తుది పోరు ప్రశాంతం

Wed,May 15, 2019 02:23 AM

-జిల్లాలో ముగిసిన ప్రాదేశిక ఎన్నికలు
-మూడో విడతలో 76.25 శాతం పోలింగ్‌
-చిలుపూరులో అత్యధికం
-స్టేషన్‌ఘన్‌పూర్‌లో అత్యల్పంగా నమోదు
-ఓటు వేసిన ఎమ్మెల్యే డాక్టర్‌ రాజయ్య
జనగామ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రాదేశిక సంగ్రామానికి తెరపడింది. తుది విడత ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని నాలుగు మండలాలకు ఎన్నికలు నిర్వహించగా 76.25 శాతం పోలింగ్‌ నమోదైంది. జిల్లాలో 12 మండలాలకు 12 జెడ్పీటీసీలు, 140 ఎంపీటీసీ స్థానాలకు మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. తుది విడతలో స్టేషన్‌ఘన్‌పూర్‌, చిలుపూరు, రఘునాథపల్లి, జఫర్‌ఘడ్‌ మండలాల జెడ్పీటీసీలు, 51 ఎంపీటీసీ(54 స్థానాలకు 3 ఏకగ్రీవం) స్థానాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఎండలు అధికంగా ఉన్నందున పెద్ద సంఖ్యలో ప్రజలు ఉదయమే తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌కేంద్రాల వద్ద బారులు తీరారు. అధికార యంత్రాంగం వేసవి దృష్ట్యా ఓటర్ల కోసం తగిన సదుపాయాలు కల్పించింది. ఆయా మండలాలు, గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో టెంట్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం వీల్‌చైర్లు అందుబాటులో ఉంచారు. ఓటర్లకు తాగునీటి సదుపాయం కల్పించారు. వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని పోలింగ్‌ కేంద్రాల్లో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను కూడా సిద్ధం చేశారు. ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరడంతో 9 గంటల కల్లా 19.95 పోలింగ్‌ శాతం నమోదైంది.11 గంటల వరకు పోలింగ్‌ పెరిగి 42.38 శాతానికి చేరుకుంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 62.37కు చేరుకుంది. 3 గంటల సమయానికి 69.80 శాతం నమోదైంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ ముగిసే సమయానికి 76.25 శాతం నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్‌ యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. సాయంత్రం ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం బ్యాలె ట్‌ బాక్స్‌లను జిల్లాకేంద్రంలోని స్ట్రాంగ్‌రూంనకు తరలించారు.

చిలుపూరు మండలంలో పోటెత్తిన ఓటర్లు
తుది విడత ప్రాదేశిక ఎన్నికల సందర్భంగా చిలుపూరు మండలంలో అత్యధికంగా పోలింగ్‌ నమోదైంది. ఇక్కడ 77.62 శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ మండలంలో జెడ్పీటీసీతోపాటు 12 ఎంపీటీసీ స్థానాలకు ఒకటి ఏకగ్రీవం కాగా.. 11 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 30,117 మంది ఓటర్లు ఉండగా, 23,377 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 11,812, మహిళలు 11,565 మంది ఉన్నారు. అదేవిధంగా జఫర్‌ఘడ్‌ మండలంలో జెడ్పీటీసీతోపాటు 12 ఎంపీటీసీ స్థానాలకు 77.21 శాతం పోలింగ్‌ నమోదు కాగా, రెండో స్థానంలో నిలిచింది. ఈ మండలంలో 31,608 మంది ఓటర్లు ఉండగా, 24,405 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 12,500, మహిళలు 11,905 మంది ఉన్నారు. రఘునాథపల్లి మండలంలో జెడ్పీటీసీ, 15 ఎంపీటీసీలకు ఒకటి ఏకగ్రీవం కాగా.. 14 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ 76.17 శాతం పోలింగ్‌ నమోదైంది. మండలంలో 41,801 మంది ఓటర్లు ఉండగా, 31,839 మంది ఓటు వేశారు. వీరిలో పురుషులు 15,974, మహిళలు 15,865 మంది ఉన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ జెడ్పీటీసీతోపాటు 15 ఎంపీటీసీ స్థానాలకు ఒకటి ఏకగ్రీవం కాగా.. 14 ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగాయి. మండలంలో 41,053 ఓట్లు ఉండగా, 74.58 పోలింగ్‌ నమోదైంది. 30,617 మంది ఓటుహక్కు వినియోగించుకోగా, పురుషులు 15,388, మహిళలు 15,279 మంది ఉన్నారు. కాగా, రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు ఆకునూరి మురళి రఘునాథపల్లి పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి మండలకేంద్రంలోని 40వ నంబర్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles