ముత్తిరెడ్డిని మరోసారి దీవించండి

Wed,September 12, 2018 03:22 AM

జనగామ, నమస్తే తెలంగాణ, సెప్టెంబర్ 11 : కరువుగడ్డ జనగామ ప్రాంతంలో చెరువులు నింపి రైతులకు ఆర్ధిక భరోసా కల్పించి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేస్తున్న ముత్తిరెడ్డ్డిని మరోసారి దీవించి ఎమ్మెల్యేగా గెలిపించాలని భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిధిగృహంలో తాజా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, మున్సిపల్, మార్కెట్ చైర్‌పర్సన్లు గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, బండ పద్మ, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ ఇర్రి రమణారెడ్డి, ఎంపీపీ బైరగోని యాదగిరిగౌడ్‌తో కలిసి లక్ష్మినర్సింహ వృత్తిదారుల ప్రమాద బీమా కింద విడుదలైన రూ.5లక్షల చెక్కును బచ్చన్నపేటకు చెందిన మృతుడు ముద్దగాని సురేశ్ సతీమణి లక్ష్మికి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎమ్మెల్యే హోదాను పక్కనబెట్టి నీరటిలా చెరువులు నింపుతూ రైతుల కోసం కష్టపడిన ముత్తిరెడ్డిని ప్రజలు మరోసారి ఆశీర్వాదించాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ప్రగతి బాటలు వేసిన నాయకుడిని మరచిపోవద్దని కోరారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థికి పట్టం గట్టడం వల్ల నియోజవకర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకునే వీలుంటుందన్నారు. జనగామ పట్టణ సుందరీకరణ, జంక్షన్ అభివృద్ధి వంటి పనులకు ఇటీవల రూ.30 కోట్లు విడుదలయ్యాయని, సూర్యాపేట-సిద్ధిపేట జాతీయ రహదారి, జనగామకు ఔటర్‌రింగ్‌రోడ్డు త్వరలో మంజూరు కానున్నాయన్నారు.

టీడీపీ-కాంగ్రెస్‌లది అనైతిక పొత్తు
రాష్ట్రంలో టీడీపీ-కాంగ్రెస్ పార్టీలు అనైతిక పొత్తుకు తెరతీస్తుండటం దురదృష్టకరమని, వీరికి ఓటువేస్తే కాటికి ఓటు..తెలంగాణకు చేటు(కాంగ్రెస్-టీడీపీ) అనే నినాదంతో ప్రజలను చైతన్యం చేయాలని ఎంపీ నర్సయ్య టీఆర్‌ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ ఆస్తులు, మళ్లీ పెత్తనం కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిత్తులమారి నక్క మాదిరిగా కుటిలపొత్తులకు నాంది పలుకుతున్నారని మండిపడ్డారు. ఉద్యమనేత కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే చంద్రబాబు ఇన్ని కుట్ర లు చేస్తుంటే ఇక కాంగ్రెస్-టీడీపీ కలిస్తే మళ్లీ వలస పాలన తప్పదన్న సంగతి ప్రజలు గమనించాలన్నారు. హైదరాబాద్‌లోని షెడ్యూల్డ్ 9,10 ఆస్తులపై బాబు కన్నుపడిందన్నారు. వృత్తిదారుల బీమా కింద భువనగిరి పార్లమెంట్ పరిధిలోని 7నియోజకవర్గాల్లో 1.17 లక్షల మందికి బీమా కల్పించామని, వారిలో ఆరునెలల్లో 9మందికి రూ.70లక్షలు చెల్లించామని చెప్పారు. వీరి వెంట టీఆర్‌ఎస్ పట్టణ, మండల అధ్యక్షుడు బండ యాదగిరిరెడ్డి, కళింగరాజు, పసుల ఏబెల్, సిద్ధిలింగం, వంగ ప్రణీత్‌రెడ్డి, డాక్టర్ సుధా సుగుణాకర్‌రాజు, దామెర రవి, రవి, వేముల సాగర్‌గౌడ్, లక్ష్మణ్‌గౌడ్, కొమ్ము రాజు, బాలకిషన్, ఫెరోజ్, సిద్దులు, సతీశ్‌రెడ్డి, నర్సింగ్, లెనిన్, ప్రభాకర్ ఉన్నారు.

129
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles