లెక్కింపు నేడే

Thu,May 23, 2019 02:27 AM

-ఏర్పాట్లు పూర్తి చేసిన లోక్‌సభ ఎన్నికల అధికారులు
-పోలీసుల భారీ బందోబస్తు
-ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం
-2068 పోలింగ్ బూత్‌లు, 7 కౌంటింగ్ హాళ్లు
-మొత్తం 12,11,156 ఓట్లు లెక్కింపు
-కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
-సాయంత్రం 5 గంటల్లోగా ఫలితాల వెల్లడి
-అభ్యర్థుల్లో టెన్షన్‌టెన్షన్..

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి జరిగే ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. భువనగిరి పట్టణంలోని అరోరా ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. ఉదయం 6 గంటలకు ఈవీఎంల స్టాంగ్‌రూంలు తెరవనున్నారు. లెక్కింపు పరిశీలకులు, అధికారులు, సిబ్బంది, ఏజెంట్లు ఉదయం 5.30 గంటలకే కేంద్రానికి చేరుకునేలా ప్రణాళికలు రూపొందించారు. అపోహలకు తావులేకుండా లెక్కింపు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా చేపట్టనున్నారు. ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలకు లోబడి నివృత్తి చేసి అభ్యర్థులు సంతృప్తి చెందాకే రౌండ్ల వారీగా లెక్కింపు సాగుతుంది. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్లు అనుమానం వస్తే ఏఆర్వోకు ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉంది. అభ్యంతరాలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లనున్నారు.

పోలింగ్ కేంద్రాల వారీగా ఈవీఎంల ఓట్ల లెక్కింపు చేపడుతారు. సాంకేతిక లోపం ఉంటే పక్కనబెట్టి తరువాతి పోలింగ్ స్టేషన్ల వారీగా లెక్కింపు కొనసాగిస్తారు. పని చేయని ఈవీఎంలను సాంకేతిక నిపుణులతో మరమ్మతులు చేయిస్తారు. ఒకవేళ అవి తెరుచుకోకుంటే వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కిస్తారు. రౌండ్ల వారీగా లెక్కింపు అనంతరం ఏజెంట్ల సంతకాలు తీసుకున్న తర్వాతే మరో రౌండ్ చేపడతారు. ఈవీఎంల లెక్కింపు పూర్తయ్యాక చివర్లో లాటరీ పద్ధతిన ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు వీవీప్యాట్లను ఎంపిక చేసి వాటి ఓట్లను లెక్కించనున్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల స్లిప్పులకు తేడా ఉంటే వీవీప్యాట్ స్లిప్పులనే పరిగణలోకి తీసుకుని ఓట్లు నమోదు చేస్తారు. చివర్లో ఏజెంట్ల అంగీకారంతో తుది ఫలితాన్ని ప్రకటిస్తారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నలుగురు పరిశీలకులను ప్రత్యేకంగా నియమించింది. ఈ మేరకు వారు బుధవారం అరోరా కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు.

ఏడు ప్రత్యేక హాళ్లు..
భునవగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు భువనగిరి అరోరా కాలేజీలో చేపడుతున్నారు. విడివిడిగా ఏడు ప్రత్యేక హాళ్లను అన్ని సౌకర్యాలతో ప్రతీ నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,068 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 12,11,156 ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఏజెంట్ల సమక్షంలో ఆయా నియోజకవర్గాల ఏఆర్‌వోలు, స్ట్రాంగ్ రూంలను తెరిసి కౌంటింగ్ సిబ్బంది లెక్కింపు చేపడతారు. ప్రతీ రౌండ్ అనంతరం ఆన్‌లైన్ ద్వారా సువిధ యాప్‌లో నమోదు చేస్తారు. ఇందుకోసం సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసి సాంకేతిక సదుపాయాలు కల్పించారు. 117 మంది లెక్కింపు పర్యవేక్షకులు, 121 మంది సహాయకులు, 128 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించి శిక్షణ ఇచ్చారు.

మొత్తం 366 మంది ఓట్ల లెక్కింపులో పాల్గొంటారు. ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా 109 మంది ఏజెంట్లను నియమించుకోవచ్చు. ఇప్పటి వరకు 548 మంది నుంచి దరఖాస్తులు అందాయి. కౌంటింగ్ కేంద్రాల్లోని అధికారులు సహా ఎవరి సెల్‌ఫోన్లనూ అనుమతించరు. సాయంత్రం 5 గంటల్లోపు తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్ అనంతరం ఈవీఎంలు, వీవీప్యాట్లను నియోజకవర్గాల వారీగా ఆయా జిల్లాల ఎన్నికల అధికారులకు అప్పగిస్తారు. 45 రోజుల వరకు వాటిని భద్రపరుస్తారు. ఆర్వో టేబుల్ పైనే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతుంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 3,223 పోస్టల్ బ్యాలెట్ పేపర్లు, 506 ఈటీపీబీఎస్‌లు జారీ చేయగా ఇప్పటి వరకు 849 పోస్టల్ బ్యాలెట్లు, 320 ఈటీపీబీఎస్ అందాయి.

అల్పాహారం.. భోజన వసతి
కేంద్రంలో కౌంటింగ్ సిబ్బంది, అధికారులు, విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, పోలీసులు, అభ్యర్థుల ఏజెంట్లు, మీడియా సిబ్బందికి భోజన, అల్పాహార వసతి కల్పించారు. తాగునీటి సౌకర్యం, ప్రథమ చికిత్స, అంబులెన్స్ సౌకర్యం కల్పించారు.

భారీ బందోబస్తు..
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తును రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, డీసీపీ నారాయణరెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్ కోసం మూడంచెల్లో భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు. 546 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొంటారు. కళాశాల ప్రధాన ద్వారం, కౌంటింగ్ హాళ్లలో బందోబస్తు ఉంటుంది. కౌంటింగ్ సిబ్బందితోపాటు ఏజెంట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోనికి అనుమతిస్తారు. ఏజెంట్లు కౌంటింగ్ హాల్‌కు వచ్చే ముందు ఆర్వోతో జారీ చేసిన ఫారం-18పై ఆర్వో లేదా ఏఆర్వో ముందుకు సంతకం చేసి లోనికి వెళ్లాల్సి ఉంటుంది. కౌంటింగ్ కేంద్రం చుట్టూ కిలోమీటర్ పరిధి వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. పరిసరాల్లోకి అనుమతులు ఉన్నవారు తప్ప ఎవరూ ఎవరినీ అనుమతించరు. సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను లోనికి తీసుకెళ్లనివ్వరు.

సెల్ఫీ తీసుకుంటే జైలుకే..!
కౌంటింగ్ కేంద్రంలో ఎవరైనా సెల్‌ఫోన్‌తో సెల్ఫీ తీసుకోవాడానికి ప్రయత్నిస్తే జైలుకు వెళ్లడం ఖాయమని పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు. విజయోత్సవ వేడుకలు, ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి లేదు. పటాకులు కాల్చరాదు. 7 కౌంటింగ్ కేంద్రాల్లో ఏడుగురు ఏసీపీల పర్యవేక్షణలో 21 మంది ఇన్‌స్పెక్టర్లు, 30 మంది ఎస్సైలు, 79 మంది ఏఎస్సైలు, 231 మంది కానిస్టేబుళ్లు, 44 మంది హోంగార్డులు, 100 మంది సాయుధ పోలీసులు, 25 మంది స్పెషల్ పార్టీ పోలీసులు విధుల్లో పాల్గొంటారు. కౌంటింగ్ ముగిసిన తర్వాత అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

అందరూ సహకరించాలి: కలెక్టర్ అనితారామచంద్రన్
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, అన్ని పార్టీల నాయకులు, మీడియా సంయమనంతో సహకరించాలని భద్రాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ కోరారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సిబ్బందికి, రాజకీయ పార్టీల నాయకులకు శిక్షణ ఇచ్చామని చెప్పారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు 14 టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు. 375 మంది సిబ్బంది, 135 మంది మైక్రో అబ్జర్వర్స్, 120 మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లు, 120 మంది అసిస్టెంట్ కౌంటింగ్ సూపర్‌వైజర్లు లెక్కింపులో పాల్గొంటారని చెప్పారు. సాయంత్రం 5 గంటల్లోగా విజేతలను ప్రకటించే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

భారీ బందోబస్తు: భవనగిరి డీసీపీ నారాయణరెడ్డి
కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని భద్రాద్రి భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డి అన్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూంల్లో భద్రపరిచినట్లు వెల్లడించారు. మూడంచెల భద్రత కొనసాగుతోందన్నారు. ప్రతీ నియోజకవర్గానికి 75 మంది చొప్పుల సిబ్బందిని నియమించారన్నారు. సీసీ కెమెరాలు, విద్యుత్ దీపాలు ఏర్పాట్లు చేశామని చెప్పారు.

72
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles