ఎమ్మెల్సీ ఎన్నికలకు సన్నద్ధం

Thu,March 21, 2019 01:35 AM

- రేపు పోలింగ్
- 3 నియోజకవర్గాల్లో 835 మంది ఓటర్లు
- జిల్లావ్యాప్తంగా 12 పోలింగ్ కేంద్రాలు
- అన్ని సెంటర్లలో వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ
- 12 మంది పీవోలు, 25 మంది ఏపీవోలు
- భారీ పోలీస్ బందోబస్తు

జనగామ జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ: వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లావ్యాప్తంగా మూడు నియోజకవర్గాల్లో 835 మంది ఓటర్లు ఉండగా, 12 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు 12 మంది పీవోలు(ప్రిసైడింగ్ ఆఫీసర్స్), 25 మంది ఏపీవోలు(అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్), 12 మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్‌తో 12 పోలీస్ టీంలను ఏర్పాటు చేశారు. వీరితోపాటు 12 మంది జోనల్ ఆఫీసర్లను నియమించారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీకి సంబంధిత సిబ్బందిని వినియోగిస్తున్నారు. వెబ్‌కాస్టింగ్ కోసం ఒక నోడల్ అధికారిని నియమించారు. అదేవిధంగా వీడియోగ్రఫీ కోసం పోలింగ్ కేంద్రానికి ఒకరిని చొప్పున 12 మందిని ఏర్పాటు చేశారు. ఇప్పటికే వారికి తగిన శిక్షణ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ బాక్స్‌లను వినియోగిస్తున్నందున అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేపట్టింది. 12 మంది మైక్రో అబ్జర్వర్లతోపాటు అదనంగా మరో ఇద్దరిని నియమించింది. సాయంత్రం కల్లా పోలింగ్ అధికారులు, సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు సామగ్రితో సహా చేరుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

ఎన్నికల బరిలో 9 మంది
గత నెల 25న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. అదేరోజు నుంచి ఈ నెల 5 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. 6న నామినేషన్లు పరిశీలించారు. ఈ నెల 8వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. ఈ నేపథ్యంలో వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి 9 మంది అభ్యర్థులు బరిలో నిలుస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ మేరకు అభ్యర్థులు గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అభ్యర్థులతోపాటు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సంబంధిత ఉపాధ్యాయ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నియోజకవర్గాలు, మండలాల వారీగా పర్యటిస్తూ ఓటర్లను కలిశారు. ఇప్పటికే అభ్యర్థులు ఆయా ప్రాంతాల్లో పలుమార్లు పర్యటించారు. శుక్రవారం ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం పోలీస్ బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్స్‌లను కౌంటింగ్ కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 26న కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు వెల్లడించనున్నారు.

పోలింగ్ కేంద్రాలు ఇవే..
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం 12 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఆయా మండలాలకు చెందిన ఓటర్లు ఎక్కడికక్కడే ఓటుహక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు. జనగామ మండలానికి సంబంధించి జనగామ ఎంపీడీవో కార్యాలయం, నర్మెటలో జిల్లా పరిషత్ పాఠశాల(ఈస్ట్), తరిగొప్పులలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బచ్చన్నపేటలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, లింగాలఘణపురంలో జెడ్పీఎస్‌ఎస్, రఘునాథపల్లిలో జెడ్పీఎస్‌ఎస్, స్టేషన్‌ఘన్‌పూర్‌లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చిలుపూరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జఫర్‌ఘడ్‌లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(వెస్ట్), పాలకుర్తిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, దేవరుప్పులలో మండల పరిషత్ కార్యాలయం, కొడకొండ్లలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా ఏడు రూట్లు ఏర్పాటు చేశారు. అందులో జనగామ డివిజన్‌లో 4, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 3 రూట్లు ఉన్నాయి. ఈ మేరకు రూట్ అధికారులు ఎప్పటికప్పుడు ఎన్నికల నిర్వహణ తీరును పర్యవేక్షించనున్నారు.

ఎన్నికల నిర్వహణకు సహకరించాలి
జనగామ, నమస్తే తెలంగాణ, మార్చి 20 : ఈ నెల 22న జరిగే వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు సహకరించాలని జనగామ అసెంబ్లీ సెగ్మెంట్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో మధుమోహన్ కోరారు. ఆర్డీవో కార్యాలయంలో బుధవారం జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై పోలింగ్ కేంద్రాలు, రూట్లు, పంపిణీ, స్వీకరణ కేంద్రాలు, ఎన్నికల ప్రవర్తన నియమావళిపై చర్చించారు. అదేవిధంగా లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రచార వాహనాలకు సువిధ ద్వారా అనుమతులు వంటి అంశాలపై సూచనలు చేశారు. సమావేశంలో జనగామ తహసీల్దార్ పీ రవీందర్, టీఆర్‌ఎస్, టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, బీజేపీ, బీఎస్‌పీ పార్టీల ప్రతినిధులు రావెల రవి, వృకోదర్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, సోమయ్య, శివరాజ్, జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

56
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles