గులాబీ కంచుకోట

Sat,May 25, 2019 01:35 AM

ప్రధాన ప్రతినిధి/నమస్తే తెలంగాణ: ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌కు ఓరుగల్లు అండగా ఉంటున్నది. మొదటి నుంచీ గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ వెన్నంటి నడుస్తున్నది. టీఆర్‌ఎస్ అంటే వరంగల్.. వరంగల్ అంటే టీఆర్‌ఎస్‌గా ఉమ్మడి జిల్లా రాజకీయ ప్రస్థానంలో సుస్థిర స్థానాన్ని పదిల పరచుకుంటూనే ఉంది. 2004 సాధారణ ఎన్నికల నుంచి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల దాకా అదే స్ఫూర్తిని నిలుపుకున్నది. రాష్ట్రంలోని జిల్లాలతో పోలిస్తే ఓరుగల్లు విలక్షణ తీర్పు ఇస్తోంది. సాధారణ ఎన్నికలేగాక, ఉప ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కు అనుకూల ఫలితాలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్ సైతం ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ నిధుల కేటాయింపులోనూ ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల్లో పసునూరి దయాకర్, మాలోత్ కవిత భారీ మెజార్టీతో గెలుపొందారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమన్వయంతో ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా నిలిచి భారీ మెజార్టీ తీసుకొచ్చారు.

ఉత్తర తెలంగాణ ముఖద్వారం ఓరుగల్లు. గులాబీ విజయతోరణంగా మొదటి నుంచి తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూనే ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి దాకా టీఆర్‌ఎస్‌కు నీరాజనాలు పలుకుతూనే తన విశ్వాసాన్ని ప్రకటిస్తూనే ఉంది. ఎన్నికలు ఏవైనా సరే టీఆర్‌ఎస్‌కు బాసటగా నిలుస్తూ వస్తున్నది. ఎత్తుపల్లాలను చదునుచేస్తూ సందర్భం వచ్చిన ప్రతీసారి టీఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బాసటగా నిలుస్తున్నది. తెలంగాణ ఉద్యమానికి సవాళ్లు ఎదురైన ప్రతీసారి ఏ ఉద్యమస్ఫూర్తిని చూపిందో అదే స్ఫూర్తిని రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ప్రదర్శిస్తున్నది. టీఆర్‌ఎస్ అంటే వరంగల్. వరంగల్ అంటే టీఆర్‌ఎస్‌గా వరంగల్ ఉమ్మడి జిల్లా రాజకీయ ప్రస్థానంలో సుస్థిర స్థానాన్ని పదిల పర్చుకుంటూనే ఉంది. 2004 సాధారణ ఎన్నికల నుంచి మొన్న వెలువడ్డ 2019 పార్లమెంట్ ఎన్నికల ఫలితాల దాకా అదే స్ఫూర్తిని నిలుపుకున్నది.

కుట్రకత్తులు ఎన్ని వేలాడినా మొక్కవోని దీక్షతో ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టం కడుతూనే ఉన్నారు. అదే క్రమంలో గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి జిల్లా ప్రగతికి భవిష్యత్‌దర్శనం చేసుకోవడమే కాకుండా ప్రగతి అడుగులు పట్టుతప్పకుండా చేయాలనే తలంపును ప్రదర్శిస్తూనే ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో మిగతా రాష్ట్రంలోని మిగితా ఏ జిల్లాలో లేని విధంగా రెండింటికి రెండు పార్లమెంట్ స్థానాలను టీఆర్‌ఎస్‌కు కట్టబెట్టింది. ప్రగతి రథం ఆగిపోవద్దన్న ఒకే ఒక ఆకాంక్షతో ప్రజలు టీఆర్‌ఎస్‌ను నెత్తినపెట్టుకున్నారు. పార్టీపై విధేయత, అధినేతపై విశ్వాసం ప్రదర్శిస్తూ క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఉన్న టీఆర్‌ఎస్ కార్యర్తలు పట్టుదలతో పనిచేశారు. తమకేం వస్తుంది? వరుస ఎన్నికల్లో అలసిపోకుండా ఎప్పటికప్పుడు ప్రజల్లో పార్టీకి ఉన్న నమ్మకం సడలకూడదనే సంకల్పంతో కష్టపడి పనిచేశారు. అందుకే ఈ అపురూప విజయం సాధించేందుకు దోహదం చేసిందని పార్టీ పెద్దల మనసుల్ని గెలుచుకోగలిగారు.

ప్రగతి చక్రం ఆగిపోవద్దు...
వరంగల్ ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై ఆశాభావంతో ప్రగతి చక్రాలు ఆగిపోవద్దని టీఆర్‌ఎస్ పార్టీకి పట్టం కట్టారు. మిగతా జిల్లాలతో పోలిస్తే వరంగల్ పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్భం వచ్చిన ప్రతిసారి తన అవ్యాజ్యమైన ప్రేమను ప్రదర్శిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వరంగల్ జిల్లాను విద్యాకేంద్రంగా మార్చడంతో పాటు ప్రతిష్టాత్మక సంస్థలను ఇక్కడికి రప్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతే కాకుండా వరంగల్ నగరానికి పూర్వవైభవం తీసుకువచ్చి ఈ నగరానికి ఉన్న చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేందుకు బడ్జెట్‌లో రూ.300 కోట్లు వరుసగా మూడేళ్లు బడ్జెట్‌లో కేటాయించారు. వరంగల్‌ను ఐటీ కేంద్రంగా మలిచేందుకు శ్రీకారం చుట్టారు. ఔటర్ రింగ్‌రోడ్ సహా వరంగల్ మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. పారిశ్రామికంగా దేశ పటంలో వరంగల్‌ను నిలిపేందుకు కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు నిర్మాణానికి అంకురార్పన చేశారు. అంతేకాకుండా జనగామ, స్టేషన్ ఘన్‌పూర్ మధ్య లెదర్ పార్కుస్థాపన, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు మొదలైన శాశ్వత పారిశ్రామిక అభివృద్ధికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ కంకనబద్దులై ఉన్నారు. వీటన్నిటిని పూర్తి చేయాలంటే టీఆర్‌ఎస్ మినహా వేరే ఏ పార్టీకి సాధ్యం కాదని వరంగల్ ప్రజలు టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పట్టారు. మొత్తంగా ఇక్కడి ప్రజలు వరంగల్ గులాబీ కంచుకోటగా మరోసారి నిరూపించుకుంది.

అసాధారణ విజయ బావుటా...
పార్టీకి రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉన్నా ఉమ్మడి వరంగల్‌లో మాత్రం ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్‌ఎస్‌గా అసాధారణ ఫలితాలు ఇవ్వడంలో ఓరుగల్లు ప్రజలు విలక్షణతను చాటుకుంటూనే ఉన్నారు. తెలంగాణ ఉద్యమం కాటకలుస్తుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్న సందర్భంలో టీఆర్‌ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన సందర్భం నుంచి ఎన్నికల సందర్భం దాకా ప్రతి అడుగులోనూ వరంగల్ గులాబీ కంచుకోట అని నిరూపిస్తూనే ఉంది. 2004, 2008, 2009, 2010, 2012, 2015, 2018, 2019 అవి సాధారణ ఎన్నికలు గానీ, ఉప ఎన్నికలు గానీ ప్రతీ సందర్భంలో టీఆర్‌ఎస్ పార్టీ పట్ల, ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల వరంగల్ తన విశ్వాసాన్ని ప్రదర్శిస్తూనే వస్తుంది. రాష్ట్ర ఆవిర్భావ అనంతరం 2015 వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఇదే పసునూరి దయాకర్ జాతీయ స్థాయిలో అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎంపీల జాబితాలో చేరారు. రాష్ట్ర ఆవిర్భావ తొలి అడుగులోనే టీఆర్‌ఎస్ పార్టీ వైఫల్యం చెందింది. అభివృద్ధిని పట్టించుకోకుండా ఉంది అని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు బహుముఖ దాడి చేసిన సందర్భంలో నాడు ఉద్యమ సమయంలో ఏ స్ఫూర్తినైతే ప్రదర్శించిందో రాష్ట్ర సాధన అనంతరం జరిగిన ఈ ఉప ఎన్నికలో అదే ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించి టీఆర్‌ఎస్ పార్టీకి నైతిక, భౌతిక బలాన్ని ఇచ్చింది.

ఇదే స్ఫూర్తితో హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయడం ఆ తరువాత వరంగల్ సహా కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, ఖమ్మం కార్పొరేషన్లు సహా మిగతా మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ సుస్థిర విజయానికి వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక మైలు రాయిగా నిలిచింది. ఆ తరువాత జరిగిన 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పన్నెండింటికి పది అసెంబ్లీ స్థానాలను టీఆర్‌ఎస్ పార్టీ భారీ మెజార్టీతో వరంగల్ ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచాయి. ఇక మొన్న వెలువడిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ వరంగల్, మహబూబాబాద్ ఈ రెండు చోట్లా రాష్ట్రంలో నెలకొన్న అక్కడక్కడా ఎదురైన ప్రతికూల పరిస్థితులను తోసిపుచ్చి వరంగల్ అంటే టీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్ అంటే వరంగల్లే అని అటు రెండు స్థానాలను భారీ మెజార్టీతో కైవసం చేసుకుంది. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, రాష్ట్రంలో గెలిచిన 17 మంది ఎంపీల్లో 3,50,298 మెజార్టీని సాధించి మరోసారి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.

84
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles