బడికి వేళాయె..!

Wed,June 12, 2019 01:44 AM

జనగామ, నమస్తే తెలంగాణ, జూన్ 11: రెండు నెలల విరామం తర్వాత బుధవారం బడిగంట మోగనుంది.. వేసవి సెలవుల్లో ఆటపాటలతో సరదాగా గడిపిన విద్యార్థులు నేడు పాఠశాలల బాట పట్టనున్నారు. ఆటపాటలను పక్కనపెట్టి.. పుస్తకాల బరువును భుజానెత్తి చిన్నారులంతా బుడిబుడి అడుగులతో బడికి పయనం కానున్నారు. పాఠశాలల పునఃప్రారంభానికి ముందే తల్లిదండ్రుల హడావుడి మొదలైంది. రెండు నెలలు సెలవుల్లో ఆనందంగా గడిపిన విద్యార్థులు ఇక పుస్తకాలతో కుస్తీ పట్టనున్నారు. ఈసారి వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న దృష్ట్యా నూతన విద్యా సంవత్సరం క్యాలెండర్ షెడ్యూల్‌లో మార్పులు చేశారు. విద్యాశాఖ నిర్దేశించిన మేరకు ఈ నెల 1న ప్రారంభం కావాల్సి ఉండగా, దాదాపు 11 రోజుల ఆలస్యంగా బుధవారం నుంచి పాఠశాలలు తిరిగి తెరుచుకుంటున్నాయి. గతంలో ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు ఉండేవి. రెండేళ్లుగా ఏప్రిల్ 13 నుంచి మే 31 వరకు సెలవులు ప్రకటించి.. జూన్ 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నిర్వహించుకునేందుకు వీలుగా సెలవుల షెడ్యూల్‌ను ప్రభుత్వం ముందుకు జరిపింది. అయితే, ఈసారి అధిక ఉష్ణోగ్రతల కారణంగా పాత షెడ్యూల్ ప్రకారమే పాఠశాలలు తెరవాలని విద్యాశాఖ నుంచి ఆదేశాలు అందాయి. దీంతో ముందుగా ప్రభుత్వం ప్రకటించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం షెడ్యూల్ సైతం మారింది. విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన పాఠ్య పుస్తకాలు, రెండు జతల యూనిఫాంలను ప్రభుత్వం ఇప్పటికే ఎమ్మార్సీలు, పాఠశాలలకు చేర్చింది.

మొదటి రోజు నుంచే భోజనం
పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజు నుంచే మధ్యాహ్న భోజనం కూడా అందించాలని విద్యాశాఖ నిర్ణయించింది. మరోవైపు జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల బస్సుల ఫిట్‌నెస్ పరీక్షలను రవాణా శాఖ కొనసాగిస్తోంది. పాఠశాలలు ప్రారంభం కానుండడంతో పిల్లలకు కావాల్సిన పుస్తకాలు, నోటు బుక్కులు, వస్తు సామగ్రి కొనుగోళ్లలో తల్లిదండ్రులు బిజీ అయ్యారు. జిల్లాకేంద్రంతోపాటు మండలాలు, ప్రధాన గ్రామాల్లో ఎక్కడ చూసినా పుస్తకాల కొనుగోళ్ల సందడి కనిపిస్తోంది. యూనిఫాం, షూ, కంపాస్ బాక్స్, టై, బ్యాగు, పలకలు, పెన్నులు, పెన్సిళ్లు, జామెట్రిబాక్స్‌లు, వాటర్ బాటిళ్లు, టిఫిన్ బాక్స్‌లు, సైకిళ్లు వంటివి కొనుగోళ్లతో తల్లిదండ్రులు దుకాణాల్లో సందడి చేస్తున్నారు.

ఆటపాటలతో ఆంగ్ల విద్య
ఒకప్పుడు ఇంగ్లిష్ మీడియం బోధన అంటే ప్రైవేట్ పాఠశాలలకే పరిమితమయ్యేది. ఇప్పుడు ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలల్లో ప్రారంభించి దీటైనా విద్యాబోధన చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నచోట విద్యా వలంటీర్లను నియమించింది. ఇటీవల ప్రభుత్వం వారి వేతనాలు కూడా పెంచింది. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలలకు అనుసంధానం చేసి కేంద్రాలకు వస్తున్న పిల్లలను కొంతమందినైనా ఐదేళ్లు నిండిన తర్వాత సర్కారు బడిలో చేర్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదయ్యే 3 నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులకు ఆటపాటలు, కృత్యాలతో ఆంగ్ల అక్షరాలను నేర్పించి నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీలను పూర్తి చేయించి అదే ప్రాంగణంలో ఉండే ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తెలంగాణ సర్కార్ భావిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాలను రూ. 10,500 పెంచి ఇక నుంచి వారిని టీచర్లుగా పిలువాలనే నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చారు. జిల్లాలో మూడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 732 అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన 49,776 మంది చిన్నారులకు 517 మంది కార్యకర్తలు, 674 మంది హెల్పర్లు పని చేస్తున్నారు.

అందుబాటులో క్రీడా సామగ్రి..
ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు చిన్నారులకు ఆటలు, పాటలు, సృజనాత్మకత పరిశీలన, కథలు, పరిశుభ్రతపై శ్రద్ధ పెడుతున్నారు. ఇందుకోసం అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆటల సామగ్రిని అందుబాటులో ఉంచారు. ప్రైవేట్ నర్సరీ స్కూళ్లలో మాదిరిగా ఇక్కడ చిన్నారులకు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆసక్తిగా ఉండే కృత్యాలను నేర్పిస్తున్నారు. చిన్నారులకు అవసరమైన క్రీడా సామగ్రి, బొమ్మలు అందుబాటులో ఉన్నాయి. వారికి నర్సరీ స్థాయిలో ఉల్లాస వాతావరణం కల్పిస్తూ కొంతమేరకు బోధన జరుగుతున్నది.కొన్నిచోట్ల అద్దె ఇళ్లలో ఇరుకుగా ఉండే గదుల్లో కేంద్రాలు నిర్వహించడం, చిన్నారులను ఆడించడం, గోడలపై ఆకర్షణీయ బొమ్మలు వేయడం వంటివి కొంత ఇబ్బందికరంగా ఉండడంతో అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానం చేసి ఆ పాఠశాలల్లో ప్రత్యేకంగా పూర్వ ప్రాథమిక తరగతులకు ఓ గదిని కేటాయించారు.

14 నుంచి బడిబాట ప్రచారం
ఈ నెల 14 నుంచి 19వ తేదీ వరకు ఇంటింటి ప్రచారం ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఐదురోజులపాటు ప్రతీరోజు నిర్వహించే బడిబాటలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు పాల్గొనాలి. బడిబాటలో భాగంగా పాఠశాలలను ఆకర్షిణీయంగా తీర్చిదిద్దాలి.
-14వ తేదీన మన ఊరిబడి కార్యక్రమం ద్వారా గ్రామాల్లోని పాఠశాలలను ఆకర్షణీయంగా అలంకరించుకోవాలి. బడి ప్రాధాన్యం గుర్తించే విధంగా బ్యానర్లతో ర్యాలీలు, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి మన ఊరిబడి ప్రభుత్వ పాఠశాలల గురించి వారికి వివరించడంతోపాటు నాణ్యమైన విద్యను పెంపొందించేందుకు తీర్మానం చేయాలి.
-15న బాలికల విద్యపై దృష్టి సారించి వారికి మార్షల్ ఆర్ట్స్, జీవన నైపుణ్యాల వంటి శిక్షణ ఇచ్చి బాలికల విద్య ప్రాధాన్యం తెలియజేసేలా మహిళా అధికారులతో ఉపన్యాసాలు ఇప్పించాలి.
-17న సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించి స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలి. ఉన్నత పాఠశాలల్లో నూతనంగా చేరిన విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాలి.
-18న స్వచ్ఛ పాఠశాల/హరితహారం నిర్వహించి ప్రతీ తరగతి గదిని పరిశుభ్రంగా తయారు చేయాలి. పాఠశాల ఆవరణాన్ని ఆకర్షిణీయంగా తీర్చిదిద్దాలి. మరుగుదొడ్ల నిర్వహణ కోసం నీటి సదుపాయాన్ని కల్పించాలి.
-19న బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించాలి. పనికోసం వలస వచ్చిన వారి పిల్లలను గుర్తించి సమీపంలోని పాఠశాలల్లో చేరేలా అవగాహన కల్పించాలి. మండల టాస్క్‌ఫోర్స్ కమిటీతో కలిసి బాలకార్మికులకు విముక్తి కల్పించి వారిని పాఠశాలల్లో చేర్పించాలి.

76
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles