జన(గా)మంతా గులాబీ వైపే..

Tue,March 19, 2019 02:03 AM

జనగామ, నమస్తే తెలంగాణ, మార్చి 18: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలనే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ పునరావృతం చేసేందుకు జిల్లా ప్రజలంతా గులాబీ పార్టీ వైపే మొగ్గు చూపుతుండడంతో భువనగిరి, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు దాదాపు ఖాయమని తెలుస్తోంది. అయితే, ఈ నియోజకవర్గాల నుంచి భారీ మెజార్టీ సాధించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఐదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దాదాపు ప్రతీ ఇంటికి ఏదోరకంగా చేరాయి. దీంతో గత డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జిల్లాలోని జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల ప్రజలు టీఆర్‌ఎస్ వెంటే నడిచి.. ఎమ్మెల్యేలకు భారీ మెజార్టీని కట్టబెట్టారు. గులాబీ పార్టీ దూకుడుకు తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ కుదేలైంది. అదే పరిస్థితి లోక్‌సభ ఎన్నికల్లోనూ రిపీట్ కాబోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పోటీలో నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు జంకుతున్నారు. ఇక కాంగ్రెస్‌కు నామ్‌కే వాస్తేగా పోటీ మిగలనుంది. భువనగిరి పార్లమెంట్ పరిధిలో జనగామ నియోజకవర్గం, వరంగల్ పార్లమెంట్ పరిధిలో పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ సెగ్మెంట్లు ఉండడంతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సహా ఇద్దరు శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్ తాటికొండ రాజయ్య ఎవరివారే భారీ మెజార్టే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ
డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు భారీ మెజార్టీ వచ్చింది. ఆయా నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో గులాబీ పార్టీకి అత్యధిక ఓట్లు పోలయ్యాయి. జనగామ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి 91,592 ఓట్లు పోలైతే.. కాంగ్రెస్ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్యకు 62,024 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్ 29,568 ఓట్ల మెజార్టీ సాధించింది. అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు 1,17,504 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి జంగా రాఘవరెడ్డికి 64,451 ఓట్లు రాగా, గులాబీ పార్టీ 53,053 ఓట్ల మెజార్టీ సాధించింది. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ రాజయ్యకు 98,612 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి ఇందిరకు 62,822 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్ 35,790 ఓట్ల మెజార్టీతో దూసుకెళ్లింది.

ఆధిక్యమే లక్ష్యంగా..
జిల్లాలో లోక్‌సభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో చరిత్రలో నిలిచిపోయే విధంగా గులాబీ పార్టీ అభ్యర్థులు మెజార్టీ సాధించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి వ్యూహాలు రూపొందిస్తోంది. ఇప్పటికే ఇటు భువనగిరి, అటు వరంగల్‌లో పార్లమెంట్ సన్నాహక సమావేశాల్లో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. మరోపక్క టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదివారం కరీంనగర్‌లో లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించడమే తమ లక్ష్యంగా టీఆర్‌ఎస్ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తుండడంతో జిల్లావ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి నెలకొంది.

ఎన్నికలకు సమాయత్తం..
జిల్లాలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. వరంగల్, భువనగిరి లోక్‌సభ స్థానాలకు సంబంధించి సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అభ్యర్థుల ఖరారుపై ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తుండగా, టికెట్‌పై ధీమాగా ఉన్న వారు నామినేషన్ దాఖలు చేసేందుకు మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగే భువనగిరి, వరంగల్ లోక్‌సభ స్థానాలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ అటు వరంగల్ ఇటు భువనగిరి యాదాద్రి జిల్లాకేంద్రాల్లో మొదలైంది. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న నామినేషన్ల పరిశీలన, 28న ఉపసంహరణ, ఏప్రిల్ 11న పోలింగ్, మే 23న ఓట్ల లెక్కింపు జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌లో ప్రకటించింది. ఆయా లోక్‌సభ నియోజకవర్గ కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ పర్వం మొదలైనా వాటి పరిధిలోని జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల కోడ్ అమలుకు జిల్లాలో ప్రత్యేక బృందాలను కలెక్టర్ ఏర్పాటు చేశారు. ఎంసీసీ, ఫ్లయింగ్ స్కాడ్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్‌లను రంగంలోకి దింపింది. పోలింగ్ నిర్వహణ కోసం ప్రిసైడింగ్ (పీవో), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల(ఏపీవో) నియామకం పూర్తయింది. పోలింగ్ కోసం ఇప్పటికే ఈవీఎంలు, వీవీ ప్యాట్స్‌ను సిద్ధం చేసి ఫస్ట్ లెవల్ చెకింగ్ పూర్తి చేశారు.

57
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles