ప్రణాళికాబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి


Wed,April 24, 2019 03:05 AM

-అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి
-నోడల్ అధికారుల సమీక్షలో జిల్లా ఎన్నికల పరిశీలకుడు మురళి
జనగామ, నమస్తే తెలంగాణ: జిల్లాలో మూడు విడతల్లో జరిగే ప్రాదేశిక ఎన్నికలను ప్రణాళికాబద్ధంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు ఆకునూరి మురళి నోడల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో రాష్ట్ర ఎన్నికల వ్యయ పరిశీలకుడు ఇమ్మడి రవి, లైజనింగ్ అధికారి, డీఆర్డీవో రాంరెడ్డితో కలిసి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నియమావళి, పోలింగ్, కౌంటింగ్ అంశాలపై మంగళవారం సమీక్షించారు. జిల్లాలో పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్నిశాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
అలసత్వం వహిస్తే చర్యలు..
ఎన్నికల విధుల్లో అలసత్వం వహించే అధికారులు, సిబ్బందిపై ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరిస్తుందని మురళి హెచ్చరించారు. అదేవిధంగా ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రచార ఖర్చులపై వ్యయ పరిశీలకుడు రవి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రూ. 20 వేల వరకు ఎలాంటి పరిమితి లేదని, ఆపైన డబ్బులు తీసుకెళ్లాల్సి వస్తే తగిన ఆధారాలు లేకుంటే సీజ్ చేస్తారని చెప్పారు. ఎన్నికల్లో జెడ్పీటీసీ అభ్యర్థి రూ. 4 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థి రూ. 1.50 లక్షలు మాత్రమే ఖర్చు చేయాలని సూచించారు. జెడ్పీటీసీ అభ్యర్థి నామినేషన్ పత్రం దాఖలు చేసే సమయంలో రూ. 5 వేలు, రిజర్వేషన్ ఉన్న వారికి రూ. 2,500, ఎంపీటీసీ అభ్యర్థికి రూ. 2,500, రిజర్వేషన్ ఉన్న వారికి రూ. 1,250 డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. డిపాజిట్ మొత్తాన్ని కూడా అభ్యర్థి వ్యక్తిగత ఖర్చుగా జమకడతామని స్పష్టం చేశారు.

99

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles