ఇక చేతినిండా పని!

Fri,March 15, 2019 02:56 AM

-ఉపాధి హామీలో మార్పులకు కేంద్రం సన్నద్ధం
-కూలీలకు పని కల్పించేందుకు పకడ్బందీ చర్యలు
-పక్కాగా నీతి అయోగ్ సిఫారసుల అమలు
-చేసిన పనులకు జియో ట్యాగింగ్
-జాబ్‌కార్డు ఉంటే పని చూపాల్సిందే..
-లేదంటే ఉద్యోగుల జీతాల్లో కోత
-పని చేయని వారి పేర్లు తొలగింపు
జనగామ, నమస్తే తెలంగాణ, మార్చి 14: ఇక గ్రామాల్లో ప్రతీ కూలీకి చేతినిండా పని దొరకనుంది. ఈ మేరకు జాతీయ ఉపాధిహామీ పథకంలో మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇక నుంచి ఈ కార్యక్రమానన్ని గ్రామాల్లో పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. 2005 నుంచి ఒకే రకమైన పనులు చేపడుతున్న ఈ పథకాన్ని మరింత విస్తరించే దిశగా కేంద్రం కార్యాచరణ సిద్ధం చేస్తున్నది. నీతి అయోగ్ సిఫారసులు అమలు చేయడం ద్వారా వ్యవసాయ రంగానికి ఊతం ఇవ్వాలని, సాధ్యమైనంత ఎక్కువగా సాగుకు సంబంధించిన పనులను చేపట్టాలని నిర్ణయించారు. వలసలను నివారించేందుకు జాబ్‌క్డారులు ఉన్న ప్రతి ఒక్కరికీ రోజూ చేతినిండా పని కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం 80 శాతం మందికి పనులు కల్పించకుంటే ఉపాధిహామీ సిబ్బంది వేతనాల్లో ఎనిమిది శాతం కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఉపాధి కల్పించడమే పథకం ఉద్దేశం..
గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా కూలీలకు మెరుగైన ఉపాధి కల్పించడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు, రైతులకు ప్రయోజనకరమైన పనులు చేపట్టేందుకు ఏటా కోట్లాది రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఉపాధిహామీ పథకం చట్టం ప్రకారం నమోదైన కూలీలకు లక్ష్యం మేరకు వందశాతం పని దినాలు కల్పించాలి. ఈ అంశం క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. వంద రోజులు పని కూడా కొన్ని కుటుంబాలే పూర్తి చేసుకుంటున్నాయి. దీంతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. దీంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని పథకంలో అక్రమాలు, అవకతవకలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామీణాభివృద్ధిశాఖ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో 2017-18 సంవత్సరంలో లక్ష్యాలను ఖరారు చేసిన డీఆర్‌డీవో అధికారులు పని దినాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు.

80 శాతం పనులు కల్పించాలి..
చట్ట ప్రకారం నిర్దేశిత లక్ష్యం మేరకు కూలీలకు పనులు కల్పించకుంటే సంబంధిత టెక్నికల్ అసిస్టెంట్(టీఏ), అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి(ఏపీవో)ను బాధ్యులను చేయాలని నిర్ణయించారు. కూలీలకు 80 శాతం మేరకైనా పనులు కల్పించని టీఏ, ఏపీవోల జీతం నుంచి ఎనిమిది శాతం కోత విధించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అన్ని మండలాల ఉపాధి హామీ పథకం ఏపీవోలకు ఆదేశాలు అందాయి. జిల్లాలో ఇక నుంచి ఉపాధి హామీ పథకం అమలులో ఉన్న అన్ని ప్రాంతాల్లో టీఏ, ఏపీవోలు తమ క్లస్టర్ల పంచాయతీలో శ్రమశక్తి సంఘాల నుంచి వారంపాటు పనుల కల్పనకు సంబంధించిన వివరాలను తీసుకురావాలి. అందుకు అనుగుణంగా అన్ని క్లస్టర్ల పంచాయతీల్లో కనీసం 80 శాతం సంఘాల్లోని కూలీలకు విధిగా పని కల్పించాలి. 80 శాతం పనులు కల్పించాలన్న ఉత్తర్వుల ప్రకారం గ్రామాల్లోని ఉపాధి కూలీలకు పనులు దొరుకుతాయి. మేట్లు క్రియాశీలకంగా వ్యవహరించకపోవడంతో చాలామందికి ఉపాధి పనులు లభించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

జియో ట్యాగింగ్ విధానం..
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. పనులు పారదర్శంగా, పక్కా జరిగేందుకు జియోట్యాగింగ్ విధానంలో భువన్ యాప్ ద్వారా వెబ్‌సైట్‌లో ఫొటోలు, వివరాలను పొందుపరుస్తారు. గ్రామాలు, మండలాల వారీగా జాబితాలను తయారు చేసి ఉపాధిహామీ సీఏ సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేస్తారు. రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వారీగా ఎంపిక చేసుకొని పనులకు సంబంధించిన ఫొటోలో యాప్‌లోకి అప్‌లోడ్ చేస్తారు. దీని ద్వారా ఏ ప్రాంతంలో ఎవరు ఎలాంటి పనులు చేస్తున్నారో తెలుసుకునే వీలుంటుంది. దీంతోపాటు గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ ఆదేశాలతో అధికారులు ఉపాధి పనులను డుమ్మాలు కొట్టే వారి కార్డులను ఏరివేసే పనిలో కూడా అధికారులు నిమగ్నమయ్యారు. పథకం మార్గదర్శకాల ప్రకారం నిరుపేదలైన ఉండి కూలీ పనులకు వెళ్లే వారికి ఉపాధి కార్డులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, పలుచోట్ల అనర్హులు, బడా రైతులు, ఒక్కసారి కూడా పనికి వెళ్లని వారి వద్ద కార్డులు ఉన్నట్లు పలు సందర్భాల్లో జరిపిన సర్వేలో తేలింది. వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, నీటి కుంటల నిర్మాణం, పండ్ల తోటల పెంపకాన్ని జాబ్‌కార్డు ఉన్నవారికి వర్తింపజేస్తుండడంతో ఆయా ప్రయోజనాలు పొందేందుకు అనర్హులు, కూలి పనికి వెళ్లని వారు సైతం కార్డులు పొందారని లెక్కతేలింది. జిల్లావ్యాప్తంగా 301 గ్రామపంచాయతీల్లో 19,785 ఉపాధిహామీ గ్రూపులు ఉండగా, మొత్తం 3,56,146 మంది కూలీలు పనిచేస్తున్నారు. వీరంతా 2016-17 సంవత్సరానికి రూ. 41,30,27,692 విలువైన పనులు చేశారు. 2006 నుంచి ఇప్పటి వరకు ఈజీఎస్ ద్వారా బచ్చన్నపేట మండలంలో 3716, పాలకుర్తిలో 4481, జనగామలో 4037, నర్మెటలో 3075, లింగాలఘనపురంలో 5066, దేవరుప్పులలో 4164, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 3968, కొడకండ్లలో 4179, జఫర్‌ఘడ్‌లో 4133, రఘునాథపల్లిలో 4114 పనులు పూర్తి చేశారు. గ్రామాల్లో కుటుంబాలు ఏళ్ల తరబడి బతుకుదెరువు కోసం వలసలు వెళ్లినప్పటికీ వారి పేర్లమీదనే ఇంకా కార్డులు కొనసాగుతున్నాయి. పెళ్లయి అత్తాగారింటికి వెళ్లిన మహిళలు, చనిపోయిన వారి పేరిట కార్డులు అలాగే ఉన్నాయి. దీంతో ఉపాధి హామీ పథకం దుర్వినియోగానికి అవకాశం ఉండడంతో కార్డులు పొందిన వారిలో పనులను దూరంగా ఉండే వారిని గుర్తించేందుకు గ్రామాల వారీగా సర్వే చేసి ఎవరెవరు పనిచేస్తున్నారు? నెలలో ఎన్ని రోజులు, ఏడాదిలో ఎన్ని రోజులు పనికి వస్తున్నారు? కార్డులు పొంది నెలలు, ఏళ్లతరబడి రాకుండా ఉన్నవారు ఎవరనేది లెక్కలు తీస్తున్నారు.

మహిళల ముందంజ..
కుటుంబ బాధ్యతలు, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులు రెండింట్లోనూ మహిళామణులు సత్తా చాటుతున్నారు. ఉదయాన్నే లేచి ఇంటి పనులు చేసుకొని, పార చేతపట్టుకొని ఉపాధి బాట పడుతున్నారు. ముఖ్యంగా రైతులకు ఉపయోగపడే పనులపై వారు ఆసక్తి చూపిస్తున్నారు. మహిళలు వస్తేనే తమ పొలాలు బాగుపడుతాయని, వారితోనే పనులు చేయించుకునేందుకు రైతులు ప్రాధాన్యం ఇస్తున్నారు. జనగామ జిల్లాలో వందరోజుల పని దినాలు పూర్తి చేసుకోవడంలో వారే ముందున్నారు.

61
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles