వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం

Sat,May 18, 2019 01:37 AM

-రెండు గ్రామాల్లో రథోత్సవం
- బోనాలతో పాల్గొన్న మహిళలు
-పట్టు వస్ర్తాలు నేసిన కార్మికులు
లింగాలఘనపురం : లింగాలఘనపురం- బండ్లగూడెం గ్రామాల నడుమ బండగుట్టపై స్వయంభూగా వెలసిన లక్ష్మీనరసింహుడి కల్యాణాన్ని బండగుట్టపై శుక్రవారం వైభవంగా నిర్వహించారు. మొదట ట్రాక్టర్‌లో నరసింహస్వామి, చెంచులక్ష్మి ఉత్సవ విగ్రహాలను చేర్చి లింగాలఘనపురం గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట నుంచి రథోత్సవాన్ని ప్రారంభించారు. కాగా ఈ రథోత్సవంలో పద్మశాలీలు మరో ట్రాక్టర్‌లో నేత మగ్గాన్ని అమర్చి రథోత్సవంలో ఉత్సాహంగా పాల్గొని పట్టు వస్ర్తాలను నేసారు. అనంతరం నేసిన పట్టు వస్ర్తాలను స్వామివారికి సమర్పించి తమ పిల్లా పాపలను చల్లంగా చూడాలని స్వామివారిని వేడుకున్నారు. లింగాలఘనపురం గ్రామంలోని ప్రధాన వీదుల గుండా రథోత్సవం సాగుతూ సాయంత్రం బండ్లగూడెం గ్రామానికి చేరుకుంది. ఆ గ్రామంలోని ప్రధాన వీధుల్లో రథోత్సవాన్ని కొనసాగించి అనంతరం బండగుట్టపైకి స్వామివారి ఉత్సవ విగ్రహాలను చేర్చారు. ప్రత్యేక వేదికలపైకి నరసింహస్వామి, చెంచులక్ష్మి విగ్రహాలను ఎదురెదురుగా చేర్చి కల్యాణాన్ని పూజారులు కన్నులపండుగగా జరిపించారు. ఇదిలాఉండగా మహిళలు బోనాలతో రథోత్సవంలో పాల్గొనగా, ఒగ్గు కళాకారుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో నేత కార్మికులు వంగ ఉప్పలయ్య, బిట్ల నాగభూషణం, ఆంజనేయులు, ఉప్పలయ్య పాల్గొన్నారు. కాగా లింగాలఘనపురం, బండ్లగూడెం సర్పంచ్‌లు సాదం విజయమనోహర్, కాటం విజయ, నాయకులు లింగాల దీపక్‌రెడ్డి, వంచ మహేశ్వర్‌రెడ్డి, వంచ రాంరెడ్డి, చల్ల వెంకటరెడ్డి, గట్టగల్ల యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రధాన అర్చకులు కృష్ణమాచార్యుల నేతృత్వంలో జరిగిన కల్యాణోత్సవం ఉమానాథశర్మ, వెంకటాచార్యుల అధ్వర్యంలో కన్నుల పండుగగా జరిగింది.
సీఎం కేసీఆర్‌తోనే ఆలయాలకు పూర్వవైభవం
సీఎం కేసీఆర్ కృషితోనే రాష్ట్రంలోని ఎన్నో దేవాలయాలకు పూర్వవైభవం చేకూరుతోందని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. మండలంలోని లింగాలఘనపురం, బండ్లగూడెం గ్రామాల్లో శుక్రవారం జరిగిన లక్ష్మీనరసింహస్వామి రథోత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొని, అనంతరం బండగుట్ట ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీమాంధ్రుల పాలనలో తెలంగాణలో ఎన్నో ప్రాచుర్యం గల ఆలయాలు మరుగున పడిపోయాయన్నారు. ఆలయాల అభివృద్ధికి సీఎం కేఏసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని తెలంగాణకే తలమానికంగా నిలిచేలా తీర్చిదిద్దుతున్నారన్నారు. బండగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గతంలో ఎంతో చరిత్ర ఉండేదని దేవాలయంలోని విగ్రహాలను చూస్తే అర్థమవుతోందన్నారు. దేశ్‌మముఖ్‌లు లింగాల వంశస్తులు ఆ కాలంలో ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. ఈ ఆలయానికి డీడీఎన్(ధూపదీపనైవేద్య) పథకాన్ని తాను తప్పక మంజూరు చేయించడంతో పాటు సీడీఎఫ్ నిధుల నుంచి ఆలయాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. ఆయనవెంట టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బొల్లంపెల్లి నాగేందర్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ బస్వగాని శ్రీనివాస్‌గౌడ్, మండల ఇన్‌చార్జి చిట్ల ఉపేందర్‌రెడ్డి, నాయకులు వంచ మహేశ్వర్‌రెడ్డి, సర్పంచ్‌లు కాటం విజయ, శ్రీపాల్‌రెడ్డి, లింగాల దీపక్‌రెడ్డి, చల్ల వెంకటరెడ్డి, కాటం కుమారస్వామి, చిర్ర కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉడుగుల భాగ్యలక్ష్మి, మీల అంజయ్య, కారంపురి శ్రీనివాస్, బుట్రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles