దొంగల బీభత్సం..

Mon,May 27, 2019 01:46 AM

- జనగామలో రెండిళ్లలో చోరీ..
- తాళం పగులగొట్టి.. తాపీగా పని కానిచ్చేశారు..
- ఇంటి డాబాపై నిద్రిస్తుండగానే దొంగతనం..
- 13.5 తులాల బంగారం, 53 తులాల వెండి, రూ.1.41 లక్షల నగదు అపహరణ
- ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ వినోద్‌కుమార్
- రంగంలోకి దిగిన క్లూస్‌టీం
- కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

జనగామ టౌన్, మే 26: జిల్లాకేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలోని వాసవీ, హర్షనగర్ కాలనీల్లో తాళం వేసి ఉన్న రెండు ఇళ్లలో శనివారం అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. వాసవీకాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బాలరాజు ఇటీవల ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లారు. ఇది గమనించిన గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు శనివారం అర్ధరాత్రి బాలరాజు ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లోని వస్తువులను, బీరువాలను ధ్వంసం చేసి బంగారం, వెండితోపాటు నగదును దోచుకెళ్లారు. కాగా, బాలరాజు ఇంట్లో దొంగతం చేసి పక్కనే ఉన్న మరో ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన దొంగలను కాలనీలోని ఇద్దరు వ్యక్తులు గమనించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు పరారైనట్లు తెలిపారు. దీంతో కాలనీవాసులంతా అప్రమత్తమై వెంటనే జనగామ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పో లీసులు బస్టాండ్, రైల్వేస్టేషన్ తదితర ప్రధాన ప్రాంతాల్లో త నిఖీలు చేపట్టినా ఫలితం లేకపోయింది. ఈ మేరకు బాలరాజుకు తన ఇంట్లో దొంగతనం జరిగిందని స్థానికులు సమాచారం అందించగా, హైదరాబాద్ నుంచి జనగామకు చేరుకుని ఇంట్లోని వస్తువులను పరిశీలించాడు. 13 తులాల బంగారు ఆభరణాలు, 45 తులాల వెండి వస్తువులతోపాటు బీరువాలోని రూ. 1,35,000 నగదును దొంగలు అపహరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు వెంటనే వరంగల్ పోలీస్ కమిషనరేట్ నుంచి క్లూస్‌టీంలను రంగంలోకి దింపి దొంగల వేలిముద్రలు తదితర ఆధారాలను సేకరించారు.

హర్షనగర్ కాలనీలో..
వాసవీనగర్ కాలనీకి ఆనుకొని పక్కనే ఉన్న హర్షనగర్‌లో సైతం కృష్ణారెడ్డి అనే వ్యక్తికి చెందిన ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. ఎండ వేడమికి ఇంట్లో ఉక్క పోస్తోందని కృష్ణారెడ్డి ఇంటికి తాళం వేసి తన కుటుంబ సభ్యులతో కలిసి బంగ్లాపై పడుకున్నారు. కాగా, దొంగలు ఆ ఇంట్లోకి చొరబడి అర్ధ తులం బంగారం, 8 తులాల వెండి వస్తువులు, రూ. 6000 నగదును దోచుకెళ్లారు. ఈ చోరీల ఘటనపై వెస్ట్‌జోన్ డీసీపీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఏసీపీ వినోద్‌కుమార్, సీఐ మల్లేశ్‌యాదవ్, ఎస్సైలు రవికుమార్, రాజేశ్‌నాయక్, కానిస్టేబుళ్లు సతీశ్, కృష్ణ స్థానికుల వద్ద వివరాలను సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు జిల్లావ్యాప్తంగా గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఊరికెళ్తే పోలీసులకు సమాచారం అందించాలి
ప్రజలు తమ ఇంటి నుంచి దూర ప్రాంతాలకు వెళ్లేముందు పోలీసులకు సమాచారం అందించాలని ఏసీపీ వినోద్‌కుమార్ సూచించారు. అలాగే, తమ కాలనీల్లో ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 100 డయల్ చేసి సమాచారం అందించాలని ప్రజలను కోరారు. కాగా, ఈ రెండు దొంగతనాల కేసుల్లోని నిందితులను త్వరలోనే పట్టుకుని బాధితులకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

85
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles