ఓటేస్తూ వీడియో రికార్డింగ్‌..

Wed,May 15, 2019 02:22 AM

-తన మిత్రుడికి వాట్సాప్‌ చేసిన వ్యక్తి
-గుర్తించి కేసు నమోదు చేసిన పోలీసులు
చిలుపూర్‌, మే 14: ఓటు రహస్యమని ఓ వైపు ఎన్నికల కమిషన్‌ పదేపదే చెబుతున్నా కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ప్రాదేశిక ఎన్నికలకు మంగళవారం జరిగిన పోలింగ్‌లో ఓ ఓటరు పోలింగ్‌కేంద్రంలో ఓటు వేసిన సమయంలో వీడియో రికార్డు చేసిన ఉదంతంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన చిలుపూరులో వెలుగుచూసింది. చిలుపూరు ఎస్సై శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. చిలుపూరుకు చెందిన వైద్య మహేశ్‌ మంగళవారం జరిగిన ప్రాదేశిక ఎన్నికల పోలింగ్‌లో పాల్గొన్నాడు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలోని 26వ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు మధ్యాహ్నం వచ్చాడు. పోలీసులు ప్రతీ వ్యక్తిని పరీక్షించి సెల్‌ ఫోన్లను అనుమతించడం లేదు. పాఠశాలలో మరమ్మతులు జరుగుతుండగా మరోమార్గం నుంచి మహేశ్‌ పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లాడు. ఓటు వేస్తున్న దృశ్యాన్ని తన సెల్‌ఫోన్‌లో వీడియో రికార్డు చేసి తన మిత్రులకు వాట్సాప్‌ ద్వారా పంపాడు. జెడ్పీటీసీ స్థానానికి బరిలో నిలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి చేతిగుర్తుకు ఓటు వేస్తున్నట్లు వీడియో రికార్డు దృశ్యాల్లో కనిపించడంతో వైరల్‌గా మారింది. సమాచారం తెలుసుకున్న ఎస్సై శ్రీనివాస్‌ పరిశీలించి వెంటనే పోలింగ్‌ బూత్‌లోకి వచ్చి బ్యాలెట్‌ పేపర్‌పై ఉన్న సీరియల్‌ నంబర్‌ను గుర్తించి ఆ వ్యక్తి ఎవరని ఆరా తీయగా వైద్య మహేశ్‌గా వెల్లడైంది. దీంతో మహేశ్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

55
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles