నిప్పుల కొలిమి

Sat,May 18, 2019 01:34 AM

నర్మెట : ప్రచండ భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండడంతో నిప్పుల కొలిమిలా మారింది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఎండ తీవ్రత పెరిగిపోతోంది. దీంతో పాటు ఉక్కపోత, వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రోడ్లపైకి జనం రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. వృద్ధులు, పిల్లలు, రోగుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఎండకు తాళలేక వృద్ధులు, పిల్లలు విలవిల్లాడుతున్నారు. ఎండలో పనిచేసే కూలీలు సైతం ఎండ, వడగాలులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరు రోజులుగా కనీసం 44 డిగ్రీలకు పైగానే ఉష్ణాగ్రతలు నమోదయ్యాయి. ఎండకు వినియోగదారులు రాకపోవడంతో వ్యాపారులు మధ్నాహ్నం పూటనే దుకాణ సముదాయాలను మూసివేస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. రోజురోజుకూ ఎండలు దంచికొడుతుండటంతో పనుల నిమిత్తం బయటకు వెళ్లే ప్రజలు ఎండ నుంచి రక్షణ కోసం పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఎండ తీవ్రతతో పాటు వేడి గాలులు వీస్తుండడంతో త్వరగా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుందిని అంటున్నారు. ముఖ్యంగా శరీరంలో నీటి పరిమాణం తగ్గినప్పుడు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బను నివారించేందుకు పలు చిట్కాలు పాటించడం వల్ల వడదెబ్బకు గురికాకుండా ఉండవచ్చునని వైద్యులు తెలుపుతున్నారు. వేసవిలో వేడిమిని తట్టుకోవడానికి తెల్లరంగు కాటన్ దుస్తులు ధరించడం వల్ల ఎండ తీవ్రతను తట్టుకునే వీలుంటుందన్నారు. వీలైనంత వరకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 5 గంటల వరకు ఎండలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles