తొలకరికి ముందే..

Mon,May 27, 2019 01:45 AM

జనగామ, నమస్తే తెలంగాణ, మే 26: రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అని గట్టిగా నమ్మే సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతాంగం ఆర్థికాభివృద్ధి సాధించాలనే సదుద్దేశంతో రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. వ్యవసాయంలో ఒడిదొడుకులు.. కష్టనష్టాలు తెలిసిన నేత, స్వయాన రైతు అయిన కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా వ్యవసాయ రంగంలో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే భూరికార్డుల ప్రక్షాళనతో రైతులకు ప్రభుత్వ ఫలాలను దగ్గర చేసిన సీఎం.. రాష్ట్రంలోని ప్రతీ రైతుకు ఎకరానికి రూ. 4 వేల చొప్పున రెండు పంటలకు ఏడాదిలో రూ. 8 వేల పెట్టుబడి అందించారు. అనంతరం 2018 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఇకనుంచి ఎకరానికి రూ. 5 వేల చొప్పున ఏడాదికి రూ. 10 వేలు ఇవ్వనున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో 68 క్లస్టర్ల ద్వారా పట్టాదారు పాసుపుస్తకం కలిగిన 1,34,580 మంది రైతులకు రైతుబంధు ద్వారా రూ. 160 కోట్లకు పైగా నగదును జూన్ మొదటి వారం వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పెట్టుబడి సాయం పంపిణీకి వ్యవసాయశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

సీజన్ ఆరంభానికి ముందే..
వానకాలం సీజన్ ఆరంభానికి ముందే రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వరుసగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా రైతుబంధు సాయం జమ చేసే ప్రక్రియ ఆలస్యమైంది. సాగుకు ముందే.. అంటే మే మాసంలోనే రైతుబంధు సాయం అందించాల్సి ఉండగా.. లోక్‌సభ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఈ నెల 31న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే రైతుబంధు నగదు ఖాతాల్లోకి బదిలీ చేసేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ మొదటి వారంలో తొలకరి చినుకులు పడేలోపే సాగుకు సన్నద్ధమయ్యే రైతు చేతిలో పంటసాయం డబ్బు ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే రైతుబంధుకు అర్హులైన రైతుల జాబితాను వ్యవసాయశాఖ రాష్ట్ర కమిషనర్‌కు నివేదించగా, అక్కడి నుంచే నేరుగా రైతు ఖాతాల్లోకి రైతుబంధు సాయం జమ కానుంది. గత ఏడాది వానకాలంలో రైతులకు ఎకరానికి రూ. 4 వేల చొప్పున తొలిసారి చెక్కుల రూపంలో రైతుబంధు సాయం అందించారు. తర్వాత యాసంగి పంట సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ప్రస్తుతం ఎకరానికి వానకాలం, యాసంగి కలిపి రూ. 10 వేల చొప్పున పంట సాయాన్ని ప్రభుత్వం పెంచింది. ఈ వానకాలంలో ఎకరానికి రూ. 5 వేల చొప్పున పెట్టుబడి సాయం అందబోతున్నది.

జూన్ మొదటి వారంలోనే..
గత ఏడాది పంట సాయాన్ని చెక్కుల రూపంలో అందించడంతోపాటు కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలను సైతం పండుగ వాతావరణంలో పంపిణీ చేశారు. అప్పటి 193 గ్రామాలకు చెందిన 1,46,713 మంది రైతులకు 1,48,686 చెక్కుల ద్వారా రూ. 160 కోట్ల సాయం అందింది. ఈసారి కూడా ఆంధ్రాబ్యాంకు ద్వారా 14,303 మంది రైతులకు రూ. 15,22,59,990, ఏపీజీవీబీ ద్వారా 14,125 మంది రైతులకు రూ. 17.07 కోట్లు, కెనరా బ్యాంకు ద్వారా 12,644 మంది రైతులకు రూ. 13,90,57,150, కార్పొరేషన్ బ్యాంకు ద్వారా 12,127 మంది రైతులకు రూ. 13,83,85,510, ఎస్‌బీఐ ద్వారా 93,514 మంది రైతులకు రూ. 100,24,07,100 జూన్ మొదటి వారంలోనే నేరుగా రైతు ఖాతాల్లో జమ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

71
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles