సాగుకు.. సాంకేతిక సాయం

Wed,March 20, 2019 01:41 AM

-చిన్న, సన్నకారు రైతులకు అందుబాటులో ఆధునిక యంత్రాలు
-పల్లె ప్రగతిలో అద్దెకు వ్యవసాయ పనిముట్లు
-మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహణ
-గ్రామాల్లో చవకగా అద్దెకు లభ్యత
-జిల్లాలో ప్రయోగాత్మకంగా ఐదు మండలాల ఎంపిక
దేవరుప్పుల, మార్చి 19: మారుతున్న కాలానికనుగుణంగా వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. అయితే, గ్రామాల్లో వ్యవసాయానికి సరిపడా శ్రామికశక్తి, ఆధునిక శాస్త్రీయ పరికరాలు అందుబాటులో లేకపోవడం ఒకవైపు.. కూలీల వద్ద పాతకాలపు పనిముట్లు ఉండడం, గ్రామస్థాయిలో రైతులకు సరిపడా యంత్రాలు అందుబాటులో లేకపోవడం మరోవైపు.. ఇలా అనేక కారణాల వల్ల వ్యవసాయం లాభసాటిగా సాగడం లేదు. దీనికి పరిష్కారమార్గం చూపాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఇందులో పల్లె ప్రగతి పథకానికి రూపకల్పన చేసి అమలుకు శ్రీకారం చుట్టింది. వ్యవసాయనికి, కూలీలకు, ఇతర వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు కావాల్సిన అత్యాధునిక పనిముట్లను సమకూర్చడం, గ్రామాల్లో వ్యవసాయ పరిస్థితులను బట్టి వారికి అవసరమైన పనిముట్లను ఎల్లవేళలా అందుబాటులో ఉంచడం, రైతులు, కూలీల నుంచి అభిప్రాయ సేకరణ చేసి వారికి అవసమైన వ్యవసాయ పనిముట్లు అందుబాటులో ఉండేలా చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. కూలీలు తక్కువ శ్రమతో ఎక్కువ పని చేసేలా ప్రస్తుతం శాస్త్రీయ పద్ధతిలో తయారు చేసిన ఆధునిక పరికరాలు ఎన్నో ఉన్నా అవి అట్టడుగు వర్గాలకు చేరడం లేదు. ఆధునిక పనిముట్లను కొనే స్తోమత లేని రైతు కుటుంబాలు అనేకం. దీన్ని దృష్టిలో పెట్టుకుని పనిముట్లను కొనుగోలు చేసి కూలీలకు అద్దె పద్ధతిన సమకూర్చడం, రైతులందరికీ అదనుకు వ్యవసాయం నడిచేలా చేయడమే సర్కార్ లక్ష్యం. మరోవైపు మహిళా సంఘాలకు ఈ పనిముట్లు అద్దెకివ్వడం వల్ల కొంత ఆర్థిక పరిపుష్టి సాధించడమేగాక, కొందరికి ఉపాధి అవకాశాలు లభిస్తాయనేది ప్రభుత్వ ఉద్దేశం.

అవసరానికి అద్దె పరికరాలు..
ఐకేపీ సెర్ప్ నుంచి కస్టమ్ హైరింగ్ స్కీం పేరుతో ఈ పథకాన్ని తెలంగాణవ్యాప్తంగా అన్ని జిల్లాలో ఎంపిక చేసిన మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి డీఆర్డీవో ప్రణాళికలు సిద్ధం చేసింది. జిల్లాలో దేవరుప్పుల, పాలకుర్తి, రఘునాథపల్లి, బచ్చన్నపేట, జఫర్‌ఘడ్ మండలాలను ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్ట్‌గా అవసరార్థులకు అద్దెకు పనిముట్లు ఇచ్చే కార్యక్రమం అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా ఆయా మండలాల్లో ఎంపిక చేసిన గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని పరిసర గ్రామాల రైతులు, కూలీలు, ట్రాక్టర్ ఓనర్లకు, ఇతర వ్యవసాయ అవసరమైన పనిముట్ల జాబితాను సిద్ధం చేస్తున్నారు. రైతులు, కూలీలు ఈ పనిముట్లు విరివిగా కావాలని కోరితే వాటిని అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

మహిళా సంఘాల భాగస్వామ్యం
ఐకేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న మహిళా సంఘాలకు ఈ బాధ్యతలు అప్పజెప్పారు. సెర్ప్ నుంచి మండల సమాఖ్యకు గ్రాంట్ రూపంలో నిధులు సమకూరుస్తారు. ఈ నిధులు ఎంపిక చేసిన గ్రామాల్లో గ్రామైక్య సంఘాలకు అవసరమైన పనిముట్లు కొనుగోలు చేసి అన్ని వర్గాలకు అందుబాటులో ఉంచుతారు. వాటిని అవసరమైన వారు మహిళా సంఘాల వద్ద ఎన్ని రోజులు అవసరమో తెలిపి.. అద్దె ప్రాతిపదికన తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు మహిళా సంఘాల్లో బాధ్యులను పెట్టి ఎప్పటికప్పుడు అద్దె వసూలు నిర్వహణ ఖర్చుల లెక్కలు రాసి గ్రామ సమాఖ్యకు అప్పజెప్పేలా ఏర్పాట్లు చేశారు. ఈ కస్టం హైర్ స్కీం వల్ల మహిళా సంఘాలకు ఉపాధితోపాటు రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.

పనిముట్ల ఎంపిక సర్వే పూర్తి
జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన మండలాల్లో ఈ కార్యాచరణ మొదలు కాగా.. దేవరుప్పుల మండలంలోని సీతారాంపురం క్లస్టర్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారు. ఇప్పటికే ఐకేపీ అధికారులు రైతులు, కూలీలు, ట్రాక్టర్ ఓనర్లు, ఇతర వ్యవసాయ అనుబంధ వర్గాలను సమావేశ పరిచి.. వారికి అవసరమైన ఆధునిక పనిముట్ల చిట్టాను సిద్ధం చేశారు. గ్రామాల్లో ఉన్న, లేని, అవసరమున్న పనిముట్ల వివరాలు, వాటి పేర్లను ఆయా వర్గాల నుంచి సేకరించి అవసరమైనన్ని పనిముట్లను అందుబాటులో ఉంచాలనేది ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఇలా జిల్లాలో ఎంపిక చేసిన అన్ని మండలాల్లో క్లస్టర్ గ్రామాలను తీసుకుని సర్వేకు ఉపక్రమిస్తున్నారు. ఉదాహరణకు గ్రామంలో ఒకేసారి నాట్లు వేస్తుండడం వల్ల ట్రాక్టర్లకు సరిపడా నాటు వేసే యంత్రాలు, దున్నకం పడ్లర్లు, ఇలా వరి కోత యంత్రాలు, మహిళా కూలీల శ్రమశక్తిని వినియోగించుకునేలా ఆధునిక కొడవండ్లు, పత్తి ఏరే మిషన్లు, పల్లీలు వలిచే యంత్రాలు, చాప్‌కట్టర్స్, పంటలపై చీడపీడల నివారణకు రసాయన మందుల పిచికారి యంత్రాలు(స్ప్రేయర్లు), ఎలుగటి పంటల నూర్పుడు యంత్రాలు, ఇతర శాస్త్రీయ పరికరాలు కూలీలకు విరివిగా అందుబాటులో ఉంచితే అదనుకు వ్యవసాయం సాఫీగా సాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

కొనుగోలు కమిటీలు..
ఈ కస్టమ్స్ హైరింగ్ స్కీంకు గాను రైతుల నుంచి వచ్చిన అభిప్రాయం మేరకు ఆధునిక పనిముట్లను కొనుగోలు చేసేందుకు జిల్లా, రాష్ట్రస్థాయిలో కొనుగోలు కమిటీలు ఏర్పాటు చేసి, గ్రామాల్లో రైతులకు సరిపడా పరికరాలు కొనుగోలు చేస్తారు. వచ్చే వానకాలం నాటికి అద్దెను అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంటే రైతులకు వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని అధికారులు నిర్ణయానికి వచ్చారు.

రైతులకు ఎంతో ఉపయుక్తం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ వినూత్న పథకం వల్ల గ్రామాల్లో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ వర్గాలకు చవకగా అద్దెకు అవసరమైన పనిముట్లు అందుబాటులో ఉంటాయి. పనిముట్లు లేక రోజుల తరబడి రైతులు ఎదురుచూస్తున్న తరుణంలో రైతులకు గ్రామాల్లోనే అవసరమైన వస్తువులు మహిళా సంఘాల వద్ద లభించడం వరమే. ఇంకా రైతులు తమ అవసరాలను మహిళా సంఘాల దృష్టికి తెస్తే వాటిని కొనుగోలు చూసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ పథకాన్ని ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన మండలాల్లో అమలు చేస్తాం. వాటి ఫలితాలను బట్టి దశల వారీగా అన్ని గ్రామాలకు విస్తరిస్తాం. దీంతో ఇటు వ్యవసాయ రంగానికి అటు మహిళా సంఘాలకు ప్రయోజనకరంగా ఉంటుంది.
- నూరొద్దీన్, అడిషనల్ డీఆర్డీవో

కార్యాచరణ సిద్ధం
కస్టం హైరింగ్ స్కీం అమలుకు జిల్లాలో కార్యాచరణ సిద్ధమైంది. దేవరుప్పుల మండలంలోని సీతారాంపురం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి, ఈ గ్రామం కూడలిగా పలు గ్రామాలను అనుసంధానం చేశాం. ఇప్పటికే గ్రామంలో మహిళా కూలీలు, సన్న, చిన్నకారు రైతులు, ట్రాక్టర్ ఓనర్లు, జీవాల కాపరులు, ఇతర వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు చెందిన కూలీలను సమావేశ పరిచాం. వారికి అవసరమైన ఆధునిక పనిముట్ల జాబితాను సిద్ధం చేశారు. మరోవైపు గ్రామంలో ఉన్న పనిముట్లు, ఇంకా అవసరమయ్యే వాటి కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేశాం.
- సుజాత, డీపీఎం

61
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles