మార్కెట్‌కు పోటెత్తిన ధాన్యం

Wed,April 17, 2019 02:01 AM

-తేమ సాకుతో కొనుగోళ్ల నిరాకరణ
-ధర తగ్గిస్తున్న ప్రైవేట్ వ్యాపారులు
జనగామ, నమస్తే తెలంగాణ : జనగామ వ్యవసాయ మార్కెట్‌కు యాసంగి వరి ధాన్యం పోటెత్తింది. వరుస సెలవుల తర్వాత యార్డులో ప్రభుత్వరంగ సంస్థ ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేయడంతో మంగళవారం ఒక్కరోజే ఐదు వేల క్వింటాళ్లకు పైగా ధాన్యం వచ్చింది. భారీగా తరలివచ్చిన ధాన్యంతో అటు కొత్త కాటన్‌యార్డు, ఇటు పాత మార్కెట్ ఆవరణతోపాటు కవర్‌షెడ్లు అన్ని ధాన్యం రాశులు, బస్తాలతో నిండిపోయాయి. శ్రీరామనవమి, ఆదివారం సెలవు రోజు కావడంతోపాటు సోమవారం వచ్చిన ధాన్యంతో కలిపి రెండు యార్డులు బస్తాలు, రాశులతో నిండిపోయాయి. అయితే జనగామ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు తేమ సాకుతో రైతుల నుంచి నామమాత్రంగా ధాన్యం సేకరణ జరుపుతున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ వ్యాపారులు, ట్రేడర్లు, రైస్ మిల్లర్లు ధర తగ్గించి కొనుగోలు చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

నిబంధనల మేరకు మాయిశ్చర్ శాతం తగ్గించేందుకు రైతులు ధాన్యాన్ని యార్డులో ఆరబెట్టుకున్న తర్వాత తిరిగి కొనుగోలు కేంద్రానికి అమ్ముతున్నారు. గ్రేడ్-1 రకం ధాన్యానికి క్వింటాల్‌కు ప్రభుత్వ మద్దతు ధర రూ.1770 ధర లభిస్తుండంతో రైతులు ప్రభుత్వరంగ సంస్థకు అమ్మేందుకు మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వరంగ కొనుగోలు కేంద్రాలు రైతుల నుంచి ఒకరోజుకు కేవలం 500 నుంచి 600 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తుండగా, మిగిలిన వేలాది క్వింటాళ్లు ప్రైవేట్ ట్రేడర్లకు తప్పనిసరి పరిస్థితుల్లో అమ్ముకోవాల్సి వస్తోంది. ప్రభుత్వ మద్దతు ధర రూ.1770 చెల్లిస్తుండగా, ప్రైవేట్ వ్యాపారులు, ట్రేడర్లు, మిల్లర్లు మాత్రం రైతుకు కేవలం రూ.1450 నుంచి రూ.1500కు మించి ధర చెల్లించడంలేదు. దీంతో రైతులు ఒక్కో క్వింటాల్‌కు రూ.250 నుంచి రూ.220 దాకా నష్టపోతున్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా జనగామ మార్కెట్‌కు ఎక్కువశాతం ధాన్యం వస్తుండగా, కొనుగోలు కేంద్రంలో మాత్రం ఆ మేరకు ఏర్పాట్లు చేయడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

61
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles