కొత్తగా ఈడీసీ సిస్టం..!

Tue,March 19, 2019 02:06 AM

-పోస్టల్ బ్యాలెట్‌కు తోడు మరో నూతన విధానం
-ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు వర్తింపు
-డ్యూటీ చేసే పోలింగ్ కేంద్రంలోనే ఓటు వేసే అవకాశం
జయశంకర్ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ : ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ (ఈడీసీ) సిస్టం ద్వారా తాము ఎన్నికల విధులు నిర్వహించే పోలింగ్ కేంద్రంలోనే ఓటు వేసే అవకాశాన్ని ఈసీ కల్పించింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే ఈ నూతన విధానం అమలు కానుంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు పో లింగ్ అధికారులకు శిక్షణ ఇస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులు, ఉద్యోగులు ఇప్పటికే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారు(ఏఆర్‌వో)లకు ఈడీసీ కోసం దరఖాస్తు ఫారాలను అందజేశారు. పోలింగ్ రోజున ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల కోసం ఇన్నాళ్లు పోస్టల్ బ్యాలెట్ విధానం అమల్లో ఉంది. పోలింగ్‌కు ముందే వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేవారు. ఒక దశలో తమ పోస్టల్ బ్యాలెట్ సంబంధిత ఎన్నికల అధికారులకు అందిందా ?, లేదా ? అనే సందేహం వెంటాడేది. మరో అవకాశం లేకపోవడంతో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోస్టల్ బ్యాలెట్‌నే అనుసరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా అనూహ్య నిర్ణయం తీసుకుంది. విధులు నిర్వహించే అధికారులు, ఉద్యోగులు గానీ పోలింగ్ రోజున తాము డ్యూటీ చేసే పోలింగ్ కేంద్రంలోనే నేరుగా ఓటు వేసేలా కొత్తగా ఈడీసీ విధానాన్ని రూపొందించింది. ప్రయోగాత్మకంగా దీనిని ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే అమల్లోకి తేవాలని అధికారులను ఆదేశించింది. ఎన్నికల అధికారులు పోలింగ్ విధులు నిర్వహించే అధికారులు, ఉద్యోగులకు ఈడీసీ విధానంపై కొద్ది రోజుల నుంచి అవగాహన కల్పిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం నియమితులైన 626 మంది ప్రిసైడింగ్ అధికారు(పీవో)లు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారు(ఏపీవో)లకు ఏఆర్‌వో, భూపాలపల్లి ఆర్డీవో వెంకటాచారి ఆదివారం శిక్షణ ఇచ్చారు.

భూపాలపల్లిలోని ఒక ప్రైవేటు కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పీవో లు, ఏపీవోలకు ఈడీసీ విధానాన్ని తెలిపారు. ఉదాహరణకు వ రంగల్ లోక్‌సభ స్థానం పరిధిలో ఓటు కలిగి ఉండి పోలింగ్ రోజున ఇదే లో క్‌సభ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల విధు లు నిర్వహించే అధికారులు, ఉద్యోగులు గానీ ఈడీసీతో తాము ఎలక్షన్ డ్యూటీ చేసే పోలింగ్ కేంద్రంలోనే ఓటు వేయవచ్చని ఆయన స్పష్టం చేశా రు. పొరుగున ఉన్న మహబూబాబాద్, భువనగిరితో పాటు ఇతర లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటు కలిగి ఉన్న అధికారులు, ఉద్యోగులు పోలింగ్ రోజున వరంగల్ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల విధులు నిర్వహించాల్సి వస్తే పోస్టల్ బ్యాలెట్ విధానం వినియోగించుకోవాల్సి ఉంటుందని వెంకటాచారి తెలిపారు. లోక్‌సభ ఎన్నికల విధులు నిర్వహించే పీవోలు, ఏపీవోలతో పాటు ఇతరుల్లో అత్యధిక శాతం మంది వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఓటు కలిగి ఉండడం విశేషం. వీరందరికీ ఈడీసీతో తాము ఎన్నికల విధులు నిర్వహించే పోలింగ్ కేంద్రంలోనే ఓటు వేసే అవకాశం కలిగింది.

56
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles