అపార నష్టం..

Thu,April 18, 2019 01:57 AM

జనగామ, నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 17: ప్రకృతి విసిరిన పంజాకు జిల్లా రైతాంగం అతలాకుతలమైంది. ఏటా పంట చేతికొచ్చే దశలో వరుణుడు అకాల వర్షం, వడగండ్ల రూపంలో ప్రకోపాన్ని ప్రదర్శిస్తూ తీరని నష్టాన్ని మిగులుస్తున్నాడు. జిల్లాలో బుధవారం సాయంత్రం కురిసిన అకాలవర్షం రైతన్నను కోలుకోకుండా చేసింది. జిల్లాలోని పలుచోట్ల కోతకు వచ్చిన వరిపంట తీవ్రంగా దెబ్బతినగా, ఇటు జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డు, అటు ఐకేపీ, పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసుకున్న వేలాది క్వింటాళ్ల ధాన్యం రాశులు నీటి పాలైతే, బస్తాలు తడిసి ముద్దయ్యాయి. ఈదురుగాలులతో గ్రామాల్లో వరి పంటకు నష్టం వాటిల్లగా, విద్యుత్ వైర్లు తెగిపోయాయి. చిరుజల్లులతో మొదలైన ఈదురుగాలులతో గంటపాటు ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది.

కొట్టుకుపోయిన ధాన్యం
జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు భారీ నష్టం జరిగింది. వేలాది క్వింటాళ్ల ధాన్యం రాశులు వరదనీటిలో కొట్టుకుపోగా, బస్తాలు తడిసి ముద్దయ్యాయి. ఇటీవలే ప్రభుత్వరంగ సంస్థ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడంతో రైతులు పెద్దఎత్తున ధాన్యం అమ్మకానికి తెచ్చారు. అయితే, తేమ శాతం అధికంగా ఉండడంతో కొనుగోలుకు నిరాకరించగా, రైతులు అటు కాటన్‌యార్డు, ఇటు పాత మార్కెట్ యార్డు కల్లాల్లో ధాన్యం ఆరబోసుకు న్నారు. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పులతో ఆందోళన చెందిన రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం రాశులు దగ్గరకు చేర్చి రాశులుగా పోసుకొని టార్పలిన్లు కప్పుకోగా, అందుబాటులో లేని రైతుల ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది. రెండు యార్డుల్లో ఆరబోసుకున్న దాదాపు 3 వేల బస్తాల ధాన్యం రాశులు నీటి పాలయ్యాయి. రైతులు, ట్రేడర్లకు చెందిన సుమారు 6 వేల సంచుల్లో నింపి తరలించేందుకు సిద్ధంగా ఉన్న బస్తాల ధాన్యం తడిసి ముద్దయింది. మార్కెట్‌లో ప్లాట్‌ఫాంలు, ఓపెన్ షెడ్లలో ఆరబోసుకున్న ధాన్యానికి మాత్రం నష్టం వాటిల్లలేదు.

మార్కెట్ ఎదుట రైతుల ధర్నా..
మార్కెట్‌లో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోలు చేయించి ఆదుకోవాలని బుధవారం సాయంత్రం మార్కెట్ ఎదుట రైతులు ధర్నాకు దిగారు. జనగామ వ్యవసాయ మార్కెట్‌లో అకాల వర్షానికి తడిసిన ప్రతీ ధాన్యం గింజను ప్రభుత్వరంగ సంస్థ ద్వారా లేదా ట్రేడర్లు, మిల్లర్ల సాయంతో మద్దతు, గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్య పడొద్దని మార్కెట్ అధికారులు భరోసా ఇచ్చారు. మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యం రాశులు, బస్తాలు, వరదనీటిలో కొట్టుకుపోయిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి ఓదార్చారు. వర్షం కారణంగా మార్కెట్‌లో జరిగిన నష్టాన్ని అధికారులు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి దృష్టికి తేగా వెంటనే ఆయన కలెక్టర్ టీ వినయ్‌కృష్ణారెడ్డితో ఫోన్‌లో మాట్లాడి తడిసిన ధాన్యం కొనుగోలుకు ఒప్పించారు. అవసరమైతే నష్టం అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తెచ్చి రైతులు నష్టపోకుండా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

47
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles