టీఆర్‌ఎస్ దూకుడు

Wed,September 12, 2018 03:23 AM

జనగామ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపే లక్ష్యంగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అందుకనుగుణంగా పార్టీశ్రేణులు పల్లెలు, గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడికక్కడే ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో జోరుగా ప్రచారం కొనసాగుతుండగా భవిష్యత్ కార్యచరణపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అభ్యర్థులు నియోజకవర్గంలోని ముఖ్యనాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహలు రూపొందిస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రాంతంలోని మండలాలు, గ్రామాల్లో వాల్ రైటింగ్ చేపట్టారు. టీఆర్‌ఎస్ చేపట్టిన సంక్షేమ ఫలితాలను వివరిస్తూ బ్రహ్మాండంగా గోడలపై రాస్తున్నారు. జనగామ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆయా మండలాలు, గ్రామాల్లో పర్యటిస్తూ గ్రామ, మండలస్థాయి బూత్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మంగళవారం జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంలో జనగామ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించేలా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్టేషన్‌ఘన్‌పూర్ అభ్యర్థి తాటికొండ రాజయ్య నియోజకవర్గంలో పర్యటిస్తూ ముఖ్యనాయకులు, ప్రజా ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. రాజయ్య హన్మకొండలోని తన నివాసంలో మంగళవారం ముఖ్య నాయకులతో సమావేశమై ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొడుతూ ప్రచారం నిర్వహించేలా క్యాడర్‌ను సిద్ద్ధం చేస్తున్నారు.

పార్టీశ్రేణుల జోష్..!
ఈ నెల 6న అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత సీఎం కేసీఆర్ 105 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించిన దృష్ట్యా టీఆర్‌ఎస్ శ్రేణులు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు మరుసటిరోజు జిల్లాకు రాగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఆయన నుదుట వీరతిలకం దిద్ది నియోజకర్గంలోకి ఆహ్వానించారు. ఈ మేరకు భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా పార్టీశ్రేణులు నీరాజనం పలికారు. డప్పు చప్పుళ్లు, కోలాటాలు, నృత్యాల నడుమ నియోజకవర్గంలో పర్యటించారు. అదేరోజు పలుచోట్ల ప్రచారం కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి నిత్యం ముఖ్య నాయకులతో సమావేశమవుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రచా రం నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలనే విషయ మై చర్చిస్తున్నారు. ఇప్పటికే మండలాలు, గ్రామాల్లో ఇంటి యా జమానుల అనుమతితో గోడలపై వాల్ రైటింగ్ చేపట్టారు. దేవరుప్పుల మండలంలోని కోలుకొండ గుట్టపై సైతం వాల్ రైటింగ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలకు ఎర్రబెల్లి సమక్షంలో గులాబీ దళంలో చేరుతున్నారు.

దీంతో ఆయనకు ప్రజల నుంచి మరింత మద్ధతు లభిస్తోంది. జనగామ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సోమవారం జిల్లాలో అడుగుపెట్టారు. ఆయనకు నియోజకవర్గ ప్రజలు బ్రహ్మారథం పట్టారు. జిల్లా సరిహద్దు కాకతీయ తోరణం వద్ద నుంచి పార్టీశ్రేణులు ఘనస్వాగతం పలికారు. సుమారు 3 వేల బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు. పెంబర్తి నుంచి బయలుదేరిన ర్యాలీ జనగామ చౌరస్తా, నెహ్రూ సెంటర్ మీదుగా తిరిగి చౌరస్తా నుంచి యశ్వంతాపూర్ ఎల్లమ్మ దేవాలయం వద్దకు చేరి ముగిసింది. అక్కడ ఎల్లమ్మ మొక్కు చెల్లించిన ముత్తిరెడ్డి మాట్లాడారు. ఇదే ఉత్సాహంతో తన గెలుపునకు సహకరించాలని కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన జనగామ, తరిగొప్పుల మండలాల్లో పర్యటించారు. నాయకులు, కార్యకర్తలను కలిసి వారిలో ఉత్సాహాన్ని నింపారు. గ్రామాల వారిగా బూత్ కమిటీలు వేసి ప్రచారాన్ని హోరెత్తించాలని వ్యూహ రచన చేస్తున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ అభ్యర్థి రాజయ్య అసెంబ్లీ రద్దు అయిన మరుసటిరోజు నియోజకవర్గానికి వచ్చారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అదే ఉత్సాహంతో మరుసటి రోజు ఆయన రఘునాథపల్లి, లింగాలఘణపురం, జఫర్‌గడ్ మండలాల్లో పర్యటించారు. హన్మకొండలోని తన నివాసంలో మంగళవారం మరోసారి ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. స్థానిక పరిస్థితులు, ప్రచారం తీరుతెన్నులపై వా రితో చర్చించారు. రేపటి నుంచి ప్రచారాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చా రు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ అనుబంధ సంఘా లు రంగంలోకి దిగి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.

130
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles