జెడ్పీ పీఠమే లక్ష్యం..

Thu,April 18, 2019 01:58 AM

- జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా..
- కసరత్తు చేస్తున్న టీఆర్‌ఎస్
- అంతటా సన్నాహాక సమావేశాలు
- గులాబీ దళానికి దిశానిర్దేశం చేసిన మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యేలు
- ముత్తిరెడ్డి నూతన ఒరవడి..

జనగామ, నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 17: జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు అప్పగించడంతో జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగురవేసేందుకు శ్రీకారం చుడుతున్నారు. ఈ మేరకు గులాబీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు బుధవారం పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పార్టీ ముఖ్య కార్యకర్తలు, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ ఆశావహులతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. జిల్లాలో ఏ ఎన్నికలు జరిగినా భారీ విజయాన్ని నమోదు చేసుకుంటున్న టీఆర్‌ఎస్ త్వరలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ క్లీన్‌స్వీప్ దిశగా అడుగులు వేస్తోంది. జిల్లాలో 12 జెడ్పీటీసీ, 12 ఎంపీపీ, 140 ఎంపీటీసీ పదవులను కైవసం చేసుకొని జిల్లా పరిషత్ పీఠం లక్ష్యంగా టీఆర్‌ఎస్ కసరత్తు చేపట్టింది. త్వరలో ప్రాదేశిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండడంతో గులాబీ సేన దూకుడు పెంచింది. అసెంబ్లీ, పంచాయతీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు తమ వైపే ఉన్నారని నిరూపించుకుని మంచి ఊపుమీదున్న గులాబీ పార్టీ అన్ని ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను క్లీన్‌స్వీప్ చేసి జెడ్పీపీఠం కైవసం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీఎం కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలకు మార్గనిర్దేశం చేసి పరిషత్ ఎన్నికల్లో పార్టీపరంగా అనుసరించాల్సిన వ్యూహం, లక్ష్యాన్ని నిర్ణయించారు. జిల్లాకు ఎన్నికల ఇన్‌చార్జీగా మండలి చీఫ్ విప్, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే హైదరాబాద్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా ఎన్నికల ఇన్‌చార్జీ పల్లా సహా జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, డాక్టర్ రాజయ్య హాజరై జిల్లాలో టీఆర్‌ఎస్ గెలుపు వ్యూహంపై చర్చించారు.

తాజాగా బుధవారం పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సన్నాహక సమావేశాలు పూర్తి చేయగా, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య సైతం పార్టీ ముఖ్యులతో వ్యూహరచన చేస్తున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్లు, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పీఠాల కోసం ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టగా, అటు గ్రామాల్లో, ఇటు మంత్రి, ఎమ్మెల్యేల నివాసాల వద్ద సందడి నెలకొంది. మంత్రి సహా ఎమ్మెల్యేలంతా స్థానిక ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం వేట సాగిస్తుండగా, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాత్రం పల్లెల్లో స్వయంగా పారిశుధ్య పనులు చేపట్టి క్లీన్ విలేజ్‌గా ప్రజామోదం లభిస్తేనే పైసా ఖర్చులేకుండా నేరుగా గ్రామానికి వచ్చి పార్టీ బీ-ఫారం అందజేస్తానని ప్రకటించి.. రాష్ట్రంలోనే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో మూడు విడతల్లో జరిగే ప్రాదేశిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించేలా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను సీనియారిటీ, పార్టీపై సిన్సియారిటీ, ప్రజల్లో పలుకుబడిని ప్రాధాన్యతాంశాలుగా తీసుకొని తయారు చేసేందుకు గులాబీ దళం కసరత్తు చేపట్టింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పని చేసిన విధంగా కార్యకర్తలను ప్రోత్సహించి స్థానిక ఎన్నికల్లో అంతటా గులాబీ జెండాలు రెపరెపలాడేలా చూడడం ద్వారా జిల్లాలో టీఆర్‌ఎస్ పట్టును మరింత నిలుపుకోవాలని పార్టీ వ్యూహరచన చేస్తున్నది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతీ మండలానికి పార్టీ తరఫున ఒక పరిశీలకుడిని నియమించి, అన్ని గ్రామాల్లో పర్యటించి పార్టీ టికెట్ ఆశిస్తున్న ఇద్దరు లేదా ముగ్గురు ఆశావహుల పేర్లను సేకరించి జిల్లా కమిటీకి అందజేస్తే అభ్యర్థి ఎంపికపై తుది నిర్ణయం జిల్లా కమిటీ తీసుకునేలా గులాబీ పార్టీ ప్రణాళిక రూపొందించింది. ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికలో జిల్లా ఇన్‌చార్జీలతోపాటు సంబంధిత కమిటీది తుది నిర్ణయం కాగా, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికను మాత్రం రాష్ట్ర పార్టీ నిర్ణయానికి వదిలేయాలని నిర్ణయించారు.

67
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles