పరకాల తాటివనంలో మంటలు

Tue,April 16, 2019 01:45 AM

పరకాల, నమస్తే తెలంగాణ : తాటివనంలో మంటలు ఎగిసిపడిన ఘటన పరకాల పట్టణ శివారులో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. పరకాల-మొగుళ్లపల్లి ప్రధాన రహదారిలో చెత్తకు నిప్పంటుకుని కట్టపై ఉన్న తాటిచెట్లను తాకాయి. కట్టకు ఇరువైపులా తాటిచెట్లు కాలుతూ మంటలు పరకాల-రాయపర్తి రోడ్డులోని శ్రీరామ, మహేశ్వర ఇండస్ట్రీస్ వరకు వ్యాపించాయి. ఈ మంటలతో రెండు మిల్లులు కాలిబూడిదయ్యే పరిస్థితి ఏర్పడగా పరకాల, కాకతీయ థర్మల్ పవర్‌ప్లాంట్, ములుగు ఫైర్ ఇంజిన్లు వచ్చి నాలుగు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. సోమవారం రాత్రి 7 గంటలకు ప్రారంభమైన మంటలు రాత్రి సుమారు 11 గంటల వరకు కొనసాగాయి. ఈ ఘటనలో రెండు మిల్లులకు ఘోర ప్రమాదం తప్పింది. మిల్లుల్లోకి మంటలు ప్రవేశించి ఉంటే అందులోని ధాన్యం, మిషనరీ అంతా తగలబడేది.

రోడ్డుకు అటుగా వెళ్తున్నవారు, మిల్లు సిబ్బంది, యజమానులకు సమాచారం అందించగా వారు ఫైర్, పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన పరకాల సీఐ జీ మధు, ఏసీపీ వైవీఎస్ సుధీంద్ర, ఎస్సైలు శ్రీకాంత్‌రెడ్డి, రవీందర్, రవికిరణ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు వ్యాపిస్తున్న ప్రదేశానికి ఎవరూ కూడా వెళ్లకుండా అడ్డుకున్నారు. సిబ్బంది బకెట్లతో ఓవైపు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. పరకాల ఫైర్ ఇంజిన్ చేరుకుని శ్రీరామ రైస్‌మిల్లుకు మంటలు వ్యాపించకుండా ఆర్పే ప్రయత్నం చేసినా అదుపులోకి రాలేదు. వెంటనే ఏసీపీ ములుగు, హుజురాబాద్, కేటీపీపీ, హన్మకొండ ఫైర్ స్టేషన్లకు సమాచారం అందించి, ఫైర్ ఇంజిన్లను రప్పించాలని అక్కడి అధికారులను కోరారు. గణపురం మండలం చెల్పూరు కేటీపీపీలోని ఫైర్ ఇంజన్ టాప్ నుంచి మంటలను లక్ష్యంగా చేసుకుని అదుపులోకి తీసుకువచ్చింది. రెండున్నర గంటలు మంటలు వ్యాపించడంతో ఆ చుట్టూగల సుమారు 500 తాటి, ఈత చెట్లు ఈ ఘటనలో కాలిపోయాయి.

128
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles