మేం ఎప్పుడో గెలిచినం

Wed,April 10, 2019 01:53 AM

- మెజార్టీ కోసమే ఆరాటం
- ప్రజా స్పందన బాధ్యతను పెంచింది
- కాంగ్రెస్, బీజేపీలను ఎవ్వరూ నమ్మరు
- ప్రచారంలో లేనివాళ్లకు పతార ఎక్కడుంటది
- నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు ఎప్పుడో ఖాయమైంది. మా ప్రచారం అంతా మెజారిటీ కోసమే. కాంగ్రెస్, బీజేపీలు ప్రచారంలో కనిపించలేదు. రేపు ఓటింగ్‌లో కూడా ఆ పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవు. ప్రజలకు టీఆర్‌ఎస్ అంటే నమ్మకం. సీఎం కేసీఆర్ అంటే విశ్వాసం. మా అభ్యర్థులు పసునూరి దయాకర్, మాలోతు కవిత భారీ మెజారిటీతో గెలుస్తున్నరు అని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రజల డిమాండ్లను పరిష్కరించే సత్తా ఒక్క టీఆర్‌ఎస్ పార్టీకే ఉందని ప్రజలు గుర్తించారని ఆయన స్పష్టం చేశారు. మానుకోట పార్లమెంట్ పరిధిలో పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేది టీఆర్‌ఎస్ పార్టీ అని ఆదివాసీలు, గిరిజనులు భావిస్తున్నారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కుగా ఆనాడు ఉద్యమం చేసినం రేపు బయ్యారంలో కచ్చితంగా ఉక్కు ఫ్యాక్టరీనీ స్థాపిస్తాం అని అయన పేర్కొన్నారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం పోరాటం మిగిలే ఉందని, వరంగల్ టెక్స్‌టైల్ పార్క్ పూర్తి చేసి తీరుతమన్నారు. ప్రజల స్పందన తమపై మరింత బాధ్యత పెంచిందని, అందులో భాగంగానే మానుకోటలో మెడికల్ కాలేజీని స్థాపించబోతున్నామని పేర్కొంటూనే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వ్యవసాయాన్ని అనుసంధానం చేసేందుకు పోరాటం చేస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని రెండింటికి రెండు స్థానాలను భారీ మెజారిటీతో గెలిచి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇచ్చి తీరుతమన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో రెండు పార్లమెంట్ స్థానాల్లో ప్రచార బాధ్యతలు నిర్వర్తించిన ఆయన మంగళవారం నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలిలా ఉన్నాయి.

వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల ప్రచార బాధ్యతలు చూశారు. ప్రచారం ఎలా సాగింది. ప్రజల స్పందన ఎట్లా ఉంది?
మంత్రి ఎర్రబెల్లి: బ్రహ్మండంగా టీఆర్‌ఎస్ అభ్యర్థుల్ని పార్లమెంట్‌కు పంపేందుకు ఉత్సాహంగా ఉన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్న తేడా లేకుండా ఎవరికి వాళ్లు నేనే అభ్యర్థిని అన్నట్టు ప్రచారం చేశారు. వరంగల్, మహబూబాబాద్ రెండు పార్లమెంట్ స్థానాలను భారీ మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రికి కానుకగా ఇస్తున్నాం. నేను రెండు పార్లమెంట్ స్థానాల్లోని శాసనసభ నియోజకవర్గ కేంద్రాలే కాదు దాదాపు అన్ని మండలాలను కవర్ చేశాను. ప్రజల నుంచి మస్తు రెస్పాన్స్ వస్తున్నది. టీఆర్‌ఎస్‌కే ఓటేస్తమని జనం చెప్పిండ్లు. పెద్ద పెద్ద సభలు జరిగినవి. సీఎం కేసీఆర్ చెప్పిన ముచ్చట్లను ప్రజలు విన్నరు. మనం ఏం చేసినమో గదే చెప్పినం. ఏం చేస్తామో కూడా ప్రజలకు తెలుసు. కేసీఆర్ మీదున్న అభిమానం, విశ్వాసం టీఆర్‌ఎస్ పార్టీ పట్ల గౌరవం మాకు కొండంత అండ. ప్రజలు సిద్ధంగా ఉన్నరు. ప్రచారంలో ప్రజలిచ్చిన దీవెన మాటల్లో చెప్పలేను. మా బాధ్యత మరింత పెరిగింది. నేను మొదటిసారి చూసిన కాంగ్రెస్, బీజేపీలు ఘోరంగా చతికిలపడ్డాయి. ప్రచారంలో కనీసం కనిపించలేదు. పోటీ మాలో మాకే.

కాంగ్రెస్, బీజేపీ పోటీలో లేనప్పుడు. విజయం ఏకపక్షమని భావిస్తున్నారా?
మంత్రి ఎర్రబెల్లి: అందులో అనుమానం అక్కరేలేదు. మేం గెలిచినం. 14 నియోజకవర్గాల్లో మాకు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ వస్తయి. ఎమ్మెల్యేలు, మండల స్థాయి నాయకులు పోటీపడి ప్రచారం చేశారు. పోటీ ఎమ్మెల్యేలకే ఉంది. మా నియోజకర్గంలో ఎక్కువ మెజారిటీ ఇస్తామంటే మా నియోజకర్గంలోనే ఎక్కువ ఇస్తమని అంటున్నరు. బీజేపీ, కాంగ్రెస్ సచ్చిపోయిన తీరుగ ఉన్నవి.

కాంగ్రెస్, బీజేపీ ప్రచారంలో లేరని మీరంటున్నరు. కానీ , టీఆర్‌ఎస్ పార్టీ 16 ఎంపీలు గెలిస్తే ఏం చేస్తుంది? దేశాన్ని జాతీయ పార్టీలే శాసిస్తాయి అని అంటున్నాయి కదా? దీనిపై మీ కామెంట్
మంత్రి ఎర్రబెల్లి: శాతగానోళ్లు ఏమైనా మాట్లాడతరు. వాళ్లు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడిగిండ్లు. రాష్ట్రంల కాంగ్రెస్, బీజేపీలున్నయా? ఒకరిద్దరు నాయకులొచ్చి అది కూడా ప్రచారం చేయాలి కాబట్టి చేసినం అని రాసుకోవటానికే వచ్చిపోయిండ్లు. కాంగ్రెస్ పార్టీ సచ్చిన శవం తీరుగ అయింది. వాళ్లకు ఆశే లేదు. బీజేపీ అయితే పత్తకు లేకుంట పోయింది. ప్రెస్ మీటింగ్‌లు పెట్టుకొని పోయిండ్లు తప్పు జనం దగ్గరికి పోయిండ్లా వాళ్లు. తెలంగాణల టీఆర్‌ఎస్, రేపు ఢిల్లీల సుత టీఆర్‌ఎస్ పార్టే చక్రం తిప్పేది. టీఆర్‌ఎస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ప్రజలకు విశ్వాసం ఉన్నది. నమ్మకం ఉన్నది. ఈ పార్టీ అయితేనే మా బతుకును బాగుచేస్తది అని భరోసా ఉన్నది. రేపు 16 సీట్లు గెలుసుకొని ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయబోయేది ఎవలో, ఆ ధైర్యం ఎవలకు ఉందో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. రాష్ట్రం నుంచి టీఆర్‌ఎస్ 16 మంది ఎంపీలను గెలిపిస్తే మన కాళేశ్వరం, మన దేవాదులకు, మన పాలమూరుకు జాతీయ హోదా వస్తది. కేంద్రంలో ఉన్న పార్టీ మన తెలంగాణకు ఏమి కొత్తగా ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఎప్పుడూ పట్టిచ్చుకోలే. ఆ పార్టీల చరిత్ర ప్రజలకు తెల్వదా? రేపు కేంద్రంలో మన 16 ఎంపీలే కాదు ఇంకా అన్ని పార్టీల మద్దతు వస్తుంది. రైతు బంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, కళ్యాణలక్ష్మి అసుంటి పథకాలు టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెచ్చినవి కాదా? మన రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టి నరేంద్రమోడీ అమలు చేసిండు. రాహుల్ గాంధీ సుత మేం ఇత్తం అన్నడు. వాళ్ల మెడలు వంచి రైతులకు పైసో పరకో ఇప్పించేలా చేసింది టీఆర్‌ఎస్ పార్టీ కాదా? గుండెల మీద చేయి వేసుకొని చెప్పాలె. ఆ పార్టీలు. జాతీయ పార్టీలు ఎక్కడున్నవి. ఇవ్వాల దేశ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరుకుంటున్నరు.

టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటేందుకు వేయాలి?
మంత్రి ఎర్రబెల్లి: టీఆర్‌ఎస్ పార్టీకే ఓటేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నరు. మా ప్రజలపై మాకు నమ్మకం ఉంది. వారికి టీఆర్‌ఎస్ పార్టీ మీద విశ్వాసం ఉన్నది. ఎన్నికల హామీలను నెరవేర్చింది టీఆర్‌ఎస్ పార్టీ. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా వందల పథకాలు తెచ్చినం. సంక్షేమం, అభివృద్ధి టీఆర్‌ఎస్ చేసినట్టు ఎవలూ చేయలేదు. తెలంగాణ ఓటు అడిగే హక్కు ఒక్క టీఆర్‌ఎస్‌కే ఉన్నది. రాష్ర్టాన్ని అభివృద్ది, సంక్షేమ పథకాలను దేశంలో ఎక్కడా లేనివిధంగా అమలు చేస్తున్న పార్టీ టీఆర్‌ఎస్. కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతాండ్లు? మొన్న ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు బుద్ది చెప్పిండ్లు. మళ్ల బుద్దిచెప్పేందుకు తయారుగా ఉన్నరు. ఆ పార్టీలకు డిపాజిట్లు కూడా రావు. అసలు కాంగ్రెస్ వాళ్లు పోటీల ఉన్నరా? అని వాళ్ల పార్టీల్లో అనుమానపడ్తున్నరు. అసలు టీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటేయ్యద్దో వాళ్లు చెప్పాలి? మన రైతు బంధును దేశం అంతా ఇచ్చేలా చేసినందుకు టీఆర్‌ఎస్‌కు ఓటేయ్యద్దా? మిషన్ భరీరథ 11 రాష్ర్టాలు అమలు చేసే గొప్ప పనిచేసి చేసినందుకు ఓటేయ్యద్దా? రైతులకు 24 గంటలకు కరెంట్ ఇచ్చినందుకు ఓటెయ్యద్దా? కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కేలేదు. బీజేపీ వాళ్లు బాగా మాట్లాడుతాండ్లు కదా? కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా ఎందుకియ్యలేదు? బయ్యారం ఉక్క ఫ్యాక్టరీ ఎందుకు ఇత్తలేరు? ఏ మొహం పెట్టుకొని బీజేపోళ్లు ఓటు అడుగుతున్నరు? తెలంగాణ ప్రజలకేం కావాలో టీఆర్‌ఎస్ పార్టీకి తెలుసు. మా సీఎం కేసీఆర్‌కు తెలుసు. ప్రజలివ్వాల ఎవలను చూస్తలేరు. సారూ.. కారూ.. పదహారు ఇదే చూసిండ్లు. పదహారు సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నరు. మేం ఇప్పటికే గెలిచినం.

ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిస్తే ఈ రెండు పార్లమెంట్ స్థానాల పరిధిలో ఏం సాధిస్తారు? ప్రజల డిమాండ్ ఏమిటని మీరు గుర్తించారు?
మంత్రి ఎర్రబెల్లి: వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానా ల పరధిలో మనం కేంద్రం నుంచి భారీగా నిధులు తెచ్చుకొని అభివృద్ది చేసుకోవాల్సింది ఎంతో ఉంది. మాకు టీఆర్‌ఎస్ పార్టీ గెలిస్తేనే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వస్తదని నమ్మకం ఉంది. సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేసిండు. కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే సింగరేణితో అక్కడ ఫ్యాక్టరీ పెట్టిస్తం అని మాట ఇచ్చిండు. కమలాపూర్ బిల్ట్ ఫ్యాక్టరీ తెరిపించే బాధ్యత టీఆర్‌ఎస్ తీసుకుంటది. ఇప్పటికే రూ.350 కోట్లు రాష్ట్రం ఇచ్చింది. మానుకోటలో మెడికల్ కాలేజీకి సీఎం ఒప్పుకున్నరు. అది వచ్చినట్టే. టెక్స్‌టైల్‌పార్క్‌కు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలె. వరంగల్ ఔటర్ రింగ్‌రోడ్డు రెండు జాతీయ రహదారుల పూర్తి కావాలె. తెలంగాణ బిల్లులో ఉన్న కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ రావాలె. దాని కోసం పోరాటం చేసి సాధించి తీరుతం.

జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసానికి అనుబంధం చేయాలని డిమాండ్ చేశారు. ప్రయత్నాలు ఏమైనా చేశారా?
మంత్రి ఎర్రబెల్లి: ఇదెప్పటి నుంచో ఉన్న డిమాండ్. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ పనులు, కూలీ పనులు చేసేవారికి భరోసా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సార్లు కేంద్రానికి లెటర్లు ఇచ్చిండు. మన్మోహన్‌సింగ్ నుంచి మోడీని కూడా కలిసి రిక్వెస్ట్ చేసినా ఫలితం రాలే దు. రేపు కేంద్రంలో ఏర్పడే ఫెడరల్ ఫ్రంట్‌లో ఇదే ప్రధాన డిమాండ్. కచ్చితంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో వ్యవసాయాన్ని చేర్చేదాకా పోరాటం చేస్తాం.

నమస్తే తెలంగాణ: మీకు ఎవరితో పోటీ?
మంత్రి ఎర్రబెల్లి: మాకు ఎవలతోని పోటీలేదు. మాకు మేమే పోటీ. రెండింటిలోనూ పెద్ద మెజారిటీతో గెలుస్తున్నం. గెలుపు ఎప్పుడో ఖరారైంది. మెజారిటీ కోసమే మా ఆరాటం. ప్రజలకు తెలిసిపోయింది. కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లేసినా అవి మురిగిపోవుడే అని. ఎవలన్న మురికి కాల్వల వేసుకుంటరా? ఇక్కడ బీజేపీ పువ్వు పూసేది లేదు. కాయ కాసేది లేదు. నియోజకవర్గానికి ఐదు లక్షల మెజారిటీ చొప్పున వరంగల్, మహబూబాబాద్ స్థానాలను భారీ మెజారిటీతో గెలిచి తీరుతం.

53
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles