ముగిసిన ఎన్నికల ఘట్టం

Fri,April 12, 2019 02:41 AM

- లోక్‌సభ పోలింగ్ ప్రశాంతం
- కేంద్రాల్లో మొరాయించిన ఈవీఎంలు
- పలుచోట్ల ఆలస్యంగా పోలింగ్ ప్రక్రియ
- ఉత్సాహంగా ఓటేసిన యువత
- నియోజకవర్గంలో 62.23 శాతం పోలింగ్
- ఎల్లంలలో ఎమ్మెల్యే, బచ్చన్నపేటలో ఎమ్మెల్సీ, జనగామలో కలెక్టర్, డీసీపీ..
- ఓటుహక్కు వినియోగించుకున్న ప్రముఖులు
- పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కేంద్ర ఎన్నికల పరిశీలకుడు అజిత్‌కుమార్, కలెక్టర్
- పట్టణంలోని 28వ వార్డులో ఓటింగ్ సరళి పరిశీలించిన ఎంపీ అభ్యర్థి నర్సయ్య, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్

జనగామ, నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 11 : జనగామ అసెంబ్లీ నియోజకవర్గంలో గురువారం లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పట్టణ ప్రాంతంలో పోలింగ్ ప్రారంభమైన తొలిగంటలోపే ఓటేసేందుకు ఉత్సాహం చూపగా, గ్రామాల్లో ఉదయం మందకొడి ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం తర్వాత తాకిడి పెరగడంతో ఓటుహక్కు వినియోగించుకునేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు బారులుదీరారు. ఈసారి వృద్ధులు, మహిళలు, ప్రధానంగా తొలిసారి కొత్తగా ఓటుహక్కు లభించిన యువ ఓటర్లు, భారీసంఖ్యలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. పట్టణంలో పోలింగ్ ప్రక్రియ స్పీడ్ జరిగితే గ్రామాల్లో మాత్రం ఓటుకు ఓటుకు మధ్య చాలా సమయం పట్టింది. దీంతో ఓటర్లు పెద్దసంఖ్యలో క్యూలైన్లలో వేచి ఉండటంతో పలు కేంద్రాల్లో జాతర వాతావారణం తలపించింది. ఉద్యోగ, ఉపాధి కోసం పట్టణాలకు వెళ్లిన ప్రజలు ఓట్లు వేసేందుకు పెద్దఎత్తున స్వగ్రామాలకు తరలిరావడంతో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపించింది.

పలు కేంద్రాల్లో సాంకేతిక సమస్యలతో ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. మరికొన్ని పోలింగ్ కేంద్రాల్లో అభ్యర్థుల తరఫు ఏజెంట్లు రావడం ఆలస్యం కావడంతో ఉదయం 7గంటల్లోపు నిర్వహించాల్సిన మాక్ పోలింగ్ ప్రక్రియ కొంత ఆలస్యంగా జరిగింది. పట్టణంలోని 240వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం పనిచేయక ఆలస్యం కావడటంతో స్థానికులు కొందరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా అదనపు యంత్రాలను పంపడంతో ఉదయం 8.30గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అదేవిధంగా ప్రెస్టన్ కళాశాల కేంద్రంలో రెండు ఈవీఎంలు మొరాయించడంతో 40నిమిషాలు ఆలస్యం కాగా, రైల్వేస్టేషన్ జెడ్పీస్కూల్‌లో ఓటింగ్ మధ్యలో ఒక ఈవీఎం మొరాయించగా, ధర్మకంచలో కేంద్రంలో ఓటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఈవీఎం పనిచేయకపోవడంతో సాంకేతిక సిబ్బంది సరిచేశారు. ఓటు యంత్రాన్ని నొక్కడం(ప్రెస్)పై గ్రామీణ ఓట్లు, ప్రధానంగా వృద్ధులు, కంటిచూపు తక్కువగా ఉన్న వారికి సరైన అవగాహన లేకపోవడంతో తమ ఓటు పడిందో లేదో తెలియక తికమకపడ్డారు. ఈవీఎంలో బీప్ శబ్దం వచ్చిన తర్వాత కూడా అక్కడి నుంచి కదలక పోవడంతో పలుసార్లు పోలింగ్ అధికారి వచ్చి సర్దిచెప్పడంతో ప్రక్రియ ఆలస్యమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ స్లిప్ చూపితే ఓటు వేసేందుకు అనుమతించిన అధికారులు ఈసారి 11రకాల గుర్తుంపుకార్డుల్లో ఏదైనా ఒకటి చూపాలంటూ ఓటర్‌స్లిప్‌లను నిరాకరించడం చాలామంది ఓటర్లు ఓటు వేయకుండానే వెనుదిరిగారు.

అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ శాతం తగ్గడానికి ఎండవేడిమి సహా ఓటర్‌స్లిప్‌ల నిరాకరణ కారణమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో సాయంత్రం 5గంటల వరకు కూడా జిల్లా కేంద్రంలోని పలు బూత్‌ల్లో ఓటర్లు రెండువరుసల్లో బారులుదీరగా, ఈసారి ఓటింగ్‌కు ప్రజలు ఆసక్తి చూపకపోవడంతో 4గంటల్లోపు చాలా కేంద్రాల్లో జనం కనిపించలేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓటర్లు నిదానంగా రావడంతో పలుచగా కనిపించినా 2గంటల తర్వాత ఒక్కసారిగా తాకిడి పెరిగింది. చాలా కేంద్రాల్లో ఉదయం 7గంటలకే ఓటు వేసేందుకు వృద్ధులు, మహిళలు, రైతులు క్యూలైన్లలో నిలబడ్డారు. మధ్యాహ్నం తర్వాత కొత్తగా ఓటు హక్కు పొందిన ఓటర్లు, ఉత్సాహంగా ఓటేశారు. ఎన్నికల నిఘా అధికారులు, ఫ్లయింగ్ స్కాడ్ బృందం పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. డీసీపీ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పోలీసు బృందాలు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. వెబ్‌కాస్టింగ్ విధానంతో పోలింగ్ శాతం, ఓటింగ్ సరళి, అధికారుల పనితీరును ఎప్పటికప్పుడు ఇంటర్‌నెట్ ద్వారా ఎన్నికల సంఘానికి నివేదించారు. ఎన్నికల నిర్వహణపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టీ వినయ్‌కృష్ణారెడ్డి కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హాల్ నుంచి వెబ్‌కాస్టింగ్, లైవ్ టెలికాస్ట్ ద్వారా సమీక్షించారు. పోలింగ్ బందోబస్తుపై డీసీపీ, ఏసీపీలుపోలీసు అధికారులతో సమీక్షించారు. పలు కేంద్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం సాధారణ పరిశీలకులు అజిత్‌కుమార్ పోలింగ్ తీరు, ఏర్పాట్లను పరిశీలించారు. నియోజకవర్గంలోని పలు కేంద్రాల్లో పోలిగ్ సరళిని టీఆర్‌ఎస్ అభ్యర్ధి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్ధి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు తదితరులు పరిశీలించారు. రాత్రి 10గంటల వర కు వివిధ పోలింగ్ కేంద్రాల నుంచి జనగామ సాంఘీక సంక్షేమ గురుకుల కళాశాల కేంద్రానికి చేరుకున్న ఈవీఎంలు, వీవీప్యాట్‌లను భారీ భద్రత నడుమ పోలీసులు కౌంటింగ్ జరిగే భువనగిరి యాదాద్రి జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్‌రూంకు తరలించారు.

జనగామలో 62.23 శాతం పోలింగ్
జనగామ అసెంబ్లీ నియోజకవర్గంలోని 277 కేంద్రాల్లో పోలింగ్ శాతం 62.23 నమోదైంది. ఎండతీవ్రత ఎక్కువగా ఉండటం, అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా పార్లమెంట్ ఎన్నికల్లో ఓటరు స్లిప్‌పై ఓటేసేందుకు అనుమతించక పోవడం వంటి అనేక కారణాలతో ఈసారి ఓటింగ్‌శాతం చాలా తగ్గుతుందని భావించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 87శాతం ఓటింగ్ నమోదైంది. నియోజకవర్గంలో ఉదయం 9గంటల వరకు 7.25శాతం, 11గంటలకు 16.50శాతంగా నమోదైన పోలింగ్ ఆ తర్వాత ఒక్కసారిగా పోలింగ్‌శాతం పెరిగింది. మధ్యాహ్నం 1గంటకు 48.65శాతం, సాయంత్రం 3గంటలకు 56.68శాతం, సాయంత్రం 5గంటల వరకు 62.23 శాతానికి చేరింది.

86
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles