ఇంటింటికీ ఆధార్ లింక్


Sat,April 20, 2019 01:46 AM

- జనగామ మున్సిపల్‌లో జీఐఎస్ సర్వే
- 28 వార్డుల్లో 20 బృందాలు పర్యటన
- ఇంటినంబర్‌తో యజమాని ఆధార్‌నంబర్ అనుసంధానం
- పూర్తికావొస్తున్న ప్రక్రియ
- వెలుగులోకి అదనపు నిర్మాణాలు
- బల్దియాకు పెరుగనున్న అదనపు ఆదాయం


జనగామ, నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 19 : పారదర్శకతకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం ప్రతీ ఇంటిని ఆధార్‌తో అనుసంధానం చేస్తోంది. అంతకు ముందు ఇళ్ల నిర్మాణాలు జరిగినా.. అనుమతికి మించి కట్టడాలు నిర్మించినా.. ఆస్తి పన్ను వసూలయ్యేది కాదు. స్థానికంగా ప్రజాప్రతినిధుల అండదండలు, కార్యాలయ సిబ్బంది సహకారంతో ఈ వ్యవహారం నడిచేదనే ఆరోపణలున్నాయి. సొంత ఆదాయ మార్గాలకు గండిపడుతున్న వ్యవహారాన్ని గాడిలో పెట్టేందుకు పురపాలకశాఖ కార్యాచరణ చేపట్టింది. రికార్డుల్లో చేరని, ఇంటి నంబర్ లేకుండా ఉన్న ఆస్తుల వివరాలను సర్వే చేయాలని నిర్ణయించింది. ఈమేరకు జనగామ మున్సిపల్‌లో ప్రారంభించిన ఇంటింటికీ అధార్ అనుసంధానం ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తుతం 54,536 మంది జనాభాకు గానూ 10,700 ఇళ్లకు ఆస్తి పన్ను వసూలవుతుంది. జీఐఎస్ సర్వే తర్వాత మున్సిపల్ లెక్కలో లేని మరో వెయ్యి ఇళ్లు వెలుగులోకి వచ్చాయి. పురపాలకశాఖ అధికారుల ఆదేశాల మేరకు బిల్ కలెక్టర్లు పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చే ఆస్తులకు యాజమానుల పేరిట ఉన్న ఆధార్, మొబైల్ నంబర్లనుసేకరించి మున్సిపల్ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తున్నారు. జీఐఎస్ సర్వే దారా మున్సిపల్‌కు 40 నుంచి 50 శాతం ఆదాయం పెరగనుందని మున్సిపల్ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే కమర్షియల్ కాలనీల్లోని ఇళ్ల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే ఈ ఆదాయం పెద్దఎత్తున పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియతో ఇళ్ల స్థలాల పంపిణీ, రుణాలు, సామాజిక పింఛన్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, పేదలకు రూపాయికే నల్లా కనెక్షన్లు వంటి పథకాలు అసలైన లబ్ధిదారులకు దక్కేందుకు ఆధార్ అనుసంధానం దోహదం చేస్తుంది. ఈ పన్ను వసూళ్ల బాధ్యతలను బిల్ కలెక్టర్లకు అప్పగించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

పూర్తయిన జీఐఎస్ సర్వే..
సొంత ఆదాయ మార్గాలకు గండిపడుతున్న వ్యవహారాన్ని గాడిలో పెట్టేందుకు పురపాలకశాఖ కార్యాచరణ పూర్తి చేసింది. పట్టణ ప్రాంత పరిధిలో ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా పన్నులు వసూలు చేసే ప్రక్రియను పూర్తిచేసింది. వార్డులు, కాలనీల్లో ఇళ్లు నిర్మించుకున్న వాటి అసెస్‌మెంట్ (ఆస్తి పన్ను కొలతలు) నిర్ధారణలో సిబ్బంది చేతివాటం చూపించడంతో పురపాలక సంఘం ఇప్పటి వరకు కోట్లలో నష్టపోయింది. ఇంటి నిర్మాణం పూర్తయినా ఆస్తి పన్ను చెల్లించని వారి వివరాలు బయటపడ్డాయి. ఆస్తిపన్ను, నీటి కుళాయిల బకాయిలు, ట్రేడ్ లైసెన్స్ (వ్యాపార ధ్రువప్రతం)ల ద్వారా ఆదాయం రాబట్టడానికి జీఐఎస్(జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం) ద్వారా ఛాయాచిత్రాల ఆధారంగా చేపట్టిన సర్వే సత్ఫలితాలను ఇచ్చింది. ఇళ్ల సంఖ్య ఆధారంగా బల్దియా సిబ్బంది బృందాలుగా విడిపోయి సర్వే చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేసి ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే దిశలో అడుగులు పడుతున్నాయి.

అదనంగా పెరిగిన వెయ్యి ఇళ్లు..
అనుమతులకు విరుద్ధంగా కట్టడాలు.. ఇంటి కొలతలు తక్కువ చేసి చూపడం.. నివాసానికి అనుమతులు తీసుకొని కమర్షియల్(వ్యాపారానికి) వినియోగించడం ఇలా అడ్డదారుల్లో అడ్డగోలు అక్రమ వ్యవహారాలకు ఇకపై చెక్ పడబోతోంది. ప్రభుత్వం నూతనంగా జీఐఎస్‌తో ఇళ్ల కొలతలు పక్కాగా నమోదు కానున్నాయి. వాటి ఆధారంగానే ఆస్తిపన్నును నిర్ధారించనున్నారు. పట్టణంలోని 28 వార్డుల్లో 20 బృందాలు చేపట్టిన సర్వేలో తేలిన ఇళ్ల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదుచేశారు. దీంతో పన్నులు చెల్లించే ఇళ్ల సంఖ్య 11,300 నుంచి 12వేల వరకు చేరనుంది. సర్వే సమయంలోనే ప్రతీ ఇంటికీ యూనిక్ నంబర్‌ను కేటాయిస్తారు. ఈ నంబర్ ఆధారంగా శాటిలైట్ కొలతలను నిర్ధారిస్తుంది. మాన్యువల్ సర్వే వివరాలు, శాటిలైట్ ద్వారా లెక్కించిన కొలతలు దాదాపుగా సరిపోలే అవకాశం ఉంటుందని, ఎక్కడోచోట పాయింట్లలో తేడా ఉంటే ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. జీఐఎస్ విధానంలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. ఉపగ్రహం ద్వారా కొలతలు తీసినపుడు ఇంటి ముందు వేసుకున్న కారు షెడ్, ముందు బాత్‌రూం, ఇంటిపై వాటర్‌ట్యాంక్‌లను కూడా పరిగణలోకి తీసుకుంది. అయితే మాన్యువల్ కొలతల్లో వీటికి మినహాయింపు ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. జీఐఎస్ విధానం ద్వారా మున్సిపల్‌కు 40-50శాతం ఆదాయం పెరగనుందని మున్సిపల్ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే కమర్షియల్ కాలనీల్లోని ఇళ్ల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే బల్దియాకు ఆదాయం పెద్దఎత్తున పెరిగే అవకాశం ఉంటుందని అక్కడి అధికారులు చెబుతున్నారు.

వెలుగులోకి అదనపు నిర్మాణాలు..
జీఐఎస్ విధానంతో ఇంటి కొలతలు పక్కాగా తేలడంతో దానికి ఆస్తి పన్ను కూడా నిబంధనల మేరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇన్నాళ్లు మున్సిపాలిటీకి పన్నులు ఎగ్గొడుతున్న వారి ఆటలకు ఇక అడ్డకట్ట పడనుంది. ముందుగా మున్సిపాలిటీలో తీసుకున్న అనుమతుల ప్రకారం ఒక పోర్షన్ కట్టుకున్న వారు అంతకే ఆస్తిపన్ను చెల్లిస్తున్నారు. ఆ తర్వాత మరో గది లేదా పోర్షన్‌ను అనుమతి లేకుండా కట్టుకుంటున్నారు. దాన్ని మున్సిపల్ సిబ్బంది పట్టించకోకపోతే గతంలో మాదిరిగా ఒక పోర్షన్‌కే పన్ను చెల్లిస్తూ వస్తున్నారు. ఇప్పుడు అదనపు పోర్షన్‌కు కూడా తప్పనిసరిగా పన్ను చెల్లించాల్సి వస్తుంది. అదే విధంగా కొందరు మున్సిపల్ సిబ్బంది కొలతలకు వెళ్లినపుడు ప్రలోభాలకు లోనై తక్కువ కొలతలు చేసి చూపించే వారు. చాలాచోట్ల నివాస గృహాలకు అనుమతి వ్యాపారానికి వినియోగిస్తున్నారు. పన్ను మాత్రం నివాస గృహానికి సంబంధించే చెల్లిస్తున్నారు. ఇకపై ఇలాంటి అక్రమాలకు తావుంటే ఆవకాశం లేదు. లెక్క ప్రకారం పక్కాగా ఆస్తి పన్ను చెల్లించాల్సి వస్తుండగా రెసిడెన్షియల్ ఇళ్ల సంఖ్య తగ్గి కమర్షియల్, మిక్స్‌డ్ ఇళ్ల సంఖ్య పెరిగింది.

166

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles