సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్రం సుభిక్షం

Sun,May 12, 2019 01:20 AM

చిలుపూర్, మే 11: ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెంది సుభిక్షంగా ఉంటుందని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన మండలంలోని సీతాతండా, పల్లగుట్టలో రోడ్‌షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిరిజనులతో మమేకమై ముచ్చటించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే అన్ని వర్గాల ప్రజలకు సంపూర్ణ న్యాయం జరుగుతోందన్నారు. గిరిజనులకు ప్రత్యేక కార్పొరేషన్, రైతాంగానికి సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లతోపాటు అన్ని విధాలుగా ఆదుకుంటున్నారన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి నెరవేర్చారన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచేలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు.

ప్రజల గుండెల్లో సీఎం కేసీఆర్
ప్రతీ పథకం లబ్ధిదారుల ఇంటికి చేరేలా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేశారని, టీఆర్‌ఎస్ సర్కార్ అమలు చేసిన ప్రతీ పథకం ప్రజల గుండెల్లో నిలిచేలా ఉందన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీ స్థానాలను అత్యధిక మెజార్టీతో గెలిచి తీరుతామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. అందుకు టీఆర్‌ఎస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు లేకుండాపోయాయని, వారు ప్రజల్లోకి వచ్చి మాట్లాడే పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. రైతు సంక్షేమం కోసం గోదావరి జలాలను తీసుకొచ్చి ప్రతీ ఎకరాను తడిపేందుకు సీఎం అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే గోదావరి జలాలను నియోజకవర్గానికి తీసుకొస్తామన్నారు. మరో ఆరు నెలల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు గోదావరిని నీటిని అందించి సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారన్నారు.

సీతతండాకు వంద ఇళ్లు..
పేదలకు పక్కా ఇళ్లు నిర్మించేందుకు టీఆర్‌ఎస్ సర్కార్ రూ. 5 లక్షలు అందిస్తోందని, సీతాతండాకు వంద ఇళ్లు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే రాజయ్య హామీ ఇచ్చారు. జెడ్పీటీసీ అభ్యర్థి పాగాల సంపత్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామ, తండా ప్రజల సమస్యలను పరిష్కరిస్తానన్నారు. ప్రతి ఒక్కరూ కారుగుర్తుకు ఓటువేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ అభ్యర్థి యాదగిరి, సర్పంచ్ సోనిస్వామినాయక్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పోలెపల్లి రంజిత్‌రెడ్డి, చిన్నపెండ్యాల సర్పంచ్ మామిడాల లింగారెడ్డి, మత్స్యశాఖ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ నీల రాజు, ఇల్లందుల సుదర్శన్, ఎస్సీసెల్ నాయకుడు గడ్డమీది వెంకటస్వామి, మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ భూక్యా రమేశ్‌నాయక్, భూక్యా వెంకటేశ్‌నాయక్, సూర్యనారాయణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles