నేడే పోలింగ్

Thu,April 11, 2019 01:33 AM

- సర్వం సిద్ధం చేసిన అధికారులు
- ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం
- సాయంత్రం 5 గంటలకు ముగింపు
- జిల్లాలో 857 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
- విధుల్లో 3854 మంది సిబ్బంది..
- 496 వెబ్ కెమెరాలు, 102 వీడియో గ్రాఫర్లు
- బందోబస్తులో 1125 పోలీస్ సిబ్బంది
- దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు
- పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక వసతులు
- మే 23న ఫలితాల వెల్లడి

జనగామ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో వరంగల్, భువనగిరి పార్లమెంట్ స్థానాలకు జరిగే ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. జిల్లావ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ కోసం 857 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జనగామ నియోజకవర్గంలో 277, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో 290 చొప్పున పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. 3854 మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. జిల్లాలోని 49 సమస్యాత్మక కేంద్రాల్లో పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు 496 వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. 102 మంది వీడియో గ్రాఫర్లను నియమించారు. ఇప్పటికే అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సామగ్రితో సహా చేరుకున్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు 1125 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు చేపట్టనున్నారు.

6,96,535 మంది ఓటర్లు..
జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 6,96,535 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు అధికార యంత్రాంగం 857 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. 1526 బ్యాలెట్ యూనిట్లు, 1190 కంట్రోల్ యూనిట్లు, 1264 వీవీ ప్యాట్స్‌ను వినియోగిస్తున్నారు.

పోలింగ్ సందర్భంగా సాంకేతిక కారణాలతో యంత్రాలు మొరాయిస్తే అదనపు యంత్రాలు అందుబాటులో ఉంచారు. ఎన్నికల నిర్వహణకు 3854 మంది సిబ్బందిని నియమించారు. ఇందులో 630 మంది మైక్రో అబ్జర్వర్లు, 2084 మంది పీవోలు, ఏపీవోలు, 790 మంది ఓపీవోలు, 260 వాహనాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే వీరంతా పోలింగ్ సామగ్రితో వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. వేసవి దృష్ట్యా పోలింగ్ కేంద్రాల్లో టెంట్లు, షామియానాలు ఏర్పాటు చేశారు. వృద్ధులు, దివ్యాంగ ఓటర్ల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. వృద్ధులు కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేశారు. తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. దివ్యాంగుల కోసం ఇంటి నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చేలా వాహనాలు సమకూర్చారు. వారు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న తర్వాత క్యూ లైన్‌తో సంబంధం లేకుండా ఓటు వేసే సౌకర్యం కల్పించారు.

సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా..!
లోక్‌సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసింది. జిల్లాలో 857 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 808 సాధారణం కాగా.. మిగిలిన 49 ప్రాంతాలను సమస్యాత్మకమైనవి గుర్తించారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు అదనపు బలగాలను మోహరించారు. జిల్లావ్యాప్తంగా 1 డీసీపీ, 5 ఏసీపీలు, 15 సీఐలు, 41 మంది ఏఎస్సైలు, 1018 హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, మహిళా పోలీసులు, హోంగార్డులు, ఏఆర్ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. 48 గంటల ముందుగానే మద్యం షాపులు మూసివేశారు. పోలింగ్‌స్టేషన్లకు 200 మీటర్ల దూరంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

మే 23న ఓట్ల లెక్కింపు
ఫలితాలను మే 23న వెల్లడించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం పోలీస్ బందోబస్తు మధ్య వరంగల్ పార్లమెంట్‌కు సంబంధించిన ఈవీఎంలను వరంగల్ ఏనుమాముల మార్కెట్‌కు తరలిస్తారు. జనగామ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను భువనగిరిలోని ఆరోరా ఇంజినీరింగ్ కళాశాలకు తరలించనున్నారు. మే 23న ఉదయం లెక్కింపు ప్రారంభించి సాయంత్రం కల్లా తుది ఫలితాలు వెల్లడిస్తారు.

జిల్లాలో ఓటర్ల వివరాలు..
మొత్తం ఓటర్లు : 6,96,535
పురుషులు : 3,48,222
మహిళలు : 3,48,301
ఇతరులు : 12 మంది

జనగామ నియోజకవర్గం
మొత్తం ఓటర్లు : 2,23,932
పురుషులు : 1,11,520
మహిళలు : 1,12,412
ఇతరులు : 2

స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం
మొత్తం ఓటర్లు : 2,36,452
పురుషులు : 1,18,148
మహిళలు : 1,18,303
ఇతరులు : 1

పాలకుర్తి నియోజకవర్గం
మొత్తం ఓటర్లు : 2,36,151
పురుషులు : 1,18,554
మహిళలు : 1,17,588
ఇతరులు : 9 మంది

49
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles