రంజాన్ గిఫ్ట్‌లు వచ్చేశాయ్..

Sat,May 18, 2019 01:41 AM

-పేద ముస్లింలకు సర్కారు కానుక
-మసీద్ కమిటీలతో లబ్ధిదారుల ఎంపిక
- రేషన్‌కార్డు ఉన్న వారికి టోకెన్ల పంపిణీ
-జనగామ జిల్లాకు 4వేల గిఫ్ట్‌ప్యాక్‌లు
జనగామ, నమస్తే తెలంగాణ : రాష్ట్రం ఏర్పడిన తర్వాత సర్వమతాల ప్రధాన పండుగలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించి ఆయా మతాల్లోని పేద వర్గాలకు కానుకలు అందించేలా సీఎం కేసీఆర్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బతుకమ్మ పండుగకు తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ చీరలు, క్రిస్మస్, రంజాన్ పండుగలకు పేద కుటుంబాలకు దుస్తులను గిఫ్ట్‌ప్యాక్‌లుగా అందించి విందు భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం రంజాన్ పండుగను పురస్కరించుకొని జిల్లాలోని పేద ముస్లిం కుటుంబాలకు దుస్తులు పంపిణీ చేసి ఇఫ్తార్ విందు కూడా ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లుచేస్తోంది. ఇఫ్తార్ విందు భోజనం ఏర్పాటు కోసం ఒక్కో ముస్లింకు రూ.200 ఖర్చు చేసేలా జిల్లాకు మొత్తం రూ.8 లక్షల నిధులు మంజూరవ్వగా, జనగామ నియోజకవర్గానికి రూ.3 లక్షలు, స్టేషన్‌ఘన్‌పూర్‌కు రూ.3 లక్షలు, పాలకుర్తి నియోజకవర్గానికి రూ.2 లక్షల చొప్పున కేటాయించారు. ఇప్పటికే రెవెన్యూ డివిజన్ల వారీగా ఆర్డీవోలు మసీద్ కమిటీల పెద్దలతో సమావేశమై రంజాన్ పండుగకు పేద ముస్లింలకు దుస్తుల పంపిణీ, ఇఫ్తార్ విందు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకు జిల్లాకు చేరిన నాలుగు వేల రంజాన్ కిట్లలో జనగామ నియోజకవర్గానికి 1500, స్టేషన్‌ఘర్‌పూర్ నియోజకవర్గానికి 1500, పాలకుర్తి నియోజకవర్గానికి 1000 చొప్పున రంజాన్ గిఫ్ట్‌ప్యాక్‌లు ఇప్పటికే జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి కార్యాలయానికి చేరుకున్నాయి. మండలాల వారీగా స్థానికంగా ఉన్న మసీద్ కమిటీలతో పాటు అధికారులు తెల్లరేషన్‌కార్డు కలిగి ఉన్న ముస్లింలను పేదలుగా గుర్తించి వారికి ఒకరోజు ముందుగానే టోకెన్లు జారీ చేసి గిఫ్ట్‌ప్యాక్ పంపిణీ చేయనున్నారు. ఇందుకు నియోజకవర్గాలవారీగా ఆర్డీవోలు, మండలాల వారీగా తహసీల్దార్లకు బాధ్యతలు అప్పగించారు. ఈనెల 7 నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కాగా, త్వరలోనే నియోజకవర్గాల వారీగా రంజాన్ కానుకలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు : ఆర్డీవో
ముస్లింలకు అత్యంత ప్రీతిపాత్రమైన రంజాన్ పండుగను ప్రభుత్వం తరుపున ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జనగామ ఆర్డీవో మధుమోహన్ తెలిపారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో పేద ముస్లింలకు రంజాన్ దుస్తుల పంపిణీ, ఇఫ్తార్ విందు ఏర్పాట్లపై నియోజకవర్గంలోని ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుస్తుల పంపిణీకి లబ్ధిదారుల ఎంపిక, ఇఫ్తార్ విందు నిర్వహణ కోసం మూడు కమిటీలను ఏర్పాటు చేశామని, గుర్తించిన ప్రతీ లబ్ధిదారుకు ప్రభుత్వం నుంచి గిఫ్ట్‌ప్యాక్ ఇవ్వడంతోపాటు ఒక్కొక్కరికి రూ.200 చొప్పున ఇఫ్తార్ విందు నిర్వహణకు ఖర్చు చేస్తామని చెప్పారు. సమావేశంలో జనగామ, బచ్చన్నపేట, నర్మెట, చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు తహసీల్దార్లు పీ రవీందర్, వెంకటేశ్వర్లు, మురళీధర్‌రావు, నాగరాజ్‌గౌడ్, రమేశ్, గియాసున్నీసా బేగంతోపాటు ముస్లిం మత పెద్దలు జమాల్‌షరీఫ్, ముజిబుర్ రెహ్మాన్, గౌస్, ఇక్బాల్ అహ్మద్, అబ్దుల్ కరీం, మజహర్ షరీఫ్, ఎజాజ్, అన్వర్, ఎండీ గౌస్ తదితరులు పాల్గొన్నారు.

79
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles