కారు.. జోరు

Sun,September 9, 2018 01:13 AM

జనగామ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణుల్లో ఎన్నికల సందడి నెలకొంది. కొత్త ఉత్సాహంతో ప్రచారం నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. కారు వేగానికి ప్రతిపక్షాలు బిత్తర పోతున్నాయి. ఈ నెల 6న ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసిన వెంటనే 105 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఇంకా 14 స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించాల్సి ఉంది. జనగామ జిల్లాలో మూడు నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారు అయ్యారు. ఇక్కడ సిట్టింగ్‌లకే సీట్లు కేటాయించారు. ఈ మేరకు అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు.

తాజా మాజీ ఎమ్మెల్యే, పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు శుక్రవారం నియోజకవర్గంలో పర్యటించారు.ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. బైక్‌ర్యాలీలు నిర్వహించారు.ఈ మేరకు ఎర్రబెల్లి తొర్రూరులో ప్రచారం సైతం నిర్వహించారు. అదే విధంగా స్టేషన్ ఘన్‌పూర్ అభ్యర్థి తాటికొండ రాజయ్య సైతం నియోజకవర్గంలో పర్యటించారు. ఆయనకు కూడా పార్టీశ్రేణుల నుంచి ఘనస్వాగతం లభించింది. ఆయన ప్రచారం నిర్వహించేందుకు నాయకులు, కార్యకర్తలతో సమాలోచనలు చేస్తున్నారు. జనగామ నియోజకవర్గ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సైతం ప్రచారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహించేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

గులాబీ జోష్
జిల్లాలో గులాబీ దండు దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే అభ్యర్థులు ఖరారు కావడంతో ఏ విధంగా ప్రచారం నిర్వహించాలనే విషయమై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లోని మండలాలు, గ్రామాల వారీగా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గతంలో కంటే భారీ మెజార్టీతో గెలిచేలా వ్యూహలు సిద్ధం చేస్తున్నారు. టీఆర్‌ఎస్ దెబ్బకు ప్రతిపక్షాలు బెంబేలెత్తిపోతున్నాయి. ఇప్పటికీ ఆయా పార్టీల్లో పూర్తి స్థాయి స్పష్టత రాని కారణంగా క్యాడర్ అయోమయంలో పడుతోంది. జనగామ నియోజకవర్గానికి సంబంధించి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు కొనసాగుతున్నాయి.

టీపీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నియోజకవర్గంలో జాడ లేకుండా పోయారు. ఈ సారి ఆయనకు టికెట్ ఇవ్వద్దని ఇప్పటికే స్థానిక నాయకత్వం అధిష్టానానికి విన్నవించింది. ఎన్నికల సమీపిస్తున్న దృష్ట్యా మరోసారి అగ్రనేతలను కలిసి టికెట్ తమకు కేటాయించాలని వైరి వర్గం సిద్ధమవుతున్నట్లు సమాచారం. పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు ఎవరనే విషయంలో స్పష్టత లేకుండా పోయింది. బీజేపీ, టీడీపీ, వామపక్ష పార్టీల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అభ్యర్థులు ఎవరనేది తేల్చుకోలేని స్థితిలో ఆయా పార్టీల అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్ పెంచేందుకు పావులు కదుపుతున్నారు.

95
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles