గులాబీ జోరు..


Tue,January 22, 2019 02:15 AM

-90.38 శాతం పోలింగ్
-మొదటి విడత ప్రశాంతం
-జనగామలో అత్యధికం
-బచ్చన్నపేటలో అత్యల్పం
-ఓటుహక్కు వినియోగించున్న ఎమ్మెల్సీ బోడకుంటి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
-వెబ్ ద్వారా ఎన్నికల సరళిని పరిశీలించిన కలెక్టర్ వినయ్
జనగామ జిల్లా ప్రతినిధి/ జనగామ, నమస్తే తెలంగాణ: తొలివిడత పంచాయతీ పోరు సోమవారం ప్రశాంతంగా ముగిసింది. జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల, లింగాలఘణపురం మండలాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 90.38 శాతం పోలింగ్ నమోదైంది. ఐదు మండలాల్లోని 100 జీపీలు, 906 వార్డులకు 18 జీపీలు, 266 వార్డులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. మిగతా 82 జీపీలు, 639 వార్డులకు(బచ్చన్నపేట మండలం ఇటికాలపల్లి 4వ వార్డుకు ఎన్నికలేదు) సోమవారం ఎన్నికలు జరిగాయి. ఈ ఐదు మండలాలకు 688 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2029 మంది సిబ్బందిని వినియోగించారు. మొదట్లో మందకొడిగా పోలింగ్ సాగినా.. 11 గంటలకల్లా పుంజుకుంది. ఉదయం నుంచే మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. బచ్చన్నపేట మండలంలోని 3వ వార్డులో ఐదుగురి అభ్యర్థులకు ఆరు గుర్తులు రావడంతో ఎన్నికను తాత్కాలికంగా వాయిదా వేశారు.


మధ్యాహ్నం ఒంటిగంటకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. తొలివిడత ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. డీసీపీ శ్రీనివాస్ పర్యవేక్షణలో 750 మంది పోలీస్ సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు సురేంద్రమోహన్ కలిసి డీసీపీ పెంబర్తిలోని పోలింగ్ పరిశీలించారు. కలెక్టర్ వినయ్ కలెక్టరేట్ ఏర్పాటు చేసిన వెబ్ ద్వారా ఐదు మండలాల్లోని పోలింగ్ సరళిని పరిశీలించారు. బచ్చన్నపేట మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. మొదటి విడత ఎన్నికల సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. బచ్చన్నపేటలో ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు. జనగామ మండంలోని ఎల్లంల పోలింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పద్మా దంపతులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో టీఆర్ మద్దతుదారులు తమ హవా కొనసాగించారు.

జనగామలో అత్యధికంగా పోలింగ్
జనగామ మండలంలో అత్యధికంగా 92.38, బచ్చన్నపేటలో అత్యల్పంగా 88.25 శాతం పోలింగ్ నమోదైంది. లింగాలఘనపురంలో 91.91, నర్మెటలో 90.10, తరిగొప్పులలో 89.26 శాతం ఓటింగ్ జరిగింది. ఐదు మండలాలకు సంబంధించి మొత్తం 1,15,115 మంది ఓటర్లు ఉండగా, 57,519 మహిళలు, 57,596 పురుషులు ఉన్నారు. ఇందులో 1,04,189 ఓట్లు పోలయ్యాయి. మహిళల ఓట్లు 51,632, పురుషుల ఓట్లు 52,557 ఉన్నాయి. మధ్యాహ్నం ఒంటిగంటకు పోలింగ్ ప్రక్రియ ముగించిన అధికారులు.. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు. మొదట వార్డు సభ్యులు, తర్వాత సర్పంచ్ ఓట్లు లెక్కించేలా చర్యలు చేపట్టారు.

టీఆర్ మద్దతుదారుల హవా
జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ గ్రామాల్లో టీఆర్ మద్దతుదారులు విజయఢంకా మోగించారు. అసెంబ్లీ ఎన్నికల విజయంతో గులాబీ జెండా నీడలో సర్పంచ్ పదవులు, వార్డు స్థానాలకు పోటీ చేసేందుకు గ్రామాల్లో అభ్యర్థులు పోటీ పడ్డారు. పార్టీల రహితంగా జరిగిన పల్లెపోరులో నిలిచిన అభ్యర్థులంతా అధికార పార్టీ అండ ఉందని ప్రచారం చేసుకోవడంతో గ్రామీణ ప్రజలు మరోసారి సంక్షేమ సర్కార్ జైకొట్టారు. మొత్తం ఐదు మండలాల్లోని 100 గ్రామాలు, 906 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, ఇందులో 18 పంచాయతీలు, 266 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. సోమవారం పోలింగ్ జరిగిన 82 పంచాయతీల్లో 39 మంది టీఆర్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో మొత్తంగా 57 మంది గులాబీ మద్దతుదారులు సర్పంచ్ ఎన్నికయ్యారు.

మండలాల వారీగా
పోలైన ఓట్లు, శాతం
జనగామ (ఓటర్లు 29,459)
మహిళా ఓటర్లు : 14,672
పురుషులు : 14,787
పోలైన ఓట్లు : 27,214
మహిళలు : 13,522
పురుషులు : 13,692
పోలింగ్ శాతం : 92.38
బచ్చన్నపేట (ఓటర్లు 31,333)
మహిళా ఓటర్లు : 15,764
పురుషులు : 15,569
పోలైన ఓట్లు : 27,651
మహిళలు : 13,714
పురుషులు : 13,910
పోలింగ్ శాతం : 88.25
నర్మెట (ఓటర్లు 16,108)
మహిళా ఓటర్లు : 8104
పురుషులు : 8004
పోలైన ఓట్లు : 14,514
మహిళలు : 7162
పురుషులు : 7,352
పోలింగ్ శాతం : 90.10
తరిగొప్పుల (ఓటర్లు 11,858)
మహిళా ఓటర్లు : 5,915
పురుషులు : 5,943
పోలైన ఓట్లు : 10,584
మహిళలు : 5,265
పురుషులు : 5,319
పోలింగ్ శాతం : 89.26
లింగాలఘనపురం (26,357)
మహిళలు : 13064
పురుషులు : 13293
పోలైన ఓట్లు : 24,226
మహిళల ఓట్లు : 11942
పురుషుల ఓట్లు : 12284
పోలింగ్ శాతం : 91.91

188

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles