ఉపాధి పనులకు నిధులు పుష్కలం

Thu,March 21, 2019 01:31 AM

కొడకండ్ల, మార్చి 20: జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్వహించే పనులకు నిధులు పుష్కలంగా ఉన్నాయని, కూలీలు వంద రోజుల పనులను ఉపయోగించుకోవాలని పంచాయతీరాజ్, ఉపాధి హామీ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం ఆయన మండలంలోని రామవరం గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కూలీలు చేస్తున్న పనులు, వారికి అందుతున్న వేతనాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి కూలీలతో మాట్లాడుతూ ప్రభుత్వం వద్ద ఉపాధి పనులకు సంబంధించిన నిధులు ఉన్నాయన్నారు. వేసవిలో పని చేసే వారికి అధికారులు మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. వేసవిలో పని చేసే వారికి ఫిబ్రవరి నెలలో పని చేసిన దానికంటే అదనంగా 20 శాతం వేతనం వస్తుందని వివరించారు. మార్చి నెలలో 25 శాతం, ఏప్రిల్, మేలో 30 శాతం, జూన్‌లో 20 శాతం బోనస్‌ను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. దివ్యాంగ కూలీలకు పని స్థలం నుంచి ఇంటికి చేర్చేందుకు ఆటో కిరాయి ఒక్కొక్కరికి రూ. 10 చొప్పున అందజేస్తారన్నారు. వారి ఆరోగ్యం విషయంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కూలీలకు వడదెబ్బ తగలకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఉదయాన్నే పనులకు వెళ్లి ఎండలు ముదరకముందే పనులు ముగించుకుని ఇళ్లకు చేరాలని కూలీలకు సూచించారు.

రేగడి మట్టిని వినియోగించుకోవాలి
ఉపాధి పనుల్లో భాగంగా చెరువుల వద్ద పూడిక తీస్తే రైతులు తమ పంట పొలాలకు రేగడి మట్టిని తరలించుకుని భూసారాన్ని పెంచుకోవాలని మంత్రి దయాకర్‌రావు సూచించారు. చెరువు మట్టతో అధిక దిగుబడి సాధించవచ్చని తెలిపారు. గ్రామాల్లో ఫాంపాండ్స్, ఫీడర్ చానల్స్, ఇంకుడు గుంతల పనులు జరుగుతున్నాయని, శ్మశాన వాటికలు, పాఠశాలల్లో మరుగుదొడ్లు, వంట షెడ్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని త్వరగా పూర్తి చేయకుంటే సర్పంచ్‌లు, కార్యదర్శులు, ఈజీఎస్ అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. త్వరలో జరిగే హరితహారం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామ నర్సరీల్లో 14 రకాల మొక్కలను అందజేస్తున్నామని, ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలు, ఇంటి ఆవరణలు, రోడ్ల వెంట మొక్కలు నాటి మానవాళి మనుగడను కాపాడాలని పిలుపునిచ్చారు.

39
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles