నేడు తొలి సమరం

Mon,January 21, 2019 01:30 AM

- పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం
- మొదటి విడతకు 82 జీపీలు, 641 వార్డులు
- మొత్తం 1,25,106 మంది ఓటర్లు
- ఎన్నికల సామగ్రితో కేంద్రాలకు చేరిన సిబ్బంది
- భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు
- సాయంత్రంలోగా తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

జనగామ, నమస్తే తెలంగాణ, జనవరి 20: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల, లింగాలఘనపురం మండలాల్లోని 688 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కించి సాయంత్రంలోగా ఫలితాలు వెలువరించనున్నారు.

5 మండలాలు.. 11 జోన్లు
తొలి విడత ఓటు వేయనున్న 1,25,106 మంది కోసం 854 బ్యాలెట్ బాక్సులు, 1,37,610 బ్యాలెట్ పేపర్లు వినియోగిస్తున్నారు. ఐదు మండలాలను 11 జోన్లుగా, 39 రూట్లుగా విభజించి ఆయా మండలకేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల పంపిణీ కేంద్రాల్లో ఆదివారం పోలింగ్ సిబ్బందికి ఆర్వోల ద్వారా బ్యాలెట్ బాక్స్‌లు, నామినల్ రోల్స్, పేపర్ సీల్, బ్యాలెట్ పేపర్లు వంటి పోలింగ్ సామగ్రిని అందజేశారు. అనంతరం పోలీసు బందోబస్తు నడుమ వాహనాల ద్వారా సామగ్రి సహా సిబ్బందిని ఆయా గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలకు చేర్చారు. తొలి విడత 100 పంచాయతీలు, 906 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, 18 పంచాయతీలు, 264 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిలిగిన ఎన్నికలు జరిగే 82 పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు 285 మంది, 641 వార్డు స్థానాల్లో(బచ్చన్నపేట మండలం ఇటికాలపల్లి 4వ వార్డుకు నామినేషన్ దాఖలు కాలేదు) 1574 మంది పోటీ పడుతున్నారు. పోలింగ్ నిర్వహణ కోసం మొత్తం 2029 మంది సిబ్బందిని నియమించగా, వారిలో 906 మంది పోలింగ్ అధికారులు, 1123 మంది అసిస్టెంట్ పోలింగ్ అధికారులు ఉన్నారు. ఐదు మండలాల్లో జరిగే పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు 25 మంది సెంట్రల్ టీం మైక్రో అబ్జర్వర్లు, రూట్ ఆఫీసర్లు, స్టేజ్-2 అధికారులను నియమించారు.

విధుల్లో 750 మంది పోలీసులు
జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే గ్రామాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ సజావుగా, శాంతియుతంగా జరిగేలా ఏర్పాట్లు జరిగాయి. డీసీపీ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఐదు మండలాల్లో ఐదుగురు ఏసీపీలు, ఐదుగురు సీఐలు, 10 మంది ఎస్సైలు, 10 మంది ఏఎస్సైలు ఆయా గ్రామాల్లో గుర్తించిన 45 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో 750 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఒక్కో మండలానికి ఏసీపీ, సీఐ సహా ఇద్దరు ఎస్సై, ఏఎస్సైలు, కానిస్టేబుళ్లు ఆయా గ్రామాల్లో బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. వీరితోపాటు ఒక్కో బైక్‌పై ఇద్దరు చొప్పున ఐదు రూట్ మొబైల్ టీంలను నియమించి, ఏదైనా సమస్య తలెత్తితే నిమిషాల్లో చేరుకునే క్విక్ యాక్షన్ సిబ్బందిని నియమించారు. పెట్రోకార్లు, ఇంటర్‌సెప్టర్ వాహనాల ద్వారా పోలింగ్, కౌంటింగ్ వీరితోపాటు 20 గ్రామాలకు సరిపడా అదనపు రిజర్వు ఫోర్స్ అందుబాటులో ఉంచారు. అంతేగాకుండా 12 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా ఆయా కేంద్రాల లోపల పోలింగ్ సరళి, కౌంటింగ్ ప్రక్రియను జిల్లా అధికారులు ప్రత్యక్షంగా వీక్షించనుండగా, సిగ్నలింగ్ సమస్య ఉన్న 45 పోలింగ్ కేంద్రాల్లోనూ పోలింగ్ ప్రక్రియ వీడియో చిత్రీకరణ చేస్తున్నారు.

సామగ్రి పంపిణీని పరిశీలించిన కలెక్టర్
జిల్లాకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జనగామ మండలంలోని 190 పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది కేటాయింపు, సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆదివారం కలెక్టర్ టీ వినయ్‌కృషారెడ్డి పరిశీలించారు.

మండలంలో 22 పంచాయతీలకు ఏకగ్రీవమైన చీటకోడూరు, వెంకిర్యాల మినహా మిగిలిన 20 జీపీల్లో సర్పంచ్‌కు 69 మంది, 171 వార్డు స్థానాలకు 415 మంది పోటీ పడుతుండగా, మండలంలో మొత్తం 29,417 మంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. మండలంలో ఏడు సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించి, ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శామీర్‌పేట, పెద్దపహాడ్‌లో వెబ్‌కాస్టింగ్, పెంబర్తి, వడ్లకొండ, పెద్దతండ(వై), ఎర్రగొల్లపహాడ్‌లో వీడియో చిత్రీకరణ చేస్తున్నారు. మండలాన్ని రెండు జోనల్ సర్కిల్‌గా, ఒక రిజర్వు, ఆరు టీంల రూట్ ఆఫీసర్లు, ఒక రిజర్వు టీం, 24 మంది స్టేజ్-2 రిటర్నింగ్ అధికారలు, మొత్తం 396 మంది పీవో, ఏపీవోలను ఎన్నికల నిర్వహణకు వినియోగ్తిసున్నారు.

99
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles