విజయోస్తు


Sat,September 8, 2018 02:01 AM

-ఉప్పెనలా తరలివచ్చి టీఆర్‌ఎస్‌కు మద్దతు పలికిన జనం
-నాలుగేండ్ల పాలనకు జేజేలు.. మళ్లీ రావాలంటూ నినాదాలు
-హుస్నాబాద్ తనకు సెంటిమెంటన్న ముఖ్యమంత్రి
-ఈ ప్రాంత ప్రజలు ఆశీర్వదిస్తే విజయమేనని ధీమా..
-సభ సక్సెస్.. టీఆర్‌ఎస్ శ్రేణుల్లో జోష్..
సిద్దిపేట ప్రతినిధి/హుస్నాబాద్, నమస్తే తెలంగాణ : ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ అధికారంలోకి వచ్చాక స్వయంగా వచ్చి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతా.. హుస్నాబాద్ అంటేనే మొదటి నుంచి సెంటిమెంట్‌గా భావిస్తాను.. గతంలోనూ ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరించి ఘన విజయం సాధించాం.. ఈసారి కూడా ఇక్కడి నుంచే ప్రజల ఆశీర్వాదం తీసుకుంటున్నా.. శ్రావణ శుక్రవారం రోజున హుస్నాబాద్ గడ్డ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం ఆనందంగా ఉంది.. ఇక్కడి ప్రజల ఆశీర్వాదం తీసుకొని ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతా.. ప్రజలు నిండు మనస్సుతో ఆశీర్వదించి రాష్ట్రంలో ఎన్నికల యాత్ర దిగ్విజయంగా జరిగేలా చూడాలని సీఎం కేసీఆర్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలోని ఆర్టీసీ డిపో సమీపంలో ఆశీర్వాదసభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపే గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్లను పూర్తి చేయించి నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 1.65లక్షల ఎకరాలకు సాగునీందిస్తామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి హుస్నాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఉన్నదని, అందుకే ఈ నియోజకవర్గంపై మొదటినుంచి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. ఇక్కడి సమస్యలను భుజాన వేసుకొని పరిష్కరిస్తానన్నారు. హుస్నాబాద్ ప్రాంతం ఎంతో చైతన్యవంతమైందని, అభివృద్ధిలోనూ ముందుంచి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రాజెక్టుల సామర్థ్యం పెంచితే స్వార్థం అవుతుందా..?
కాంగ్రెస్ హయాంలో కసికెడు నీళ్లుకూడా పట్టని ప్రాజెక్టులకు రూపకల్ప చేశారని కేసీఆర్ విమర్శించారు. ఇటువంటి ప్రాజెక్టులకు రీడిజైన్ చేసి సామర్థ్యం పెంచితే స్వార్థం ఎలా అవుతుందని ప్రశ్నించారు. గౌరవెల్లి రిజర్వాయర్‌లో కనీసం ఒక పెద్ద చెరువులో పట్టే నీళ్లు కూడా ఉండే పరిస్థితి లేకుండా డిజైన్ చేశారన్నారు. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను స్వయంగా సందర్శించి సామర్థ్యం పెంచితే తప్ప ప్రయోజనం ఉండదని భావించి గౌరవెల్లిని 8.23టీఎంసీలకు పెంచామన్నారు. రెండు రిజర్వాయర్ల ద్వారా సాగువిస్తీర్ణం 1.65లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. ఏ పని చేపట్టినా శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడేలా ఉండే పనులు మాత్రమే చేస్తున్నామన్నారు. మహాసముద్రం గండి, శనిగరం, సింగరాయ ప్రాజెక్టులు, హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులను పునరుద్ధరించి చిన్న నీటి వనరులను అభివృద్ధి చేశామన్నారు. అలాగే 2014ఎన్నికల ప్రచారంలో గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని హామీ ఇచ్చామని, హుస్నాబాద్ ప్రాంతంలోని 13గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి చూపించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేని ప్రతిపక్షాల నాయకులు గుర్తించాలన్నారు. ప్రజలకు ఏది అవసరమో అది చేసుకుంటూ పోతే ఇందులో స్వార్థం ఉందని ఆరోపణలు చేయడం కాంగ్రెసోళ్ల దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు.

సతీశ్‌కు నా దీవెనలు ఎల్లప్పడూ ఉంటయ్..
నిరాడంబరుడు, ఎంతో ఓపికతో ఉండే ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ నా తమ్ముడి లాంటి వాడు...ఆయనకు నా దీవెనలు ఎల్లప్పుడూ ఉంటయ్...అని సీఎం కేసీఆర్ అన్నారు. కెప్టెన్‌సాబ్‌తో 19ఏండ్ల అనుబంధం ఉందన్నారు. ఆయన కొడుకుగా సతీశ్ ఎంతో దగ్గరివాడన్నారు. సతీశ్ కృషితోనే హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ అయ్యిందన్నారు. ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో నిధులిచ్చాం. నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగింది. సతీశ్‌ను ఆశీర్వదించి రాబోయే ఎన్నికల్లో గతంలో కంటే రెట్టింపు మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గ రూపురేఖను మార్చేందుకు ఆయన సిద్ధంగా ఉన్నాడన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే హుస్నాబాద్ నియోజకవర్గం భ్రష్టుపడుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పటి వరకు తాగు, సాగునీరిచ్చే పనులు చివరిదశకు చేరుకున్నాయని, ఇక్కడి ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఇవి మొత్తం ఆగిపోతాయన్నారు. కాంగ్రెస్ గెలిస్తే నీళ్లుండవు, నిధులుండవు, కరెంట్ కూడా ఉండదన్నారు. ఐదేండ్ల క్రితం వరకు నియోజకవర్గం ఎలా ఉందో మళ్లీ అలాగే తయారవుతున్నది. నిరంతరం అభివృద్ధిని కాం క్షిస్తూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుంచాలనే ఆలోచనలో ఉన్న సతీశ్‌కుమార్‌ను గెలిపిస్తేనే ఇక్కడి ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. ఒక్క పిలుపుతో వేలాదిగా తరలివచ్చిన హుస్నాబాద్ ప్రజల నమ్మకాన్ని నిలబెడతానని హామీ ఇచ్చారు. బహిరంగసభలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, మండలి చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, ఫారూఖ్‌హుస్సేన్, భానుప్రసాదరావు, వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, రసమయి బాలకిషన్, పుట్ట మధు, గంగుల కమలాకర్, యాదగిరిరెడ్డి, విద్యాసాగర్‌రావు, బొడిగె శోభ, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పన్యాల భూపతిరెడ్డి, కరీంనగర్ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, బండ ప్రకాశ్, జడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, ఎంపీపీ భూక్య మంగ, మార్కె ట్ చైర్మన్ తిరుపతిరెడ్డి, నియోజకవర్గంలోని ఏడు మండలాల ఎంపీపీ, జడ్పీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, టీఆర్‌ఎస్ మండల పార్టీల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...