రేపు తుది పోరు

Mon,May 13, 2019 03:42 AM

-మూడో విడత పరిషత్ పోరుకు సర్వం సిద్ధం
-నేడు పోలింగ్ సామగ్రి పంపిణీ
-బరిలో 208 మంది అభ్యర్థులు
-4 జెడ్పీటీసీలకు 23 మంది పోటీ
-51 ఎంపీటీసీ స్థానాలకు 185 మంది
-296 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
-మొత్తం ఓటర్ల సంఖ్య-1,43,874
-విధుల్లో 2054 మంది సిబ్బంది
-4 మండలాల్లో ముగిసిన ప్రచారం
-చివరి రోజు హోరెత్తిన పల్లెలు
జనగామ, నమస్తే తెలంగాణ, మే 12: మొదటి, రెండో విడత పరిషత్ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన జిల్లా అధికార యంత్రాంగం తుది విడత పోరుకు సర్వం సిద్ధం చేసింది. మూడో విడతలో ఎన్నికలు జరిగే స్టేషన్‌ఘన్‌పూర్, చిలుపూరు, రఘునాథపల్లి, జఫర్‌ఘడ్ మండలాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 4 జెడ్పీటీసీ స్థానాలు, ఏకగ్రీవమైన 3 ఎంపీటీసీ స్థానాలు మినహా మిగిలిన 51 స్థానాలకు మంగళవారం జరిగే పోలింగ్‌లో 1,43,874 మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 296 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. విధుల కోసం పీవోలు, ఏపీవోలు, ఓపీవోలు 1392 మందితో సహా ఇతర సిబ్బంది 1712 మందికి అదనంగా 20 శాతం సిబ్బందితో కలిపి మొత్తం 2054 మందిని తుది విడత పోలింగ్ నిర్వహణకు వినియోగిస్తున్నారు. చిలుపూరు, స్టేషన్‌ఘన్‌పూర్ పోలింగ్ సామగ్రిని స్టేషన్‌ఘన్‌పూర్ ఎంపీడీవో కార్యాలయంలో, రఘునాథపల్లి, జఫర్‌ఘడ్‌లోని ఎంపీడీవో కార్యాలయాల్లో ఆయా మండలాల పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్‌లు, పోలింగ్ సామగ్రిని జోన్లు, రూట్ల వారీగా సోమవారం ఉదయం పంపిణీ చేసి సాయంత్రానికి ఆయా కేంద్రాలకు అధికారులు, సిబ్బందిని తరలించనున్నారు. పలు సమస్యాత్మక గ్రామాలను గుర్తించిన పోలీస్ అధికారులు అవసరమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. పోలింగ్ సరళిని చిత్రీకరించేందుకు పలువురు వీడియో గ్రాఫర్లను నియమించారు. కాగా, ఆదివారం సాయంత్రం 5 గంటలకు చివరి విడత ప్రచారానికి తెరపడింది. చివరిరోజు ఎన్నికల ప్రచారంతో పల్లెలన్నీ హోరెత్తాయి.

51 స్థానాలకు 208 మంది..
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని చిలుపూరు, స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌ఘడ్, రఘునాథపల్లి మండలాల్లో 4 జెడ్పీటీసీ, 54 ఎంపీటీసీ స్థానాలకు ఏకగ్రీవైన రఘునాథపల్లి మండలంలోని కుర్చపల్లి, చిలుపూరు, స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని తానేదార్‌పల్లి ఎంపీటీసీ స్థానాలు మినహా 51 ఎంపీటీసీ స్థానాలకు 185 మంది, 4 జెడ్పీటీసీ స్థానాలకు 23 మంది అభ్యర్థులు కలిపి మొత్తం 208 మంది తుది విడత ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో స్టేషన్‌ఘన్‌పూర్ జెడ్పీటీసీ స్థానానికి ఆరుగురు, ఎంపీటీసీ స్థానాలకు 54 మంది, రఘునాథపల్లి జెడ్పీటీసీ స్థానానికి 9 మంది, ఎంపీటీసీ స్థానాలకు 52 మంది, చిలుపూరు జెడ్పీటీసీ స్థానం నుంచి నలుగురు, ఎంపీటీసీ స్థానాల నుంచి 40 మంది, జఫర్‌ఘడ్ జెడ్పీటీసీ స్థానం నుంచి నలుగురు, ఎంపీటీసీ స్థానాల నుంచి 39 మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు.
ముగిసిన ఆఖరి ప్రచారం..
మూడో విడత ప్రాదేశిక ఎన్నికలు జరిగే 4 మండలాల్లో ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రచా రం ముగిసింది. పార్టీ గుర్తులపై జరిగే ఈ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని చివరి రోజు ప్రచారంతో పల్లెలు హోరెత్తాయి. మిగతా పార్టీల నాయకులకంటే టీఆర్‌ఎస్ శ్రేణులు ఊరూరా విస్తృత ప్రచారంతో ముందుండగా.. కొన్ని గ్రామాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులకు ఎదురులేకుండా పోయింది. చివరిరోజు స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఛాగల్లు, చిలుపూరు మండలంలోని చిన్నపెండ్యాలలో ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. అలాగే, తాటికొండ, మీదికొండ, కొత్తపల్లి, రాఘవపూర్, శివునిపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, సముద్రాల, పాంనూరు, నెమిలిగొండలో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు.

గులాబీ పార్టీకి జై కొడుతున్న జనం..
పరిషత్ ఎన్నికల్లో భాగంగా చివరి విడత గ్రామాల్లో టీఆర్‌ఎస్ నాయకుల ప్రచారానికి స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో భారీ స్పందన లభించింది. ప్రభుత్వం ఐదేళ్లుగా చేపట్టిన సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజల ఉపాధి మెరుగుపడింది. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ సహా గొల్లకుర్మలు, మత్స్యకారులు, నాయీబ్రహ్మణులు వంటి కుల వృత్తులు, చేతివృత్తులు, చేనేత, గీత కార్మికుల కోసం చేపట్టిన కార్యక్రమాలు జిల్లాలోని ఆయా వర్గాలు, కులాలకు వరంగా వారి జీవన ప్రమాణాల్లో మార్పులు రావడంతో ఆ వర్గాలంతా టీఆర్‌ఎస్‌కు జైకొట్టారు. అసెంబ్లీ, పంచాయతీ, లోక్‌సభ ఎన్నికల్లోనూ జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు గులాబీ పార్టీని ఆదరించగా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ మరోసారి టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles