మనమే నంబర్‌వన్

Mon,May 13, 2019 03:45 AM

వరంగల్‌స్పోర్ట్స్, మే12: రాష్ట్ర క్రీడాకారుల ఫలితాలు మెరుగైన స్థానంలో ఉన్నాయి.. ప్రస్తుతం దేశంలో మనమే నంబర్‌వన్‌గా కొనసాగుతున్నామని చెప్పుకొచ్చారు అర్జున, ద్రోణాచార్య, పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డుల గ్రహీత, రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి, ఇండియన్ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపిచంద్. జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో హన్మకొండలోని అశోక హోటల్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర సంఘం జనరల్‌బాడీ సమావేశానికి హాజరైన ఆయన కాసేపు విలేకరులతో ముచ్చటించారు.

ఆటను విస్తరిస్తాం..
బ్యాడ్మింటన్ క్రీడా ఇప్పుడిప్పుడే క్షేత్రస్థాయిలో మంచి ఆదరణ పొందుతోంది. ఇదే మంచి తరుణంగా బ్యాడ్మింటన్‌ను విస్తరించేందుకు రాష్ట్ర సంఘంతో పాటు ఆయా జిల్లాల సంఘం బాధ్యులు కృషి చేస్తున్నారు. ఇందుకు తగిన ప్రణాళికలను సిద్ధం చేయడంతో పాటు క్రీడాభివృద్ధికి కావాల్సిన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోరుతున్నాం.

క్రీడాకారులకు కొదువలేదు..
దేశంలో, రాష్ట్రంలో, జిల్లాల్లో క్రీడాకారులకు కొదువ లేదు. వారిని ఎల్లప్పుడూ ప్రోత్సహించేందుకు బ్యాడ్మింటన్ సంఘం బాధ్యులు సహకారం అందిస్తూనే ఉంటారు. హైదరాబాద్ తర్వాత అంతటి పేరున్న ప్రధాన నగరంగా వరంగల్ జిల్లాకు పేరుంది. ఇక్కడ ప్రతిభ కలిగిన క్రీడాకారులు చాలా మంది ఉన్నారు. అయితే వారు జాతీయ, అంతర్జాతీయస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించే స్థాయి ఆటను ప్రదర్శించలేకపోతున్నారు. వారికోసం జిల్లాలో బ్యాడ్మింటన్ అకాడమీని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. త్వరలోనే ఆ నిర్ణయాన్ని వెల్లడిస్తాం.

రాష్ర్టంలో క్రీడాకారులకు తగిన గుర్తింపు
స్వరాష్ట్రంలో ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. విజయాలు సాధించినప్పుడు ప్రోత్సాహకాలు.. ప్రతిభ ఉంటే వారికి పూర్తి సహకారం అందుతోంది. తెలంగాణలో క్రీడకు, క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం ఉంది.

నడవడం..పరుగెత్తడం నేర్పాలి..
క్రీడాకారులు తయారు కావాలి.. దేశానికి పతకం రావాలనుకుంటే సరిపోదు ప్రతీ ఇంట్లో నుంచి ఒకరు ఏదో ఓ క్రీడాంశంలో ప్రాతినిధ్యం వహించాలి. కానీ ప్రస్తుతం ఇందుకు విరుద్ధంగా పిల్లలను కేవలం చదువులకే పరిమితం చేస్తూ వాళ్ల ర్యాంకులు చూసి మురిసిపోతున్నారు చాలామంది తల్లిదండ్రులు. అలా కాకుండా ఉదయం, సాయంత్రం కాసేపు మైదానాల్లో పిల్లలకు నడవడం.. పరుగెత్తడం నేర్పాలి. దానంతట అదే పిల్లల్లో ఒక నూతనోత్తేజంతో పాటు వారిలో నిగూఢమై ఉన్న క్రీడాప్రతిభను పెంపొదిస్త్తుంది.
క్రీడాకారుడిగా జిల్లాతో అనుబంధం..
వరంగల్‌తో చాలామంచి అనుబంధం ఉంది. క్రీడాకారుడిగా ఉన్న సమయంలో ఇదే క్లబ్ వేదికగా 1989, 1994లో రెండుసార్లు ఆడాను. వరంగల్ జిల్లా క్రీడా నిర్వాహకులతో పాటు ఇక్కడి ప్రజలు ఎంతో ఆత్మీయత చూపుతారు.

74
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles