ఎంసీహెచ్‌లో నిధుల గోల్‌మాల్..!

Wed,July 10, 2019 01:20 AM

-పెద్ద డాక్టర్ మాయాజాలం..?
-రూ. 40 లక్షల భారీస్కాం..?
- ఆహారం, మందుల కోసం ఖర్చు
-రాష్ట్ర ప్రోగ్రాం ఆఫీసర్ తనిఖీలో బట్టబయలు
-ఆడిట్‌కు ఆదేశాలు
జనగామ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కంచే చేను మేసిన చందంగా తయారైంది ఎంసీహెచ్(మాతాశిశు ఆరోగ్యకేంద్రం) దవాఖాన పరిస్థితి. ఆస్పత్రి ఆలనా పాలనా చూడాల్సిన పెద్ద డాక్టరే భారీ కుంభకోణానికి తెరదీశారు. గర్భిణుల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన బడ్జెట్‌లో సగానికి పైగా నొక్కేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై కొద్దిరోజులుగా ఆస్పత్రి వర్గాల్లో కుంభకోణంపై ప్రచారం జరుగుతుండగా స్టేట్ హెల్త్ ప్రోగ్రాం ఆఫీసర్ మంగళవారం దవాఖానను తనిఖీచేసిన నేపథ్యంలో ఈ భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. ఈమేరకు ఆ అధికారి 2018-19 సంవత్సరానికి ఆస్పత్రికి మంజూరైన బడ్జెట్, చేసిన ఖర్చుపై ఆడిట్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో అవినీతికి పాల్పడిన అధికారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నట్లు తెలుస్తోంది.

ఆహారం, మందుల ఖర్చుకు రూ.40 లక్షలు ఖర్చు చేసినట్లు బిల్లులు?
రాష్ట్రప్రభుత్వం రెండేళ్ల కిందట జిల్లా కేంద్రానికి సమీపంలోని చంపక్‌హిల్స్‌లో ఎంసీహెచ్ దవాఖానను ఏర్పాటుచేసింది. నాటి నుంచి ఆస్పత్రిలో రోజుకు పెద్దసంఖ్యలో ప్రసవాలు జరుగుతున్నాయి. ఈమేరకు ఆస్పత్రికి వచ్చే గర్భిణుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం జాతీయ ఆరోగ్య మిషన్ కింద బడ్జెట్ కేటాయిస్తోంది. డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ అకౌంట్ ద్వారా కలెక్టర్, డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో ప్రతినెలా ఆస్పత్రి అవసరాన్ని బట్టి నిధులు విడుదల అవుతున్నాయి. ఆస్పత్రికి పెద్దదిక్కైన అధికారి ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రత్యేక పరిస్థితుల్లో బడ్జెట్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఆస్పత్రిలో గర్భిణి చేరిన నాటి నుంచి ఆరోగ్య పరీక్షలు, పోషకాహారం, మందుల వినియోగం, రవాణా, తదితర అవసరాల కోసం ఈ డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆస్పత్రిలో అందుబాటులో లేని మౌలిక సదుపాయాల నిమిత్తం మాత్రమే బడ్జెట్‌ను వినియోగించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కానీ ఇక్కడి అధికారి తన ఇష్టానుసారంగా కేవలం ఆహారం, మందుల కోసం 2018-19 సంవత్సరానికి రూ.40 లక్షలు ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా వైద్య విధాన పరిషత్ నుంచి కూడా ఒక గర్భిణి పేరిట రూ.39 వేలు మంజూరవుతుండగా ఆ మొత్తం డబ్బులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు సర్వత్రా ఉత్పన్నమవుతున్నాయి.

నిబంధనలకు పాతర..!
ఎంసీహెచ్‌కు పెద్ద దిక్కైన ఆ అధికారి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. దీంతో దవాఖానలో పాలన గాడి తప్పిందనే ఆరోపణలున్నాయి. పెద్ద సార్ బలహీనతను ఆసరాగా చేసుకున్న మిగతా వైద్యసిబ్బంది ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలూ లేకపోలేదు. ఈవిషయమై వైద్యసిబ్బందిని మందలిస్తే ఎక్కడ తన బండారం బయటపడుతుందనే భయంతో కిక్కుమనకుండా ఉన్నాడని తెలుస్తోంది. ఆస్పత్రిలో అందుబాటులో లేని మందులు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు టెండర్‌ను ఆహ్వానించాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ అవేమీ పట్టని అధికారి తనకు తోచినట్లుగా బడ్జెట్‌ను వినియోగిస్తూ తప్పుడు లెక్కలు రాస్తూ పెద్ద మొత్తంలో వెనకేసుకున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. రాష్ట్ర ఆర్యోగ ప్రోగ్రాం అధికారి మంగళవారం ఆస్పత్రిని తనిఖీ చేసిన సందర్భంగా ఈ బండారం బయటపడటం, లెక్కలు అడిగినప్పుడు అధికారి ఆగమాగమైనట్లు తెలుస్తోంది. 2018-19 సంవత్సరానికి ఆస్పత్రి నిర్వహణకు ఖర్చు చేసిన బడ్జెట్‌పై ఆడిట్‌కు ఆదేశించిన నేపథ్యంలో మరికొద్దిరోజుల్లో ఎంతమేరకు డబ్బులు గోల్‌మాల్ అయ్యాయనే వాస్తవం వెలుగు చూడనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

హెల్త్ ప్రోగ్రాం అధికారి తనిఖీలు
జనగామ టౌన్ : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు జనగామ ఎంసీహెచ్ సెంటర్‌ను రాష్ట్ర హెల్త్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రాజశేఖర్‌బాబు మంగళవారం ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ తనిఖీల్లో ఆస్పత్రిలో గర్భిణులకు అందజేస్తున్న సేవలతో పాటు ప్రసవాల విషయంలో వైద్యులు తీసుకుంటున్న జాగ్రత్తలను ప్రత్యేకంగా ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని ల్యాబ్, మెడికల్ విభాగంతో పాటు వైద్యపరీక్షలు నిర్వహించే ఓపీ విభాగాలు, ఆపరేషన్ థియేటర్, స్కానింగ్ పరికరాలను పరిశీలించి వైద్యులకు, వైద్యసిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం డాక్టర్ రాజశేఖర్‌బాబు విలేకరులతో మాట్లాడారు. మాతాశిశు ఆరోగ్యకేంద్రంలో ప్రసవాల సంఖ్య పెంచేందుకు వైద్యులు కృషిచేయాలని ఆయన వైద్యులను ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రికి వచ్చిన గర్భిణులతో మర్యాదగా ప్రవర్తిస్తూ సాధారణ ప్రసవాలు చేపట్టి సంపుర్ణ ఆరోగ్యంగా ఇంటికి పంపించాలని ఆయన సూచించారు. ఈమేరకు జనగామ ఎంసీహెచ్‌లో అనేకంగా గుర్తించబడిన సమస్యలు, వైద్యుల పొరపాట్లను వెంటనే సరిచేసుకోవాలని సంబంధిత పర్యవేక్షకులు, వైద్యులకు సూచించినట్లు తెలిపారు. ఎంసీహెచ్ దవాఖానలో 120 మంది వైద్యసిబ్బంది ఉన్నారని, ఈ సిబ్బందితో మెరుగైన సేవలను అందించవచ్చన్నారు. ఇక్కడ అన్ని రకాల సేవలును అందిస్తున్నట్లు ప్రజలకు తెలిపారు. కావున ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురికాకుండా ప్రభుత్వ దవాఖానాల్లోనే ప్రసవాలు చేయించుకోవాలన్నారు. దవాఖానలో వైద్యులు అందుబాటులో లేకున్నా వైద్యులు పట్టించుకొకపోయినా వెంటనే జిల్లా వైద్యాధికారికి లేదా జిల్లా ప్రధాన దవాఖాన పర్యవేక్షకులకు సమాచారం అందించగలరని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ఏ మహేందర్, జిల్లా ప్రధాన దవాఖాన పర్యవేక్షకులు డాక్టర్ పీ రఘు, ఎంసీహెచ్ పర్యవేక్షకులు డాక్టర్ ఏ శ్రీనివాస్, జనగామ ఉప వైద్యాధికారి డాక్టర్ అశోక్‌కుమార్‌తో పాటు వైద్యశాల వైద్యులు, వైద్యసిబ్బంది ఉన్నారు.

84
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles