చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

Thu,September 13, 2018 12:40 AM

-క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట
-గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలి
-ముగిసిన జిల్లా స్ధాయి క్రీడలు
-ఉమ్మడి వరంగల్ జిల్లా జెడ్పీచైర్‌పర్సన్ గద్దల పద్మ
నర్మెట, సెప్టెంబర్ 12: చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఉమ్మడి వరంగల్ జిల్లా జెడ్పీచైర్‌పర్సన్ గద్దల పద్మ అన్నారు. స్థానిక తెలంగాణ మోడల్ పాఠశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఉమ్మడి వరంగల్ మోడల్ పాఠశాలల విద్యార్థులకు జిల్లా స్థాయి క్రీడోత్సవాలు బుధవారం ముగిసాయి. పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ అనురాధ ఆధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ క్రీడల్లో జఫర్‌గడ్ మోడల్ పాఠశాలకు చెందిన విద్యార్థులు మొదటి స్థానం, మద్దూరు మోడల్ పాఠశాల రెండో స్థానం, టెన్నీస్ కాయిడ్ క్రీడల్లో నర్మెట మోడల్ పాఠశాల విద్యార్థి ఆకాశ్, కబడ్డీ, ఖోఖో క్రీడల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలకు విజేతలుగా నిలిచిన జట్లకు మెమెంటోలను అందజేశారు.

ఈ సందర్భంగా జెడ్పీచైర్‌పర్సన్ గద్దల పద్మ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. క్రీడల్లో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని చెప్పారు. క్రీడాకారులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రత్యేక వసతులు కల్పిస్తూ వారిలోని క్రీడానైపుణ్యత వెలికి తీసేందుకు సీఎం కేసీఆర్ అనేక ప్రోత్సాహకాలను అందించినట్లు చెప్పారు. ప్రతీ విద్యారిక్థి ఎదో ఒక క్రీడల్లో రాణించే సత్తా ఉంటుందన్నారు. క్రీడలు మానసికోల్లాసానికి దోహదం చేస్తాయని, శారీరక దారుఢ్యాన్ని పెంచుతాయని సూచించారు. విద్యార్థులు తప్పనిసరిగా చదువుతో పాటు క్రీడల్లో రాణించి ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో వరంగల్ ఆర్జేడీ పీ రాజీవ్, డీఐఈవో శ్రీనివాస్, ఎంఈవో భగవాన్‌నాయక్, పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్ గోపగాని రవిగౌడ్, పాఠశాలల ప్రిన్సిపాళ్లు అల్పావీ, శాంతకుమారి, నెల్లికుదురు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్, అధ్యాపక బృందం, విద్యార్థులు, పీడీలు తదితరులు పాల్గొన్నారు.

122
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles