జనగామ రైల్వేస్టేషన్‌కు మహర్దశ


Fri,February 22, 2019 01:49 AM

- త్వరలో మరిన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్
- ప్లాట్‌ఫాంలపై కోచ్ డిస్‌ప్లే ఏర్పాటు
- స్టేషన్‌కు ఫుట్‌ఓవర్ బ్రిడ్జి మంజూరు
- భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్
- జనగామలో శాతవాహన సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు హాల్టింగ్
- కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
జనగామ, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 21: రెండు జాతీయ రహదారులు కలిగి.. రైల్వేకు ప్రధాన మార్గమైన జనగామ రైల్వేస్టేషన్‌కు రానున్న రోజుల్లో మహర్దశ పట్టనుందని భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన శాతవాహన సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు హాల్టింగ్‌ను గురువారం ఉదయం జనగామ రైల్వేస్టేషన్‌లో సౌత్ సెంట్రల్ రైల్వే ఏడీఆర్‌ఎం సుబ్రమణ్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి ఎంపీ ప్రారంభించారు. అనంతరం నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ రోడ్డు, రైలు మార్గం, వస్తు ఎగుమతి, దిగుమతికి అనుకూలంగా ఉన్న జనగామ జిల్లాకేంద్రం రోజురోజుకు అభివృద్ధి చెందుతోందన్నారు. వీవర్స్‌కాలనీ ప్రాంత ప్రజలు కోరుకున్న రీతిలో అండర్ పాస్ నిర్మాణం జరుగుతుందని, ఫుట్‌ఓవర్ బ్రిడ్జి కూడా మంజూరైందన్నారు. శాతవాహన రైలు హాల్టింగ్‌తో మొదలైన సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్టింగ్, స్టేషన్‌లో వసతులు వంటివి భవిష్యత్‌లో మెరుగుపడతాయని వివరించారు. తనకు జనగామ ప్రాంతంపై ప్రత్యేక అభిమానం ఉందన్నారు. ఇక్కడి రైల్వేస్టేషన్‌లో నెలకొన్న సమస్యలు, ప్రయాణికులకు అవసరమైన అంశాలపై ఎప్పటికప్పుడు రైల్వేశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి.. అసాధ్యమనుకున్న పనులను సుసాధ్యం చేసుకుంటున్నామని చెప్పారు. హైదరాబాద్‌కు వెళ్లి పనులు ముగించుకుని వచ్చే సమయంలో అటు వ్యాపారులు, డైలీ కమ్యూటర్స్, ఉద్యోగులకు సమయం వృథా కాకుండా శాతవాహన రైలు ఎంతో ఉపయోగకంగా ఉంటుందన్నారు. జనగామ నుంచి కేవలం 1.10 గంటల వ్యవధిలోనే సికింద్రాబాద్‌కు చేరుకునే శాతవాహన సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు విజయవాడ, వరంగల్, కాజీపేట మీదుగా జనగామ స్టేషన్‌కు రోజూ ఉదయం 10.25 గంటలకు వస్తుందని వివరించారు. తిరిగి సికింద్రాబాద్ నుంచి బయల్దేరి సాయంత్రం 5.25 గంటలకు జనగామ చేరుకుంటుందన్నారు. జనగామ ప్రయాణికులకు లభించిన ఈ అవకాశాన్ని వినియోగించుకుని రైల్వే శాఖకు ఆదాయం పెంచేలా చూడాలన్నారు.


19కి చేరిన రైళ్ల హాల్టింగ్..
ప్రస్తుతం జనగామ రైల్వేస్టేషన్‌లో 18 రైళ్లు ఆగుతుండగా, శాతవాహనతో 19కి చేరిందని ఎంపీ అన్నారు. రూ. 40 లక్షలతో రెండు ప్లాట్‌ఫాంలపై త్వరలో కోచ్ డిస్‌ప్లే ఏర్పాటు చేస్తారని ఎంపీ ప్రకటించారు. జనగామ రైల్వేస్టేషన్‌ను పూర్తిస్థాయిలో ట్రాన్స్‌ఫోర్టు హబ్‌గా మార్చాలనే నిర్ణయాన్ని రైల్వేశాఖ తీసుకుందని, పెంబర్తి రైల్వేస్టేషన్‌లో కూడా ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ. 1.02 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. అదేవిధంగా జనగామ స్టేషన్ పరిధిలో రెండో ప్లాట్‌ఫాం కోసం రూ. 4 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని వివరించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ. 1.50 కోట్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వంగపల్లి స్టేషన్‌లో హైలెవల్ ప్లాట్‌ఫాం నిర్మాణం కోసం రూ. 1.20 కోట్లు, యాదాద్రి-రాయగిరి స్టేషన్‌లో ఫుట్‌ఓవర్ బ్రిడ్జి కోసం రూ. 2.50 కోట్లు మంజూరు చేయించానని ఎంపీ నర్సయ్యగౌడ్ వెల్లడించారు.

రైల్వేస్టేషన్లలో నకాశి పెయింటింగ్
ప్రస్తుతం ఆధునీకరిస్తున్న రైల్వేస్టేషన్లలో జనగామ ప్రాంతానికి తలమానికమైన చేర్యాల నకాశి పెయింటింగ్‌తో బొమ్మలు వేస్తున్నారని, తాను రైల్వే ఉన్నతాధికారులకు చేసిన విజ్ఞప్తి మేరకు దేశవ్యాప్తంగా అన్ని స్టేషన్లలో చేర్యాల నకాశి పెయింటింగ్‌తో బొమ్మలు వేయబోతున్నారని ఎంపీ తెలిపారు. ప్రస్తుత రైల్వేబోర్డు చైర్మన్ వినోద్‌కుమార్ యాదవ్ సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంగా తన పరిధికి మించి సహకారం అందించడం వల్లే జనగామకు రైల్వే అండర్ పాస్ మంజూరైందని ఎంపీ గుర్తుచేశారు. ఒకప్పుడు బూత్ బంగ్లాలుగా కనిపించే రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు. రానున్న ఐదేళ్లలో కచ్చితంగా కేంద్రంలో కేసీఆర్ నాయకత్వం కీలకం కాబోతుందని, అప్పుడు కేంద్ర పరిధిలో ఉండే తెలంగాణలోని అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

60 ఏళ్ల చరిత్రలో అభివృద్ధి..
60 ఏళ్ల చరిత్రలో అభివృద్ధి చెందని జనగామ, సూర్యాపేట, వరంగల్, భువనగిరి జాతీయ రహదారులకు మహర్దశ, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పెంబర్తి-పోచన్నపేట, కొలన్‌పాక-బచ్చన్నపేట రోడ్ల అభివృద్ధి, పెంబర్తి హస్తకళలకు స్ఫూర్తి పథకం కింద కళాకారులకు శిక్షణ, పర్యాటక అభివృద్ధి, జనగామ ఏరియా వైద్యశాలలో డయాలసిస్ యూనిట్, మాతాశిశు దవాఖాన వంటి అనేక అనేక కార్యక్రమాలను గడిచిన ఐదేళ్లలో చేపట్టామని గుర్తుచేశారు. వీటిపై త్వరలో ఒక బుక్‌లెట్ విడుదల చేస్తామని వెల్లడించారు. మొన్నటి ఎన్నికల్లో జనగామ నుంచి యాదగిరిరెడ్డి అద్భుత మెజార్టీ సాధించారని, అదేరీతిలో తనను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 66 ఏళ్లలో తెలంగాణలో కేవలం 2600 కిలో మీటర్ల రహదారులు అభివృద్ధి చేస్తే.. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో ఎంపీలుగా తాము రూ. 3600 కోట్లతో 524 కిలో మీటర్ల జాతీయ రహదారులను సాధించామని స్పష్టం చేశారు.

ఎగుమతి సౌకర్యం కల్పించాలి: ముత్తిరెడ్డి
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరువు ప్రాంతమైన జనగామ జిల్లాలోని చెరువులు, కుంటలు గోదావరి జలాలతో నిండాయని, ఫలితంగా భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. గోదావరి జలాల వల్ల రైతులు ఏడాదికి మూడు పంటలు సాగు చేస్తూ గతంలో కంటే రెట్టింపు స్థాయిలో కందులు, ధాన్యం, మక్కలు, పత్తి, అపరాలు పండిస్తున్న దృష్ట్యా జనగామ రైల్వేస్టేషన్‌లో ఎగుమతి, దిగుమతి సౌకర్యాన్ని మెరుగుపర్చాలని కోరారు. ఇటీవల తాను కోరిన వెంటనే జనగామలో శాతవాహనకు హాల్టింగ్ సౌకర్యం కల్పించిన ఎంపీ, రైల్వేశాఖ అధికారులకు జిల్లా ప్రజల పక్షాన ముత్తిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ కృషితో రానున్న రోజుల్లో షిర్డీ, దానాపూర్, చార్మినార్ వంటి మరిన్ని రైళ్లకు హాల్టింగ్ ఇచ్చేలా కృషి చేస్తానన్నారు. జనగామలో ప్రత్యేక రైల్వే పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎంపీ, రైల్వే ఏడీఆర్‌ఎంను ఆయన కోరారు.

వ్యాపారులకు ధన్యవాదాలు
రైల్వేస్టేషన్ జంక్షన్ విస్తరణకు సహకారం అందిస్తున్న వ్యాపారులకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. జిల్లా ఆవిర్భావం తర్వాత కొంత ఆలస్యమైనా జనగామ పట్టణ సుందరీకరణ మొదలైందని, బస్టాండ్ చౌరస్తా నుంచి నెహ్రూపార్కు, నెహ్రూపార్కు నుంచి రైల్వేస్టేషన్ వరకు, రైల్వేస్టేషన్ జంక్షన్ విస్తరణ పనులకు సహకరిస్తున్న వ్యాపారులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. అదేవిధంగా రోడ్ల విస్తరణలో మాస్టర్‌ప్లాన్ కంటే ఎక్కువ స్థలాలు కోల్పోయిన వ్యాపారులకు పరిహారం చెల్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి బూర నర్సయ్యగౌడ్‌ను అధిక మెజార్టీతో ఎంపీగా తెలిపించాలని ప్రజలను కోరారు. ఏడీఆర్‌ఎం సుబ్రమణ్యం మాట్లాడుతూ జనగామ స్టేషన్‌లో శాతవాహనకు హాల్టింగ్ ఇవ్వడం సంతోషకరమన్నారు. కోచ్‌డిస్‌ప్లే, ఫుట్‌ఓవర్ బ్రిడ్జి వంటి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, కొమురవెల్లి దేవస్థానం చైర్మన్ సేవెల్లి సంపత్, రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్ ఇర్రి రమణారెడ్డి, మార్కెట్ మాజీ చైర్‌పర్సన్ బండ పద్మ, వార్డు కౌన్సిలర్లు కొన్యాల జనార్దన్‌రెడ్డి, ఎండీ ఎజాజ్, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు బండ యా దగిరిరెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పోక ల లింగయ్య, పజ్జూరి గోపయ్య, నాయకులు పసు ల ఎబెల్, డాక్టర్ సుధా సుగుణాకర్‌రాజు, రావెల రవి, చెంచారపు పల్లవి సోమిరెడ్డి, పంతులు ప్రభాకర్‌రావు, కందుకూరి ప్రభాకర్, వంగ ప్రణీత్‌రెడ్డి, చింతల మల్లికార్జున్, గుర్రం నాగరాజు, ఉల్లెంగుల కృష్ణ, జిట్టె శ్రీశైలం, సురేందర్‌రెడ్డి, దామెర రాజు, గంగాభవాని, అనిల్, ప్రమోద్‌రెడ్డి, చిన్నం నర్సింహులు పాల్గొన్నారు. కాగా, రైల్వే కమ్యూటర్స్ ప్రతినిధి రాజేశ్వర్, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు హరిశ్చంద్రగుప్తా స్థానిక రైల్వే సమస్యలను ఏడీఆర్‌ఎం దృష్టికి తీసుకెళ్లారు.

152

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles