పేదల పాలిట సంజీవని..!

Sun,March 17, 2019 01:16 AM

-కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వరంగా డయాలసిస్ సెంటర్
-రూ. రెండు కోట్లతో జిల్లా దవాఖానలో ఏర్పాటు
-ఐదు యూనిట్లతో బాధితులకు కొనసాగుతున్న సేవలు
-53 మందికి 5,476 సార్లు అందిన వైద్యం
-రిజిస్ట్రేషన్ చేసుకున్న మరో 25 మంది..
-పేద ప్రజలకు తప్పిన వ్యయప్రయాసలు..
-ఇప్పటి వరకు రూ. 75.29 లక్షల విలువైన వైద్యం అందజేత
-అదనపు బెడ్ల కోసం ప్రభుత్వానికి నివేదన
-తెలంగాణ సర్కార్‌కు వ్యాధిగ్రస్తుల దీవెన
జనగామ టౌన్, మార్చి 16: కిడ్నీ వ్యాధితో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పేదలకు సర్కార్ వైద్యం సంజీవినిగా మారింది. గతంలో ఉన్నత వర్గాలకే అందుబాటులో ఉండే డయాలసిస్ సేవలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలకు సైతం అందిస్తోంది. హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటిన్ సిటీలకే పరిమితమయ్యే డయాలసిస్ సెంటర్లు నేడు సీఎం కేసీఆర్ చొరవతో జిల్లా కేంద్రాల్లోనూ ఏర్పాటు చేశారు. ఎన్నో వ్యయప్రయాసాలతో కూడుకున్న డయాలసిస్ వైద్యం ఉచితంగా అందుతుండడంతో ఎంతో మంది ప్రాణాలు నిలుస్తున్నాయని పలువురు సర్కార్ సేవలను ప్రశంసిస్తున్నారు.

నిత్యం 18 మందికి వైద్యం..
జనగామ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు సీఎం కేసీఆర్ డయాలసిస్ యూనిట్‌ను మంజూరు చేశారు. నగరాల్లో లక్షల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప అందుబాటులోకి రాని ఖరీదైన డయాలసిస్ వైద్య సేవలు ఇప్పుడు జిల్లాకేంద్రంలోని సర్కార్ దవాఖానలో అందుబాటులోకి వచ్చాయి. ఈ సెంటర్ ప్రారంభమైన నాటి నుంచి నిత్యం 15 నుంచి 18 మందికి వైద్యసేవలు అందుతుండడం విశేషం. డయాలసిస్ సెంటర్‌లో ప్రస్తుతం ఐదు పడకలు ఉన్నాయి. పేద వర్గాలకు చెందిన కిడ్నీ వ్యాధిగ్రస్తులు జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా జనగామలోనే ఖరీదైన వైద్యం అందుతుండడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

డయాలసిస్ సేవలు రెండు రకాలు..
కిడ్నీలు సరిగా పని చేయని వారికి అందించే సేవలను డయాలసిస్ వైద్యం అంటారు. ఇందులో రెండు విధానాలు ఉంటాయి. ఒకటి పెరిటోనియల్. మనం తీసుకునే ఆహారంలో ఏదైన విషపదార్థం కలిగి ఉండడం వల్ల కిడ్నీలు ఫంక్షనింగ్ చేయని సమయంలో పెరిటోనియల్ పద్ధతిలో కడుపులోకి వ్యాక్సిన్లు పంపి క్లీన్ చేస్తారు. మరొక పద్ధతి ఏవీ ఫిస్టుల ద్వారా శరీరంలోని చేరిన చెడు పదార్థాలను తొలగించి అవసరమైన మోతాదులో కాల్షియం, సోడియం, పోటాషియం వంటి పదార్థాలను శరీరంలో నిలకడగా ఉంచి, మిగతా వాటిని రక్తాన్ని శుద్ధి చేసి శరీరం నుంచి తొలగిస్తారు. ఇలాంటి సేవలను ప్రభుత్వం ఒక్కరూపాయి ఖర్చు లేకుండా పేదలకు అందిస్తోంది.

5476 సార్లు చికిత్స..
అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లకా్ష్మరెడ్డి, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి 2017 నవంబర్ 29న జిల్లా ప్రధాన వైద్యశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో డయాలసిస్ సేవలను ప్రారంభించారు. అయితే, అనివార్య కారణాల వల్ల ఈ కేంద్రంలో 2018 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పూర్తిస్థాయి సేవలు అందుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 40 డయాలసిస్ సెంటర్లలో జనగామ ఒకటి. దాదాపు రూ. 2 కోట్ల వ్యయంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీని ఫలితంగా నాటి నుంచి నేటి వరకూ 53 మందికి 5476 సార్లు డయాలసిస్ సేవలు అందించారు. అంటే ఒక్కొక్కరు సుమారు 104 సార్లు డయాలసిస్ కిట్ సేవలు అందుకున్నారు.

హౌస్‌ఫుల్‌తో నడుస్తున్న సెంటర్
ప్రతీ కిడ్నీ వ్యాధిగ్రస్తుడికి వారానికి మూడుసార్లు డయాలసిస్ సేవలు అందిస్తుండడంతో ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై పూర్తిస్థాయి విశ్వాసం కలిగింది. దీనివల్ల డయాలసిస్ సెంటర్‌కు వచ్చే రోగుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఆర్థిక స్తోమత ఉన్న ప్రజలు కూడా హైదరాబాద్‌లోని ప్రైవేట్ దవాఖానల్లో చికిత్సలను వదులుకొని ఇక్కడికే వస్తుండడం గమనార్హం. ఒక్కోసారి చేసే డయాలసిస్‌కు పెద్ద వైద్యశాలల్లో సుమారు రూ. 15 వేల నుంచి 20 వేల వరకు వసూలు చేస్తున్నారని పలువురు అంటున్నారు. ఈ సేవలను తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఉచితంగా అందిస్తుండడం విశేషం. ఈ కేంద్రంలో సాధారణ రోగులకు 4 బెడ్లు కేటాయించగా, మరో మంచం ఎస్‌ఐవీ, ఇతర ప్రాణాంతక వ్యాధులు ఉన్న రోగులకు ఏర్పాటు చేశారు. ఇలా 2018 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నేటి వరకూ నిరాటంకంగా వైద్య సేవలు అందుతున్నాయి. కలెక్టర్ టీ వినయ్‌కృష్ణారెడ్డి జిల్లా ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతోపాటు జిల్లా వైద్యాధికారి ఏ మహేందర్, జిల్లా వైద్యశాల పర్యవేక్షకుడు డాక్టర్ పీ రఘు నిరంతరం పర్యవేక్షిస్తుండడం వల్ల డాయలసిస్ కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడుస్తోంది. రిజిస్టర్ చేసుకున్న ప్రతీ ఒక్కరికి సేవలు అందిస్తున్నట్లు సెంటర్ నిర్వాహకులు అంటున్నారు.

సమాచారం ఇచ్చి వస్తే బాగుంటుంది..
డయాలసిస్ సేవల కోసం ఓపీలు ప్రస్తుతానికి 53 మంది ఆరోగ్యశ్రీ ద్వారా రిజిస్టర్ చేసుకొని 381 రోజుల్లో 5476 సార్లు 75,29,500 రుపాయాల విలువగల వైద్య సేవలను నేటి వరకు పొందారు. అయితే, డయాలసిస్ కేంద్రంలో బెడ్స్ కాళీ లేకపోవడంతో వైద్యులు మరో నాలుగు పరికరాలకు సరిపడా బెడ్స్, వసతులు కల్సించాలని వైద్యులు ఉన్నతాధికారులకు నివేదించారు. ఇప్పటికే మరో 25 మంది డయాలసిస్ సేవలకు రిజిస్టర్ చేసుకున్నవారు ఉన్నారు. వీరు కాకుండా కొత్తవారు ఎవరైనా ఈ వైద్యసేవల కోసం రావాలంటే ముందుగా 08716-223108 నంబర్‌లో సంప్రదించాలని వైద్యులు కోరుతున్నారు. రానున్న రోజుల్లో వైద్య సేవలు మరింత పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు.

ఒక్కొక్కరికి 104 సార్లు వైద్యం
జనగామ డయాలసిస్ సెంటర్‌లో 53 మంది వైద్య సేవలు పొందుతున్నారు. ఒక్కొక్కరు ఇప్పటి వరకు 104 సార్లు డయాలసిస్ కిట్ సేవలు పొందారు. వీరిలో 17 మందికి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రత్యేక బెడ్ ద్వారా సేవలు అందిస్తున్నాం. డిమేడ్ కంపెనీ ద్వారా ఒక్కోసారి చేసిన డయాలసిస్ వైద్య సేవలకు ప్రభుత్వం ఆ కంపెనీకి రూ. 1375 చొప్పున చెల్లిస్తోంది. ఇప్పటి వరకు రూ. 75,29,500 విలువగల సేవలు అందిచాం. డయాలసిస్ సెంటర్ ద్వారా అందిస్తున్న వైద్య సేవలు పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి.
- వీ శ్రీనివాస్, డయాలసిస్ వైద్యుడు

అదనపు బెడ్స్ కోసం నివేదించాం
జిల్లాకేంద్రంల ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రం విజయవంతంగా నడుస్తోంది. అదనంగా నాలుగు మంచాలు కావాల్సి ఉంది. దీనిపై ప్రజాప్రతినిధులు, అధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే బెడ్స్ మంజూరు కానున్నాయి. నూతనంగా డయాలసిస్ సేవల కోసం ఎవరైనా సెంటర్‌కు రావాలనుకుంటే ముందుగా ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలి. లేదా హైదరాబాద్‌లోని గాంధీ వైద్యశాల డయాలసిస్ డాక్టర్ మంజూశ్రీ, హరిప్రసాద్‌తో మాట్లాడి ఆరోగ్యశ్రీ ద్వారా రిజిస్టర్ చేయించుకోవాలి.
-డాక్టర్ పీ రఘు, జిల్లా వైద్యశాల పర్యవేక్షకుడు

ఏడాది నుంచి సేవలు పొందుతున్న..
నేను కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నా. గతంలో హైదరాబాద్‌కు వెళ్లి డయాలసిస్ వైద్యం పొందేవాడిని. తెలంగాణ ప్రభుత్వం జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్లు నాలాంటి పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రభుత్వం అందించే సేవలను నేను ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఏడాది నుంచి పొందుతున్న. దీంతో నాకు చాలా ఖర్చు తప్పింది. గతంలో రూ. 50 నుంచి రూ. 60 వేల వరకు ప్రైవేట్ దవాఖానల్లో ఖర్చు అయింది. మాలాంటి పేదోళ్లు సీఎం కేసీఆర్‌కు రణపడి ఉంటాం.
- ఎండీ బర్కత్ అలీ, మల్లాపూర్, యాదాద్రి జిల్లా

డయాలసిస్ సేవలు బాగున్నాయి
జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న డయాలసిస్ వైద్య సేవలు చాలా బాగున్నాయి. కార్పొరేట్ వైద్యశాలల్లో అందించే వైద్యం కంటే ఇక్కడ ఎక్కువ కేర్ తీసుకుంటూ మందులు అందిస్తున్నారు. ఇటువంటి వైద్య సౌకర్యాలను నేను ఏ రాష్ట్రంలో చూడలేదు. ఎంతో మంది పేదలకు ఈ సేవలు వరంగా మారాయి. పెద్దపెద్ద నగరాలకే పరిమితమయ్యే డయాలసిస్ సేవలు నేడు జిల్లాలకు విస్తరించడంతో చాలామంది పేదలకు ఎంతో ఉపయోగకరంగా మారాయి. కిడ్నీ వ్యాధిగ్రస్తులంతా ఈ సేవలు పొందాలి.
- పురుషోత్తం, ఈరవెన్ను, జనగామ జిల్లా

81
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles