యాలయం ఆవరణలో రైతుబంధు పెండింగ్ పాసుపుస్తకాలు, రెవెన్యూ సమస్యలపై బుధవారం కలెక్టర్ టీ వినయ్‌కృష్ణారెడ్డితో కలిసి రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమావేశంలో బాధిత రైతులు చేసుకున్న ఆప్పీళ్లు, దరఖాస్తులు, ఫిర్యాదులను వారం పదిరోజుల్లో పరిష్కరించాలని, అందుకోసం ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేసి అధికారులను నియమించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. గ్రామం యూనిట్‌గా రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కరిస్తే వందశాతం రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందజేస్తే కలెక్టర్ సహా జిల్లా రెవెన్యూ అధికారులతో సీఎం వద్దకు వెళ్లి కేసీఆర్‌తో కలిసి మధ్యాహ్నం భోజనం చేసేలా తాను చొరవ చూపుతానని అన్నారు.

గ్రామాల్లో వివిధ కారణాల వల్ల వీఆర్‌వోలు రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నట్లు అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిలో నిజానిజాలను తేల్చి నిజమైన రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. భూమి ఉన్న ప్రతీ రైతుకు తప్పకుండా యాజమాన్యపు హక్కు కల్పించాలని, కోర్టు వివాదాలు, ఇతరాత్రా ఉంటే తప్ప భూమి ఫలాలు అనుభవిస్తున్న రైతులకు రైతుబంధు పాసుపుస్తకం అందాలన్నారు. కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ పట్టాదారు పాసుపుస్తకాలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిలో ఎక్కువగా తాతలు, తండ్రులు ఎప్పుడో భూమి అమ్ముకుంటే వారి వారసులు వచ్చి ఆ భూమి తమకు చెందుతుందని పిటిషన్లు ఇస్తున్నారని అన్నారు. భూమి కొనుగోలు చేసిన రైతులు సాదాబైనామా కింద దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆ సంతకాలు తమవి కాదని పేచీలు పెడుతున్నారని అన్నారు. కోర్టు నుంచి, న్యాయవాది నుంచి నోటీసు తెచ్చి పట్టాదారు పాసుపుస్తకం ఆపాలంటూ కోరుతున్నారని కలెక్టర్ అన్నారు.

వాస్తవానికి గతంలో పట్టాదారు పాసుపుస్తకం అందుకొని కొత్తగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధు పాసుపుస్తకం పొందిన రైతుల భూములపై యాజమాన్యపు హక్కును రద్దుచేసే అధికారం జారీచేసిన తహసీల్దార్లకు లేదని, ఎదైనా అభ్యంతరం ఉంటే ఆర్డీవో కోర్టుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కోర్టు నుంచి ఉత్తర్వులు ఉంటే తప్ప లాయర్ నోటీసు, కోర్టు నోటీసులతో భూమిపై నిర్ణయం తీసుకునే అధికారం ఉండదన్నారు. సాదాబైనామా ఉండి దరఖాస్తు చేసుకుంటే భూమికి ఖచ్చితంగా పట్టా చేయాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు. కాగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 80మంది లబ్ధిదారులకు ప్రభు త్వ భూమి రీ అసైన్డ్ పట్టాలు, 89 మంది లబ్ధిదారులకు పట్టాదారు పాసుపుస్తకాలు, 114మంది రైతులకు మ్యూటేషన్ ప్రొసిడింగ్ పత్రాలను ఎమ్మెల్యే, కలెక్టర్, ఆర్డీవో మధుమోహన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, డిప్యూటీ తహసీల్దార్ రమేశ్, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ బూరెడ్డి ప్రమో ద్‌రెడ్డి, నూ తన జెడ్పీటీసీ, ఎంపీపీలు నిమ్మతి దీపికా మహేందర్‌రెడ్డి, కలింగరాజు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

92
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles