పల్లెల్లో వెల్లివిరిసిన ఓటు చైతన్యం

Thu,May 16, 2019 03:28 AM

-ఎండను సైతం లెక్కచేయని ఓటర్లు
-జిల్లాలో పెరిగిన పల్లె పోలింగ్‌ శాతం
-పోలింగ్‌కు బారులుతీరిన మహిళలు
-‘ఓటరు’ చేతిలో అభ్యర్థుల భవితవ్యం
-జిల్లాలో ఓటుకు దూరంగా థర్డ్‌ జెండర్‌
జనగామ, నమస్తే తెలంగాణ : జిల్లాలోని పల్లె ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. ఎన్నికల అధికారుల కృషి ఫలిచింది. జిల్లాలో మూడు విడతలుగా జరిగిన ప్రాదేశిక పోరులో గ్రామీణ ప్రాంతాల్లో భారీగా పోలింగ్‌ నమోదైంది. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నా ఉహించిన దానికంటే ఎక్కువ శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. శాసనసభ, లోక్‌సభ, గ్రామపంచాయతీ ఎన్నికల్లో చైతన్యం చాటిన ఓటర్లు అదే రీతిలో ఇటీవల మూడు విడతల్లో జరిగిన జిల్లా, మండల పరిషత్‌ ప్రాదేశిక ఎన్నికల్లోనూ మహిళలు, పురుషులు ఓటు హక్కు వినియోగంలో ఆధిక్యాన్ని ప్రదర్శించారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో థర్డ్‌జండర్‌ ఓటర్లుగా 8 మంది నమోదైతే పాలకుర్తి మండలంలో ఒక్కరు మినహా మిగిలిన ఏడుగురు ఓటుకు దూరంగా ఉన్నారు. ఎన్నికల బరిలో హోరాహోరి తలపడిన గ్రామీణ ప్రాంత అభ్యర్థుల రాజకీయ భవితవ్యాన్ని తేల్చే నిర్ణేతలు కానుండగా ఇందులో సగభాగమైన ఆమె తీర్పే అతి కీలకం కానుంది. పోటాపోటీగా ప్రచారం హోరెత్తించినా ఎవరికి ఓటేయాలో ముందే నిర్ణయించుకున్న ‘ఓటరు’ ఇచ్చే తీర్పుపైనే ఇప్పుడు అభ్యర్థుల భవితవ్యం ఆధారపడి ఉంది.

ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో మాదిరిగానే ప్రజల్లో ఓటోత్సాహం వెల్లువెత్తింది. వృద్ధులు, దివ్యాంగులు, ప్రత్యేక అవసరాలు ఉన్న వారికి వాహన సదుపాయం, వీల్‌చైర్లను సమకూర్చి పోలింగ్‌ కేంద్రం లోపలి వరకు అనుమతి ఇవ్వడంతోపాటు ఎన్నికల సంఘం చేపట్టిన విస్తృత ప్రచారంతో ఊరూ, వాడ, పల్లె, పట్నం, తండాలన్నీ ఓటుబాట పట్టాయి. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో ముందున్న వృద్ధులు, మహిళలు, ప్రధానంగా తొలిసారి కొత్తగా ఓటు హక్కు లభించిన యువ ఓటర్లు, యువకులు రెట్టించిన ఉత్సాహంతో ఓటింగ్‌లో పాల్గొనడం గమనార్హం. ఉద్యోగ, ఉపాధి కోసం పట్టణ ప్రాంతాలకు వెళ్లిన వారిలో చాలామంది స్వగ్రామాల్లో ఓటరుగా నమోదై ఉన్నారు. ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా వంటి వంటి సంక్షేమ పథకాల లబ్దిదారులై ఉన్న వీరంతా గ్రామాల్లో ఆధార్‌కార్డు తీసుకొని ఓటరుగా నమోదై ఉండి ఓటు హక్కు కోసం ప్రత్యేకంగా కుటుంబ సమేతంగా పల్లెలకు తరలిరావడం కూడా ఓటింగ్‌ శాతం గణనీయంగా పెరిగింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా ఉన్న వారంతా అత్యధికంగా మహిళలు కావడంతో పోలింగ్‌ రోజు వాడవాడలా మహిళలంతా ఒక్కచోట చేరి గుంపుగుంపులుగా పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. పింఛన్‌దారులు, ఒంటరి మహిళలతోపాటు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల లబ్ధిదారులు సైతం కుటుంబాలతోసహా టీఆర్‌ఎస్‌పై ఉన్న అభిమానంతో తరలివచ్చారు.

మండే ఎండలోనూ భారీ పోలింగ్‌
జిల్లాలో మూడు విడతలుగా జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్‌ జరిగిన పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ పరిధిలోని లింగాణలఘపురం మండలాల్లో మొత్తం 1,39,107 మంది ఓటర్లకు(పురుషులు 70,048 మంది, స్త్రీలు 69,053మంది) 1,08,534 మంది 78.02 శాతం(పురుషులు 54,830, స్త్రీలు 53,703) ఓటుహక్కు వినియోగించుకున్నారు. లింగాలఘనపురం మండలంలో అత్యధికంగా 83.50 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఈవిడత థర్డ్‌ జండర్‌ ఓటర్లు ఆరుగురు ఉంటే కేవలం పాలకుర్తి మండలంలో ఒకేఒక్కరు ఓటువేశారు. రెండో విడత పోలింగ్‌ జరిగిన జనగామ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బచ్చన్నపేట, జనగామ, నర్మెట, తరిగొప్పుల మండలాల్లో మొత్తం 1,01,793 మంది ఓటర్లకు 77,868 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 76.50శాతం పోలింగ్‌ నమోదైంది.

పురుషులు 39,849, స్త్రీలు 38,849 మంది ఓటు వేశారు. ఈ విడత పోలింగ్‌లో జనగామ మండలంలో అత్యధికంగా 80.99 శాతం పోలింగ్‌ నమోదైతే, బచ్చన్నపేట మండలంలో 26,196 ఓట్లు పోలైతే పురుషులు 13,066 మంది, స్త్రీలు 13,130 మ ంది ఓటేయగా, నర్మెట మండలంలో ఒకేఒక్కరుగా ఉన్న థర్డ్‌జండర్‌ ఓటుహక్కు వినియోగించుకోలేదు. ఇక తుది విడత ఎన్నికలు జరిగిన స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలోని రఘునాథపల్లి, చిల్పూరు, స్టేషన్‌ఘన్‌పూర్‌, జఫర్‌ఘడ్‌ మండలాల్లో మొత్తం 1,44,579 మంది (పురుషులు 72,179 మంది, స్త్రీలు 72,399 మంది) ఓటర్లకు 1,10,238(76.25శాతం) మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 55,624 మంది పురుషులు ఉంటే 54,614 మంది స్త్రీలు ఉన్నారు. చిలుపూరు మండలంలో అత్యధికంగా 77.62 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ విడత ఎన్నికల్లో జఫర్‌ఘడ్‌ మండలంలో ఒకే ఒక్క థర్డ్‌జండర్‌ ఓటరు ఉన్నా ఓటుకు దూరంగా ఉన్నారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles