ముగిసిన తొలివిడత ప్రచార పర్వం


Sun,January 20, 2019 01:41 AM

-రేపటి పోలింగ్ సర్వం సిద్ధం
-82 జీపీలు, 639 వార్డులకు ఎన్నికలు
-సర్పంచ్ 285, వార్డులకు 1574 మంది పోటీ
-నేడు సిబ్బందికి సామగ్రి పంపిణీ
-పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు
-మూడో విడతకు ముగిసిన స్క్రూటినీ
జనగామ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత ప్రచార పర్వం శనివారం ముగిసింది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం సోమవారం జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల, లింగాలఘనపురం మండలాలకు ఏకగ్రీవం మినహాయించి ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే పంచాయతీల వారీగా ఎన్నికల నిర్వహణకు సిబ్బందిని నియమించింది. తొలి విడత ఎన్నికల్లో 82 మంది రిటర్నింగ్, 906 ప్రిసైడింగ్ అధికారులు, 1123 మంది సిబ్బందికి విధులు అప్పగించారు. వీరితోపాటు జోనల్, జిల్లా స్థాయి అధికారులు ఎన్నికలను పర్యవేక్షిస్తారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి ఎన్నికల అధికారులు సిబ్బందికి సామగ్రిని పంపిణీ చేస్తారు. అనంతరం సిబ్బంది వారికి కేటాయించిన గ్రామాల్లోకి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి అక్కడి ఎన్నికల అధికారికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తొలి విడత ఎన్నికలు జరుగుతున్న మండలాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు చర్యలు చేపట్టింది. శనివారం ప్రచారం ముగిసిన నేపథ్యంలో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయా మండలాల పరిధిలోని వైన్ మూసివేయించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఆయా కేంద్రాల్లో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు.


తొలిపోరు రేపే..
జిల్లాలోని 301 గ్రామ పంచాయతీలు, 2746 వార్డు సభ్యులకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం మొదటి విడతతో జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల, లింగాలఘనపురం, రెండో విడతతో దేవరుప్పుల, కొడకొండ్ల, రఘునాథపల్లి, గుండాల, మూడో విడతలో స్టేషన్ చిలుపూరు, జఫర్ పాలకుర్తి మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టింది. తొలి విడత ఐదు మండలాల్లోని 100 గ్రామ పంచాయతీలు, 906 వార్డులకు సోమవారం ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, 18 జీపీలు, 266 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. అలాగే, బచ్చన్నపేట మండలంలోని ఇటిక్యాలపల్లి పంచాయతీ పరిధిలోని 4వ వార్డుకు నామినేషన్లు దాఖలు కానందున ఇక్కడ ఎన్నిక లేదు. మిగిలిన 82 పంచాయతీలు, 639 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.

అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ..
ఆయా స్థానాలకు అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సర్పంచ్ స్థానాల కోసం 285 మంది, వార్డు స్థానాలకు 1574 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. సోమవారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి సాయంత్రానికి తుది ఫలితాలు వెల్లడిస్తారు. దీనికి సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అదేవిధంగా ఈ నెల 25న రెండో విడత దేవరుప్పుల, కొడకొండ్ల, రఘునాథపల్లి, గుండాల మండలాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 109 జీపీలు, 966 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, 27 సర్పంచ్, 317 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 82 జీపీలు, 649 వార్డుల ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక్కడ కూడా పోటీ తీవ్రంగానే ఉంది. సర్పంచ్ స్థానాలకు 234, వార్డులకు 1502 మంది బరిలో ఉన్నారు. తుది విడత సమరానికి శుక్రవారంతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. 92 జీపీలకు 663 మంది, 874 వార్డులకు 2297 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు అధికారులు నామినేషన్లను పరిశీలిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి వరకు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కొనసాగింది.

49 పంచాయతీలు ఏకగ్రీవం
జిల్లాలోని 301 పంచాయతీలకు మూడు విడతల్లో కలిపి ఇప్పటి వరకు 49 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. తొలి విడత 100 పంచాయతీలకు 18, రెండో విడత 109 జీపీలకు 27, మూడో విడత 92 పంచాయతీలకు నాలుగు ఏకగ్రీవమయ్యాయి. మూడో విడత ఎన్నికల నిర్వహణకు గడువు ఉండడంతో ఏకగ్రీవ పంచాయతీల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల ప్రక్రియ అనంతరం ఉపసంహరణకు గడువు ఉండడంతో పలు గ్రామాలు ఏకగ్రీవం దిశగా ఆలోచన చేస్తున్నాయి.

మూడు పంచాయతీలు ఏకగ్రీవం
జఫర్ జనవరి 19: మండలంలోని 21 గ్రామ పంచాయతీలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన శనివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం 116 మంది సర్పంచ్ పదవి కోసం నామినేషన్లు దాఖలు చేశారు. తమ్మడపల్లి(జీ) నుంచి ఒక నామినేషన్ తిరస్కరణకు గురి కాగా, 115 నామినేషన్లు సరిగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే, మండలంలోని 194 వార్డులకు 453 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో ఒకటి మాత్రమే తిరస్కరణకు గురి కాగా, 452 నామినేషన్లను అనుమతించినట్లు ఎంపీడీవో శ్రీధర్ తెలిపారు. తీగారం, ఏబీతండా(శంకర్ దుర్గ్యానాయక్ జీపీలకు సర్పంచ్, వార్డు సభ్యులకు సింగిల్ నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. తీగారం సర్పంచ్ గోనె జయపాల్ 10 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. ఏబీతండా(శంకర్ సర్పంచ్ బానోత్ తులసితోపాటు ఆరుగురు వార్డు సభ్యులు, దుర్గ్యానాయక్ సర్పంచ్ బాదావత్ దేవితోపాటు ఆరుగురు వార్డు సభ్యులుగా సింగిల్ నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.

153

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles