లెక్క తేలింది..

Fri,January 18, 2019 01:45 AM

- రెండో విడత ఉపసంహరణ పూర్తి
- ఎన్నికల బరిలో 1198 మంది
- 27 పంచాయతీలు, 239 వార్డులు ఏకగ్రీవం
- 56 సర్పంచ్‌లకు 158 మంది పోటీ
- 451 వార్డులకు 1040 మంది అభ్యర్థులు
- రఘునాథపల్లిలో రాని స్పష్టత
- గుర్తులు కేటాయించిన అధికారులు
జనగామ, నమస్తే తెలంగాణ, జనవరి 17: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత అభ్యర్థుల లెక్క తేలింది. గురువారం నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసి గుర్తులను సైతం కేటాయించారు. వారంతా శుక్రవారం నుంచి ప్రచారం చేపట్టనున్నారు. ఈనెల 25న రెండో విడత గుండాల, దేవరుప్పుల, కొడకండ్ల, రఘునాథపల్లి మండలాల్లోని 109 జీపీలు, 966 వార్డులకు ఎన్నికలు జరగనుండగా, 27 పంచాయతీలు, 239 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. రఘునాథపల్లి మినహా మిగిలిన 56 పంచాయతీలు, 451 వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించి గుర్తులు కేటాయించారు. దీంతో అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులతో ప్రచార సామగ్రి సిద్ధం చేసుకొని ఇంటింటి ప్రచారానికి సిద్ధమయ్యారు. మొదటి, రెండో విడత పోలింగ్ తేదీలు సమీపిస్తున్న కొద్దీ పల్లెల్లో రాజకీయం వేడెక్కుతోంది. పంచాయతీరాజ్ చట్టంలో నూతన సంస్కరణలు అమల్లోకి రావడంతో సాధారణ ఎన్నికల కన్నా పంచాయతీ ఎన్నికలను పల్లెవాసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ప్రతీ ఓటును లెక్కలోకి తీసుకొని వాటిని రాబట్టేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. అభ్యర్థులకు పార్టీ గుర్తులు లేకపోయినా రాజకీయ పార్టీల మద్దతుతోనే ప్రజల్లోకి వెళ్తున్నారు.

పల్లెపోరులో ఆదర్శ గ్రామాలు..
పల్లెపోరులో చాలా గ్రామాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. కలిసి ఉంటే గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేసుకోవచ్చనే ఉద్దేశంతో ఏకగ్రీవం వైపు అడుగులు వేశారు. జిల్లాలో ఈ నెల 21న మొదటి విడత ఎన్నికలు జరిగే ఐదు మండలాల పరిధిలో 100 పంచాయతీలకు 18 గ్రామాలు, 25న రెండో విడత ఎన్నికలు జరిగే నాలుగు మండలాల్లో 27 పంచాయతీ పాలకవర్గాలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో తాజాగా కొడకండ్ల మండలంలో 5, రఘునాథపల్లి మండలంలో 10, గుండాల మండలంలో 6, దేరుపుప్పుల మండలంలో 6 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో జిల్లాలో 301 పంచాయతీలకు 45 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. మొదటి, రెండో విడతలో 164 జీపీలకు ఈనెల 21, 25వ తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మరోపక్క ఈ నెల 30న మూడో విడత ఎన్నికలు జరిగే మరో నాలుగు మండలాల్లో కూడా ఏకగ్రీవ పంచాయతీలకు రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటి వరకు ఏకగ్రీవమైన పంచాయతీల్లో సర్పంచ్‌లు సహా కొద్ది వార్డులు మినహా మెజార్టీ గ్రామ వార్డు సభ్యులు సైతం ఒక్కో నామినేషన్ దాఖలు చేయడం, చివరి రోజు అభ్యర్థులు ఉపసంహరించుకున్న గ్రామాలు, వార్డులు ఉన్నాయి. ఏకగ్రీవ పల్లెలన్నీ దాదాపు టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు కావడం విశేషం. రెండో విడత ఏకగ్రీవ పల్లెల్లో గురువారం రాత్రి సంబురాలు చేసుకున్నారు. గుండాల మండలంలో పందుల రేఖ(పాచిల్ల), దుంపల శ్రీనివాస్(మరిపడిగ), ముసలి విజితారెడ్డి (కొమ్మయపల్లి), ఏలూరి రాంరెడ్డి(మాసాన్‌పల్లి), గూడ ఉపేంద్ర(సుద్దాల), తోటకూరి రాధిక (బురుజుబాయి) ఏకగ్రీవ సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు.

రెండో విడత బరిలో వీరే..
రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాత నాలుగు మండలాల్లో ఏకగ్రీవ సర్పంచ్, వార్డు సభ్యులు మినహా బరిలో నిలిచిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులను ఎన్నికల అధికారులు ప్రకటించారు. కొడకండ్ల మండలంలో 21 పంచాయతీలకు ఐదు ఏకగ్రీవం కాగా, మిగిలిన 16 పంచాయతీలకు 53 మంది, 190 వార్డులకు 72 ఏకగ్రీవం కాగా, మిగిలిన 118 వార్డులకు 284 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అదేవిధంగా గుండాల మండలంలో 20 జీపీలకు ఆరు ఏకగ్రీవం కాగా, మిగిలిన 14 పంచాయతీలకు 36 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 182 వార్డులకు 54 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 128 వార్డులకు 272 మంది బరిలో నిలిచారు. దేవరుప్పుల మండలంలో 32 గ్రామ పంచాయతీలకు ఆరు ఏకగ్రీవం కాగా, మిగిలిన 26 పంచాయతీలకు 69 మంది, 274 వార్డులకు 69 ఏకగ్రీవం కాగా, మిగిలిన 205 వార్డులకు 484 మంది పోటీ పడుతున్నారు. రఘునాథపల్లి మండలంలో 36 జీపీలకు పది, 320 వార్డులకు 80 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 26 జీపీలు, 240 వార్డుల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల లెక్క తేల్చడంలో అధికారులు అర్ధరాత్రి వరకు కసరత్తు చేస్తున్నారు.

రెండో రోజు నామినేషన్ల జోరు..
మూడో విడత స్టేషన్‌ఘన్‌పూర్, చిలుపూరు, జఫర్‌ఘడ్, పాలకుర్తి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. గురువారం రెండో రోజు సర్పంచ్, వార్డులకు అభ్యర్థులు ఉత్సాహంగా నామినేషన్లు దాఖలు చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలో సర్పంచ్ పదవులకు 32 మంది, వార్డులకు 101 మంది, చిలుపూరు మండలంలో సర్పంచ్ పదవులకు 28 మంది, వార్డులకు 43 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అదేవిధంగా పాలకుర్తి మండలంలో సర్పంచ్‌కు 79, వార్డులకు 150 మంది, జఫర్‌ఘడ్ మండలంలో సర్పంచ్‌కు 52 మంది, వార్డులకు 97 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు.

135
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles