నిప్పుల కొలిమి..!

Tue,April 16, 2019 01:54 AM

- జిల్లాలో దంచికొడుతున్న ఎండలు
- 42 డిగ్రీలకు చేరిన పగటి ఉష్ణోగ్రతలు
- ఉదయం నుంచే మొదలవుతున్న ఉక్కపోత
- వడగాలులకు బెంబేలెత్తుతున్న ప్రజలు
- బయటకు రావాలంటే భయపడుతున్న జనం
- మధ్యాహ్నం వరకే కర్ఫ్యూను తలపిస్తున్న వీధులు

జనగామ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లా నిప్పుల కొలిమిగా తయారైంది.. భానుడి ప్రతాపానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. తీవ్ర ఎండలకు తోడు వేడిగాలులు వీస్తుండడంతో జనం ఆందోళన చెందుతున్నారు. రోజురోజుకు అధికమవుతున్న ఉష్ణోగ్రతలతో జిల్లా నిప్పుల కుంపటిని తలపిస్తోంది. మధ్యాహ్నం 11 గంటల తర్వాత జనం బయటకు రావాలంటే బెంబేలెత్తుతున్నారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎండతీవ్రత తగ్గకపోవడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల నుంచి జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. ఏప్రిల్‌లోనే ఎండలు అధికంగా ఉండడంతో వచ్చే నెలలో పరిస్థితిని ఊహించుకుని జనం భీతిల్లుతున్నారు. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ఠం 21 డిగ్రీలు, గరిష్ఠం 42 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. దీంతో ప్రధాన రహదారులు, వీధులన్నీ బోసిపోయి కర్వ్యూను తలపిస్తున్నాయి. ఉపాధిహామీ, ఇతరత్రా పనులకు వెళ్లే కూలీలు ఎండ వేడిమికి తాళలేక ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై చిరువ్యాపారులు సైతం సూర్యుడి ధాటికి బయటకు రావడం లేదు. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు జనం శీతలపానీయాలు సేవిస్తున్నారు. దీంతో జ్యూస్‌పాయింట్లు కిక్కిరిసి కనిపిస్తున్నాయి.

భానుడి భగభగలు
భానుడి భగభగలకు జనం ఇంటికే పరిమితమవుతున్నారు. ఇంట్లో ఉన్నప్పటికీ వడగాల్పుల ధాటికి తలుపులు మూసి ఉంచుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో ఏసీలు, కూలర్ల వాడకం పెరిగిపోయింది. కొందరు పాత వాటిని బయటకు తీసి వాడుతుండగా, లేనివారు షాపులకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. తద్వారా జిల్లాలో విద్యుత్ వాడకం పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. ఇక మధ్యాహ్నం పరిస్థితి ఊహికందడం లేదు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో నెత్తిమాడు పగిలిపోతుందా అన్నట్లుగా ఎండ తీవ్రత ఉంటోంది. సూర్యుడి ప్రతాపానికి తోడు వడగాల్పులు వీస్తుండడంతో ప్రజలు బయట ఎక్కువ సేపు ఉండలేకపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాలనుకునే జనం గొడుగులు, టోపీలు, స్కార్ప్స్ ధరిస్తున్నారు. అయినా పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోతున్నారు. ఎండ తీవ్రత ధాటికి ప్రజలు చల్లటి పానీయాల కోసం పరుగులు తీస్తున్నారు. చెరుకు, నిమ్మకాయ, బత్తాయి, కొబ్బరి బొండాలు, ఇతరత్రా పండ్ల రసాలు అధికంగా సేవిస్తున్నారు. వడగాలులు వీస్తుండడంతో డయేరియా, డీహైడ్రేషన్ లాంటి రోగాల బారిన పడే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువసేపు ఎండలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తెల్లటి కాటన్ దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు.

64
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles