నామినేషన్ల స్వీకరణకు ఐదు రోజులే..!

Mon,March 18, 2019 01:48 AM

-నేటి నుంచి 25 వరకు స్వీకరణ
-సూచనలకు ప్రత్యేక సెల్ ఏర్పాటు
-లోనికి అభ్యర్థితోపాటు ఐదుగురికి అనుమతి
అర్బన్ కలెక్టరేట్, మార్చి 17: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా సోమవారం నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుంది. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను వరంగల్ అర్బన్ జిల్లా యంత్రాంగం ఇప్పటికే పూర్తి చేసింది. నేడు ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి జారీ చేయనున్నారు. ఈ రోజు నుంచే నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఆదివారం వరంగల్ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ విలేకరులతో మాట్లాడుతూ 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉన్నప్పటికీ 18, 19, 20, 22, 25వ తేదీల్లో మాత్రమే నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ నెల 21న హోలీ, 23వ తేదీన 4వ శనివారం, 24న ఆదివారం కావడంతో ఈ మూడు రోజులు నామినేషన్ల స్వీకరణ ఉండదన్నారు. 26న నామినేషన్ల పరిశీలన, 28న ఉపసంహరణ ఉంటుందని కలెక్టర్ చెప్పారు.

అదేరోజు బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ నిర్వహించి, మే 23న ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ఎన్నికల నామినేషన్లను హన్మకొండ సుబేదారిలోని పాత కలెక్టరేట్‌లో నెలకొల్పిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి చాంబర్‌లో స్వీకరించనున్నట్లు ఆయన వెల్లడించారు. నామినేషన్ల దాఖలుకు వచ్చే అభ్యర్థులు, రాజకీయ పార్టీలకు సూచనలు చేసేందుకు తన చాంబర్ ముందు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నామినేషన్ పత్రాలను ఈ సెల్ నుంచి పొందవచ్చని సూచించారు. నామినేషన్ దాఖలుకు అభ్యర్థితోపాటు ఐదుగురిని మాత్రమే కలెక్టరేట్ లోనికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థితో వచ్చిన మిగతా వారంతా కలెక్టరేట్ గేటు ముందే ఆగిపోవాలన్నారు. అక్కడి నుంచి కేవలం అభ్యర్థితో ఐదుగురు మాత్రమే రిటర్నింగ్ అధికారి చాంబర్‌లోని రావాలని కోరారు. నామినేషన్ దాఖలు చేసే ప్రక్రియనంతా ఫొటో, వీడియో రికార్డు చేయనున్నట్లు ప్రశాంత్ జీవన్ పాటిల్ వెల్లడించారు.

35
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles