అగ్నికణం ఐలమ్మ..


Mon,September 10, 2018 12:22 AM

-నేడు 33వ వర్ధంతి
-పాలకుర్తి మార్కెట్‌కు చాకలి ఐలమ్మ పేరు
-ట్యాంక్ బండ్‌పై విగ్రహ ఏర్పాటుకు ఎర్రబెల్లి దయాకర్‌రావు కృషి
పాలకుర్తి/పాలకుర్తి రూరల్, సెప్టెంబర్ 09: ఆమె అమరగీతం.. మేరిసే ఎర్రటి విప్లవ జ్యోతి.. పోరు బాట పట్టించిన విప్లవనారి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దారి చూపిన వీరవనత. ఆమే చాకలి ఐలమ్మ అలియాస్ చిట్యాల ఐలమ్మ. ఎర్రని పూదోటలో ఐలమ్మ అగ్నికణం. తెలంగాణ సాయుధ పోరాటం గురించి ఎక్కడ మాట్లాడినా.. ముందుగా గుర్తొచ్చేది ఐలమే. సాయుధ పోరాటానికి నాంది పలకడానికి ఆమె భూ సమస్యే వేదికైంది. దొరలు ఆక్రమించిన భూమిపై ప్రతిఘటించి విజయం సాధించిన వీరనారి ఆమె. దొరల పెత్తనాన్ని కొంగును నడుం బిగించి ఎదురించిన వీరవనిత ఐలమ్మ, సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తినిచ్చింది. ఆమె వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం..

ఐలమ్మ ఉద్యమం గురించి తెలుసుకునే ముందు ఆనాడు తెలంగాణ ప్రాంతంలో నెలకొన్న సాంఘిక, ఆర్థిక రాజకీయ పరిస్థితులు రైతాంగ సాయుధ పోరాటానికి ఏ విధంగా ఉత్ప్రేరకమయ్యాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 1948 ప్రాంతంలో అసప్జాహి వంశ పరిపాలనా కాలంలోని చివరి దశ అధికారం, అహంకారం పరస్పరం పెనవేసుకున్నాయి. ప్రజల కనీస అవసరాలను కాలదన్ని పౌరహక్కులను పాతరేసి జనాలను అణగ దొక్కిన కాలమది. స్వాతంత్రోద్యమం ముగింపు దశకు చేరకుంటున్న దశలో ఇక్కడ హత్యలు అరాచకాలు, అఘాయిత్వం ముస్కురంగా సాగాయి. వెట్టిచాకిరి, హింస రాజ్యమేలాయి. ఈ నేపథ్యంలోనే నిజాం అడుగులకు మడుగులొత్తే దొరలకు వ్యతిరేకంగా గ్రామాల్లో ప్రజా పోరు ప్రారంభమైంది. ఈ పొగ, సెగలు తన పీఠాన్ని కదిలిస్తుందని గ్రహించిన నిజాం రక్తపిసాసి మతోన్మాది అయిన ఖాశీం రజ్వీని అతడి నాయకత్వంలో రజాకర్లను తెలంగాణ ప్రజల పైకి ఉసిగొల్పాడు. (రజాకర్ అంటే స్వయం సేవకుడు) స్వయం సేవకులు నరరూప రాక్షసులై గృమదహనాలు, మానభంగాలు, హత్యలు, లింగ వయోభేదం లేకుండా తల్వార్లతో నరికి చంపడం ప్రశ్నించిన వారి ప్రాణాలు తీ యడం ఆనాటి వారి నిత్యకృత్యాలు. ఒక రకంగా చరిత్రలో చీకటి అధ్యాయంగా చెప్పవచ్చు.

అయిలమ్మ భూపోరాటం 1921లో తెలుగు భాషా సంస్కతుల పరిరక్షణే ఉద్యమంగా ప్రారంభమైన ఆంధ్రజన సంఘం మారిన పరిస్థితుల కారణంగా రాజకీయ స్వరూపాన్ని సంతరించుకుంది. 1944లో భువనగిరి మమాసభ నాటికి కమ్యూనిస్టుల ప్రాభల్యంతో చరమగితం పాడడమే అక్ష్యంగా భూమి, భుక్తి కొసం పోరాటం మొదలైంది. ఈ మహాసభతో ఉత్తేజం పొందిన అయిలమ్మ ఆంధ్ర మహాసభ.కార్యకర్తగా చేరి చూరుకుగా పనిచేసింది. మండలంలోని మల్లంపల్లి దొరల నుంచి కౌలుకు తీసుకున్న భూములను విస్నూరు దేశ్‌ముఖ్ కిరాయి గుండాలు పంట పోలాలపై దాడులు నిర్వహించి ధాన్యాన్ని స్వాధీన పరుచుకున్నారు. ఈ క్రమంలో ఆంధ్ర మహాజన సభ కార్యకర్తలు ఐలమ్మకు అండగా నిలిచారు. కిరాయి రౌడీలను తరిమికొట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు. ఐలమ్మ 1895లో రాయపర్తి మండలం కిష్టాపురంలో జన్మించింది. పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యను వివాహం చేసుకుని చివరకు 1985 సెప్టెంబర్ 10 న తుది శ్వాస విడిచింది.
ఆమె దూరమై నేటికి 33ఏళ్లు.
స్వరాష్ట్రంలోనే ఐలమ్మకు తగిన గుర్తింపు
తెలంగాణ ప్రాంతంలో పోరాటయోధులకు తగు గుర్తింపు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకే దక్కింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధురాలు చాకలి (చిట్యాల) ఐలమ్మ విగ్రహాన్ని హైదరాబాద్‌లోట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసేందుకు పాలకుర్తి తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు సీఎం దృష్టికి తీసుకెళ్లగా స్పందించారు. అలాగే పాలకుర్తిలోని మార్కెట్ యార్డ్‌కు చాకలి ఐలమ్మ పేరును నామకరణం చేయించారు. వీరనారి ఐలమ్మ చరిత్రను భావితరాలకు అందేవిధంగా ఎర్రబెల్లి చేసిన కృషి ఫలించబోతున్నందుకు ఈ ప్రాంత స్వాతంత్ర సమరయోధులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తునారు.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...